
📌 Key Points
- సంగీతమే తన అభిప్రాయమని, భారత్ తన ఇల్లు అని రెహమాన్ స్పష్టీకరణ.
- హిందీ చిత్ర పరిశ్రమలో అవకాశాలు తగ్గడానికి కారణం సామాజిక అంశం కావచ్చన్న రెహమాన్ వ్యాఖ్యలపై దుమారం.
- భారతదేశం తనకు సృజనాత్మక స్వేచ్ఛనిచ్చిందని రెహమాన్ వెల్లడి.
- బాలీవుడ్‌లో వివక్ష లేదని రచయిత్రి శోభా డే వ్యాఖ్య.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయన ఒక వీడియో ద్వారా స్పందిస్తూ భారతదేశమే తన ఇల్లు అని, సంగీతమే తన అభిప్రాయమని కుండబద్దలు కొట్టారు.
వివాదానికి దారితీసిన రెహమాన్ వ్యాఖ్యలు
AR Rahman Comments: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద చర్చ మొదలైంది. ఆయన మాటలను కొందరు “సామాజిక విభేదాలకు సంబంధించిన వ్యాఖ్యలు”గా భావించడంతో..సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రెహమాన్ స్వయంగా ఒక వీడియో సందేశం విడుదల చేసి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు.
రెహమాన్ మాట్లాడుతూ…సంగీతమే తన మాట అని తెలిపారు. భారతదేశమే తనకు ప్రేరణ, తన గురువు, తన నివాసం అని అన్నారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా అది తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. తన జీవితమంతా భారతీయ సంస్కృతి..సంప్రదాయాలతో ముడిపడి ఉందని వివరించారు.
ఇటీవల ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, గత కొన్ని సంవత్సరాలుగా హిందీ చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గాయని రెహమాన్ చెప్పారు. ఈ పరిస్థితికి కారణంగా అధికార సమీకరణలు మారడం ఉండొచ్చని అన్నారు. అదే సందర్భంలో “ఇది సామాజిక అంశం కూడా కావచ్చు” అని అన్న మాటలు వివాదానికి దారి తీశాయి. ఆ వ్యాఖ్యలపై పలువురు స్పందించారు.
భారతదేశం నా ఇల్లు: ఏఆర్ రెహమాన్
విమర్శలు ఎదురైన తర్వాత రెహమాన్ తన సామాజిక మాధ్యమ ఖాతాలో వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ, సంగీతం ద్వారా సంస్కృతిని గౌరవించడం..ప్రజలను కలపడం తన జీవిత లక్ష్యమని చెప్పారు. తాను ఎప్పుడూ భారతదేశాన్ని ప్రేమిస్తానని, ఈ దేశం తనకు సృజనాత్మక స్వేచ్ఛను ఇచ్చిందని అన్నారు. అంతేకాకుండా భారతదేశం తన ఇల్లు అని చెప్పుకొచ్చారు.
తన కళా ప్రయాణంలో చేసిన ముఖ్యమైన కార్యక్రమాలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రధానమంత్రి సమక్షంలో ప్రదర్శించిన “జల” ప్రాజెక్టు, యువ నాగ సంగీతకారులతో కలిసి వాయిద్య బృందం ఏర్పాటు చేయడం, చిన్న పిల్లలకు సంగీతం నేర్పించే సన్‌షైన్ ఆర్కెస్ట్రాకు మార్గనిర్దేశం చేయడం వంటి పనులు తన లక్ష్యాన్ని మరింత బలపరిచాయని తెలిపారు. అలాగే దేశంలో తొలి బహుళ సంస్కృతి ఆధారిత వర్చువల్ సంగీత బృందాన్ని ఏర్పాటు చేసిన అనుభవాన్ని కూడా పంచుకున్నారు. ప్రముఖ విదేశీ సంగీత దర్శకుడితో కలిసి రామాయణ గాథకు సంగీతం అందించే అవకాశం రావడం తన జీవితంలో గొప్ప ఘట్టమని చెప్పారు.
బాలీవుడ్‌పై శోభా డే వ్యాఖ్యలు
ఈ అంశంపై ఇతర ప్రముఖులు కూడా స్పందించారు. రచయిత్రి శోభా డే మాట్లాడుతూ, తాను దశాబ్దాలుగా బాలీవుడ్‌ను గమనిస్తున్నానని, అక్కడ మతపరమైన వివక్షను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రతిభ ఉంటే అవకాశాలు తప్పకుండా వస్తాయని ఆమె వ్యాఖ్యానించారు. గాయకుడు షాన్ కూడా సంగీత రంగంలో ఇలాంటి విభేదాలకు చోటు లేదని చెప్పారు. మన చేతిలో ఉన్న పని మనం నిజాయితీగా చేయడమే ముఖ్యమని అన్నారు. కవి, గీత రచయిత జావేద్ అఖ్తర్ కూడా రెహమాన్‌కు పరిశ్రమలో ఎంతో గౌరవం ఉందని స్పష్టం చేశారు.మరోవైపు.. నటి కంగనా రనౌత్ ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఆమె అభిప్రాయాలు కూడా చర్చకు దారి తీశాయి.
ఏఆర్ రెహమాన్ తన ప్రకటనతో వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. భారతదేశం తనకు ఎంతో ముఖ్యమని, తన జీవితంలో భాగమని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


