
📌 Key Points
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విష్ణుమూర్తి విగ్రహం వెలుగులోకి.
- ఈ విగ్రహం కాకతీయుల కాలం నాటిదని చరిత్రకారుల అభిప్రాయం.
- గుప్త నిధుల కోసం తవ్వకాలలో విగ్రహం ధ్వంసం అయి ఉండవచ్చని గ్రామస్తుల అనుమానం.
- విగ్రహాన్ని భద్రపరచాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అటవీ ప్రాంతంలో విష్ణుమూర్తి విగ్రహం బయటపడటం సంచలనం సృష్టించింది. ఈ విగ్రహం కాకతీయుల కాలం నాటిదని భావిస్తున్నారు. దీనిపై పురావస్తు శాఖ అధికారులు దృష్టి సారించారు.
అడవిలో బయటపడ్డ విష్ణుమూర్తి విగ్రహం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారం మండలం చింతకాని గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఒక వాగులో విష్ణువు విగ్రహం బయటపడింది. నిజానికి ఈ విగ్రహం మూడు సంవత్సరాల కిందటే కనిపించింది. అప్పట్లో చేపలు పట్టేందుకు వెళ్లినవారు చూశారు. కొన్ని రోజులు పూజలు చేశారు. తర్వాత అలాగే వదిలేయడంతో ఇసుకలో కూరుకుపోయింది.
మళ్లీ ఈ ఏడాది తాజాగా కొన్ని రోజుల కిందట కొంతమందికి విగ్రహం తల భాగం కనిపించింది. దీంతో ఈ విషయం మరోసారి బయటకు వచ్చింది. విగ్రహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత చింతకాని, జగ్గయపల్లి గ్రామస్థులు విగ్రహాన్ని బయటకు తీశారు. అయితే విగ్రహంపై రెండు గ్రామాల ప్రజల మధ్య చర్చ నడిచింది. విగ్రహం తన చేను దగ్గరలో బయట పడిందని, ఆలయ నిర్మాణానికి స్థలం ఇస్తానని ఓ రైతు చెప్పాడు. ఈ విగ్రహ రూపాన్ని బట్టి కాకతీయుల కాలంనాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. విగ్రహం కొన్ని చోట్ల ధ్వంసమైంది. గుప్తనిధుల తవ్వకాల్లో విగ్రహం ధ్వంసమై ఉంటుందని గ్రామస్థులు పేర్కొన్నారు.
కాకతీయుల కాలం నాటి శిల్పంగా గుర్తింపు
ఈ విగ్రహం 12వ శతాబ్దానికి చెందినదని, కోటకు సమీపంలో చక్కగా చెక్కబడిన విష్ణు మూర్తి శిల్పంలా కనిపిస్తుందని, చాలా సంతోషంగా ఉందని స్థానికులు అంటున్నారు. ఈ విగ్రహం కాకతీయ కాలం నాటిదని చెప్పవచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. ఇది అప్పటి హస్తకళకు నిదర్శనమన్నారు.
శిల్పం అనేక చోట్ల దెబ్బతిన్నట్లు గమనించవచ్చు. అయితే ఆగమ శాస్త్రం ప్రకారం అటువంటి విగ్రహం ఆచార పూజకు తగినది కాదని కొందరు చెబుతున్నారు. వారసత్వ పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం విగ్రహాన్ని భద్రపరచాలని కోరుతున్నారు. విగ్రహం కచ్చితమైన కాలం, చారిత్రక సందర్భాన్ని నిర్ణయించడానికి పురావస్తు శాఖ అధికారులు ఇంకా వివరణాత్మక పరీక్ష నిర్వహించలేదు.
విగ్రహంపై పురావస్తు శాఖ పరిశీలన
కాటారం మండలంలో స్థానికులు విష్ణువు శిల్పాన్ని కనుగొన్నట్లు మాకు సమాచారం అందిందని తెలంగాణ రాష్ట్ర పురావస్తు శాస్త్ర సహాయ డైరెక్టర్ బుజ్జి అన్నారు. మేం ఆ ప్రదేశాన్ని సందర్శించి, విగ్రహాన్ని పరిశీలించి, తరువాత దానిని తరలించడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ విగ్రహానికి ఆలయం కట్టిస్తారా? లేదంటే పురావస్తు శాఖ అధికారులు స్వాధీనం చేసుకంటారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
చింతకాని, జగ్గయపల్లి గ్రామస్తులు విగ్రహాన్ని బయటకు తీశారు. దీని చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, పురావస్తు శాఖ తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.


