
📌 Key Points
- అదిరే అభి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘కామాఖ్య’.
- ఈ చిత్రంలో సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
- ‘కామాఖ్య’ టీజర్ విడుదలైంది, ఇది అమ్మవారి నేపథ్యంలో ఉత్కంఠభరితంగా ఉండనుంది.
- అభి గతంలో ‘చిరంజీవా’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు, ఇది యమధర్మరాజు గుడి గురించి తెలియజేసింది.
కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న అదిరే అభి ఇప్పుడు దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన దర్శకత్వంలో ‘కామాఖ్య’ అనే సినిమా రాబోతోంది. ఈ చిత్రం టీజర్ విడుదలైంది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దర్శకుడిగా అదిరే అభి
Adhire Abhi: అదిరే అభి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. కమెడియన్‌గా బుల్లితెరపై తిరుగులేని స్టార్‌గా పేరొందిన అభి (Adhire Abhi), నటుడిగానూ వెండితెరపై మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇప్పుడు దర్శకుడిగా తన ప్రతిభను చాటుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన నుంచి ఇప్పటికే ‘చిరంజీవా’ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. ఆ వివరాల్లోకి వెళితే.. సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ (అదిరే అభి) దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ చిత్రం ‘కామాఖ్య’ (Kaamakhya). మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ ప్రై.లి. బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకోగా, శుక్రవారం ఈ చిత్ర టీజర్ (Kaamakhya Teaser)ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.
‘కామాఖ్య’ అమ్మవారి నేపథ్యంలో
‘కామాఖ్య’ చిత్రం వివరాలు
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అభినయ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఈ ఉగాది అందరికీ మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ‘కామాఖ్య’ నేను దర్శకత్వం వహించిన రెండో సినిమా. మొదటి చిత్రం ‘చిరంజీవా’. ఆ చిత్రంలో యమధర్మరాజుకి ఒక గుడి ఉందని, అది తెలంగాణలోనే ఉందని చెప్పడం జరిగింది. ఆ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు ‘కామాఖ్య’ అమ్మవారి నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఒక ఉత్కంఠభరితంగా ప్రజెంట్ చేస్తూ.. మీ ముందుకు తీసుకురాబోతున్నాం. సముద్రఖని, అభిరామి, సమైరా.. ఇలా అద్భుతమైన నటీనటులందరూ కూడా వాళ్ల కోసమే ఈ పాత్రలు సృష్టించామా అన్నంత సహజంగా వారి వారి పాత్రల్లో నటించారు. నా స్నేహితుడు రిశాంక్ అలాగే ‘బాహుబలి’కి పనిచేస్తున్నప్పుడు సెంథిల్ దగ్గర పరిచయమైన రమేష్.. మేము ముగ్గురం కలిసి ఈ కథను రెడీ చేసుకున్నాం.
టీజర్ విడుదల, స్పందన
అనుకున్న సమయంలో అనుకున్న బడ్జెట్లో ఈ సినిమాని తీయగలిగినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. అందుకు మా టీమ్ అంతా ఎంతగానో సపోర్ట్ చేసింది. టీజర్ అందరికీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ ఆసక్తిని ముందు ముందు వచ్చే కంటెంట్‌లో కూడా కొనసాగిస్తాము. ‘దృశ్యం’ సినిమా తరహాలో ఉండే మంచి థ్రిల్లర్ చిత్రమిది. త్వరలో ఈ సినిమా మీ ముందుకు రాబోతోంది. ఒక నటుడిగా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు.. అలాగే ఇప్పుడు దర్శకుడిగా కూడా ఆశీర్వదించి, సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చెప్పినా, అందరూ చెప్పినట్టే ఉంటుంది కానీ.. ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని ఇస్తుందని మాత్రం చెప్పగలను..’’ అని చెప్పుకొచ్చారు.
మొత్తానికి అదిరే అభి మొదటి సినిమా యముడిపై, రెండో సినిమా అమ్మవారిపై తీయడం విశేషం. ‘కామాఖ్య’ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


