
📌 Key Points
- యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో స్థానిక మార్కెట్లో గుడ్డు ధర ₹3కి పడిపోయింది.
- రాయలసీమ నుంచి గల్ఫ్‌కు ఎగుమతి అయ్యే అరటి పండ్లు రేవుల్లోనే నిలిచిపోవడంతో కేజీ ₹10కి పడిపోయింది.
- సుమారు 40% నాన్-బాస్మతీ బియ్యం ఎగుమతులు నిలిచిపోయి, 4 లక్షల టన్నుల బియ్యం పోర్టుల్లో పేరుకుపోయాయి.
- యుద్ధం కొనసాగితే ఏపీ ఎగుమతి రంగం కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని ఆర్థిక విశ్లేషకుల అంచనా.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత్ నుంచి అరబ్ దేశాలకు ఎగుమతులు తగ్గిపోయాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గుడ్లు, అరటి, బియ్యం ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
యుద్ధ ప్రభావంతో ఎగుమతులపై తీవ్ర నష్టం
ఇజ్రాయెల్, అమెరికా vs ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు (Tensions in West Asia) కొనసాగుతున్నాయి. హోర్ముజ్ జలసంధి మూసివేయడంతో పాటు అరబ్ కంట్రీస్ (Arab countries)కి వెళ్లాల్సిన వివిధ రవాణా వ్యవస్థలు తగ్గిపోయాయి. దీంతో భారత్ నుంచి అరబ్ కంట్రీస్‌కు ఎగుమతులు తగ్గిపోవడంతో.. ఎగుమతి రంగంపై కోలుకోలేని దెబ్బ కొడుతుంది. గల్ఫ్ దేశాలకు గుడ్లు, రొయ్యలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల వాటానే 54% కాగా, కేవలం ఏపీ వాటానే 20% వరకు ఉంది. యుద్ధం కారణంగా రవాణా మార్గాలు స్తంభించిపోవడంతో ఎగుమతులు నిలిచిపోయి. దీంతో కావాల్సిన దానికంటే ఎక్కువ స్థాయిలో గుడ్లు అందుబాటులో ఉండటం తో స్థానిక మార్కెట్లో ధరలు దారుణంగా పడిపోతున్నాయి. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు లక్షలాది మంది రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ముఖ్యంగా కోళ్ల పరిశ్రమ, ఉద్యానవన రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన గుడ్ల ఎగుమతులు ఆగిపోవడంతో స్థానిక మార్కెట్లో గుడ్డు ధర కేవలం ₹3కి పడిపోయింది. అటు రాయలసీమ నుంచి గల్ఫ్‌కు నిరంతరం ఎగుమతి అయ్యే అరటి పండ్లు కూడా రేవుల్లోనే నిలిచిపోయాయి. దీనివల్ల అరటి ధర కేజీ ₹10కి పడిపోవడంతో సాగు ఖర్చులు కూడా రాక రైతులు లబోదిబోమంటున్నారు. రొయ్యల సాగుదారుల పరిస్థితి కూడా ఇలాగే ఆందోళనకరంగా మారింది.
స్థానిక మార్కెట్లో ధరల పతనం – రైతుల ఆవేదన
అలాగే బియ్యం ఎగుమతుల విషయానికి వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సుమారు 40% నాన్-బాస్మతీ బియ్యం ఎగుమతులు నిలిచిపోవడంతో, దాదాపు 4 లక్షల టన్నుల బియ్యం పోర్టుల్లోనే పేరుకు పోయినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నప్పటికీ, యుద్ధ వాతావరణం వల్ల షిప్పింగ్ ఛార్జీలు పెరగడం, ఇన్సూరెన్స్ రిస్క్ కారణంగా వ్యాపారులు ఎగుమతులకు వెనుకాడుతున్నారు. ఈ పరిణామం అటు మిల్లర్లను, ఇటు ధాన్యం పండించే రైతులను అయోమయంలో పడేసింది.
ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఈ పరిస్థితులపై ఆర్థిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే ఏపీ ఎగుమతి రంగం కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వారు అంచనా వేస్తున్నారు. స్థానిక మార్కెట్లో ధరలు పడిపోవడం వల్ల రైతులకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతకడమో, రైతులకు నష్టపరిహారం అందించడమో చేయాలని వారు సూచిస్తున్నారు.
యుద్ధ పరిస్థితుల కారణంగా ఎగుమతులు ఆగిపోయి రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని లేదా నష్టపరిహారం అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.


