
📌 Key Points
- సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు కేంద్రం కొత్త వ్యూహం సిద్ధం చేస్తోంది.
- డీప్‌ఫేక్ కంటెంట్‌ను బ్లాక్ చేసే అధికారాన్ని ఇతర శాఖలకు కూడా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.
- ప్రస్తుతం ఐటీ చట్టం సెక్షన్ 69A కింద ఈ అధికారం ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖకు మాత్రమే ఉంది.
- రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక శాఖలకు బ్లాకింగ్ అధికారాలు ఇవ్వాలని అంతర్-మంత్రిత్వ బృందం ప్రతిపాదించింది.
సోషల్ మీడియాలో పెరిగిపోతున్న నకిలీ వార్తలు, డీప్‌ఫేక్‌ల బెడదను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. త్వరలోనే సోషల్ మీడియా కంటెంట్‌ను బ్లాక్ చేసే అధికారాన్ని ఇతర శాఖలకు కూడా విస్తరించనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
డీప్‌ఫేక్‌లతో పెరుగుతున్న ముప్పు
రోజు రోజుకు పెరిగిపోతున్న సోషల్ మీడియా వినియోగంతో పాటు నకిలీ వార్తలు, (Fake News), ప్రమాదకరమైన డీప్‌ఫేక్ (Deepfake) కంటెంట్ కొత్త భయాలను పుట్టిస్తోంది. ముఖ్యంగా సున్నితమైన మహిళల భద్రతా, ఆర్థిక వ్యవహారాలు, రక్షణ రంగానికి సంబంధించిన అంశాల్లో డీప్‍ఫేక్‍లు హద్దుదాటిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో మాస్టర్ ప్లాన్ వేస్తోంది. త్వరలోనే సోషల్ మీడియాలోని ఫేక్, తప్పుడు కంటెంట్ కట్టడి అధికారాలను ఇతర శాఖలకు విస్తరించబోతున్నది. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం, 2000లోని సెక్షన్ 69A కింద కంటెంట్ బ్లాకింగ్ అధికారం కేవలం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు మాత్రమే ఉంది. కానీ వీటిని ఇతర శాఖలకు విస్తరించే యోచనలో ఉన్నామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.
అశ్విని వైష్ణవ్ ఈ విషయంపై మాట్లాడుతూ డీప్‌ఫేక్ కంటెంట్ వేగంగా వైరల్ అవుతూ దేశ భద్రతను, ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకసారి నకిలీ కంటెంట్‌ను గుర్తించి ఫ్యాక్ట్-చెక్ చేసిన తర్వాత, అది ప్రజల్లోకి వెళ్లకుండా నిరోధించాలంటే వేగవంతమైన చర్యలు అవసరం. అందుకే అధికారాలను వికేంద్రీకరిస్తున్నామని ఆయన వివరించారు. ఇటీవల మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేకు సంబంధించిన ఒక డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఆయన భారత సైన్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఉన్న ఆ వీడియోను పాక్ ప్రచార ఐడీలు బాగా వైరల్ చేశాయి. దీనిని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసిన నకిలీది అని తేల్చింది. అయితే ఇది తప్పడు సమాచరం అని రక్షణ శాఖ గుర్తించినా బ్లాక్ చేసే అధికారం లేకపోవడంతో అప్పటికే పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది. ఈ నేపథ్యంలో రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక శాఖ వంటి ఇతర కీలక విభాగాలకు కూడా నేరుగా ఆర్డర్లు జారీ చేసే అధికారం ఇవ్వాలని అంతర్-మంత్రిత్వ బృందం ప్రతిపాదించిందని మంత్రి వెల్లడించారు. ఈ మార్పు కోసం ఐటీ చట్టాన్ని మార్చాల్సిన అవసరం లేదని కేవలం అమలులో ఉన్న నిబంధనలను (Rules) సవరిస్తే సరిపోతుందని మంత్రి తెలిపారు.
ఇతర శాఖలకు కంటెంట్ బ్లాకింగ్ అధికారం
ఐటీ చట్టంలో మార్పులు అవసరం లేదు
కేంద్రం తీసుకుంటున్న ఈ చర్యలు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి ఎంతవరకు ఉపయోగపడతాయో వేచి చూడాలి. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.


