
📌 Key Points
- కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గనిని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
- తొలి ఏడాది 400 కిలోలతో ప్రారంభించి, క్రమంగా ఏడాదికి 1 టన్ను బంగారం ఉత్పత్తి లక్ష్యం.
- జొన్నగిరిని ‘సువర్ణగిరి’గా మార్చి, మోడల్ విలేజ్‌గా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచన.
- ఈ ప్రాజెక్టుతో దేశ విదేశీ మారక నిల్వలు ఆదా అవుతాయని, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని సీఎం వెల్లడి.
కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని ప్రాజెక్టును సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతో స్థానిక అభివృద్ధి, దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రయోజనాలు చేకూరుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభం
జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి వద్ద దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బంగారు గని ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా బంగారం శుద్ధి కర్మాగారాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జియో మైసూర్ సర్వీసెస్’, ‘త్రివేణి ఎర్త్ మూవర్స్’ సంస్థల యాజమాన్యాలను, కార్మికులను సీఎం చంద్రబాబు అభినందించారు.
జొన్నగిరి ప్రాంతానికి వందల సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉందని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ‘పూర్వం అశోక చక్రవర్తి పరిపాలించిన నాలుగు ప్రధాన రాజధానులలో ఒకటైన ‘సువర్ణగిరి’.. నేటి జొన్నగిరి. ఇక్కడికి సమీపంలో లభించిన అశోకుడి ఎర్రగుడి శాసనాలే అందుకు నిదర్శనం. ఒకప్పుడు బంగారం, రత్నాలతో విలసిల్లిన ఈ ప్రాంతం పేరు కాలక్రమేణా జొన్నగిరిగా మారింది. ఇక్కడ మళ్లీ బంగారు గని ప్రారంభమైనందున.. ఈ గ్రామం పేరును అధికారికంగా ‘స్వర్ణగిరి’గా మార్చుకుందామా?’ అని చంద్రబాబు అడిగారు.
ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు కేవలం పరిశ్రమకే పరిమితం కాకుండా స్థానిక ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇందులో భాగంగానే ఈ గ్రామాన్ని సదరు సంస్థలు దత్తత తీసుకోనున్నాయని, దీనిని అత్యంత ఆధునిక సదుపాయాలతో కూడిన ‘స్వర్ణగిరి మోడల్ విలేజ్’గా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.
ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి లక్ష్యం
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక విశ్లేషణలను సీఎం చంద్రబాబు వివరించారు. ‘జొన్నగిరి (స్వర్ణగిరి) గోల్డ్ ఫీల్డ్ ప్రాజెక్టు కోసం కంపెనీలు రూ.405 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాయి. తొలి ఏడాది 400 కిలోల బంగారం ఉత్పత్తితో ప్రారంభించి.. క్రమంగా ఏడాదికి 1 టన్ను బంగారం ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్తులో దీనిని 50 మెట్రిక్ టన్నుల మార్కుకు చేర్చాలని ప్రణాళికలు రూపొందించారు.’ అని చంద్రబాబు అన్నారు.
ప్రస్తుతం భారతదేశం ఏటా దాదాపు 800 కిలోల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని చంద్రబాబు అన్నారు. క్రూడాయిల్ తర్వాత దేశంలో ఇదే అతిపెద్ద దిగుమతి అని పేర్కొన్నారు. ఇక్కడ జరిగే బంగారం ఉత్పత్తి వల్ల దేశ విదేశీ మారక నిల్వలు ఆదా అవుతాయన్నారు.
‘ రాయలసీమ అంటేనే రతనాల సీమ. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వీధుల్లో రత్నాలను రాసులుగా పోసి అమ్మిన చరిత్ర మనది. ప్రపంచ ప్రసిద్ధ కోహినూర్ వజ్రాన్ని అందించింది కూడా మన సీమ గడ్డే. కాలక్రమేణా కరవుతో ఎడారిగా మారుతున్న తరుణంలో.. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమకు జీవం పోశాం. ఇప్పుడు ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ రాయలసీమ పురోభివృద్ధికి సరికొత్త గ్రోత్ ఇంజిన్ కాబోతోంది.’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
చరిత్ర, భవిష్యత్తు ప్రణాళికలు: సీఎం చంద్రబాబు
2047 నాటికి భారతదేశాన్ని ‘వికసిత్ భారత్’గా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా.. ఆంధ్రప్రదేశ్‌ను ‘స్వర్ణాంధ్ర’గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, దానికి స్వర్ణగిరి నుంచే పునాది పడిందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన హామీ ఇచ్చారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
జొన్నగిరి బంగారు గని ప్రాజెక్టు కేవలం ఆర్థికంగానే కాకుండా, చారిత్రక ప్రాధాన్యతను పునరుద్ధరిస్తూ, స్థానిక ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఇది రాయలసీమ అభివృద్ధికి కొత్త బాటలు వేస్తుందని ఆశిస్తున్నారు.


