
📌 Key Points
- బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసులో నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణ.
- పోలీసులు, ప్రభుత్వం కుమ్మక్కయ్యారని, బాధితురాలిపై రివర్స్ కేసులు పెడుతున్నారని ప్రవీణ్ కుమార్ విమర్శ.
- ప్రధాని మోదీని ఉద్దేశించి, పోక్సో కేసు నమోదైన మంత్రి కొడుకును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రవీణ్ కుమార్ ప్రశ్న.
- బాధిత కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, సిట్ విచారణకు డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని హెచ్చరిక.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో నిందితులను కాపాడేందుకు పోలీసులు, ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాయని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. సిట్ విచారణకు డిమాండ్ చేస్తూ, కీలక విషయాలను వెల్లడించారు.
పోక్సో కేసులో పోలీసుల తీరుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నలు
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు తీరు ఏ మాత్రం సరిగా లేదని… నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ కేసుపై సిట్ విచారణ జరిపించాలని… నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది.
తాజాగా ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక విషయాలను ప్రస్తావించారు. ఈ కేసులో పోలీసులు, ప్రభుత్వం కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. బాధితురాలిపైనే రివర్స్ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మే 8న సాయంత్రం బాధితులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే, పేట్ బషీరాబాద్ పోలీసులు సుమారు 5 గంటల పాటు వారిని తిప్పించుకున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. “ఫిర్యాదులో అంశాలు మార్చాలని పోలీసులు ఒత్తిడి చేశారు. ప్రధాని సభలో ఆత్మహత్య చేసుకుంటానని బాధితులు హెచ్చరిస్తే తప్ప కనీసం అక్నాలెడ్జ్‌మెంట్ కూడా ఇవ్వలేదు. ఇది రేవంత్ రెడ్డి పాలనలో జరుగుతున్న అన్యాయం” అని ఆయన మండిపడ్డారు.
హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని ఉద్దేశించి ప్రవీణ్ కుమార్ పలు ప్రశ్నలు సంధించారు. “మీ సభలో వేలాది మంది మహిళలు కూర్చున్నారు. మీ పక్కనే ఉన్న మంత్రి కొడుకుపై పోక్సో కేసు నమోదైతే ఇప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయలేదు….? పోక్సో చట్టం ప్రకారం మైనర్ సమ్మతితో సంబంధం లేకుండా అది నేరమే అవుతుంది. గతంలో మీరు ఆ అబ్బాయితో ఫోటో దిగారు, ఇప్పుడు సమాధానం చెప్పాలి” అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీకి ప్రవీణ్ కుమార్ సందించిన ప్రశ్నలు
ఈ వ్యవహారంలో పోలీసులు నిందితుడికి కొమ్ముకాస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మహిళా డీజీపీ స్థాయి అధికారి నేతృత్వంలో ‘సిట్’ వేయాలని…. నిందితుడిని వెంటనే జైలుకు పంపాలని కోరారు.
“ఎప్పుడైనా కరీంనగర్ పోలీసులు బాధిత కుటుంబాన్ని అరెస్ట్ చేయవచ్చని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇదే జరిగితే దీనికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఎందుకు పోలీసులు మెజిస్ట్రేట్ ముందు 164 Cr PC స్టేట్మెంట్ రికార్డు చేయలేదు…? బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే” అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
బండి సంజయ్ పీఆర్వోలు మీడియాకు ఫోన్ చేసి ఇదొక ‘హనీ ట్రాప్’ అని రాయాలని ఒత్తిడి చేస్తున్నారని…. పోక్సో విషయం బయటకు రాకుండా తొక్కిపెడుతున్నారని ఆరోపించారు. బండి సంజయ్ ఇంటి వద్ద ఉన్న సీసీ ఫుటేజీని సేకరిస్తే అసలు విషయాలు బయటపడతాయని డీజీపీకి సూచించారు.
“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ను కాపాడాలని చూస్తున్నారు. గతంలో జర్నలిస్టుగా పనిచేసిన సంగప్ప ఏప్రిల్ నెలలో బాధిత కుటుంబాన్ని కలిశారు.ఇపుడు బిజేపి అధికార ప్రతినిధిగా ఉన్నారు. బాధిత కుటుంబాన్ని బండి సంజయ్ తో కలిపించారు. సంగప్పను పార్టీ నుంచి బహిష్కరించి… ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి” అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
బాధితురాలి కుటుంబానికి బెదిరింపులు: రేవంత్ రెడ్డి బాధ్యత?
రాష్ట్రంలో మహిళా మంత్రులైన సీతక్క, కొండా సురేఖలు ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. అలాగే… మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఉన్న ఈడీ కేసుల నుంచి రక్షణ కోసమే బండి సంజయ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ కేసులో నిందితుడికి సహకరిస్తున్న కొందరు బాధ్యులైన అధికారులందరిని సస్పెండ్ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి… మెజిస్ట్రేట్ ముందు వెంటనే స్టేట్‌మెంట్ రికార్డు చేయాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామన్నారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ఈ పోక్సో కేసులో నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి, బాధితురాలికి న్యాయం చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ వ్యవహారంలో ప్రభుత్వం బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.


