
ఆన్‌లైన్ షాపింగ్, ఫుడ్ ఆర్డర్‌లకు బానిసలయ్యారా? అనవసర ఖర్చులతో సతమతమవుతున్నారా? అయితే దక్షిణ కొరియాలో మొదలైన ఓ వినూత్న ట్రెండ్ గురించి తెలుసుకోవాలి. డబ్బులు పోకుండానే ఆర్డర్ చేసిన అనుభూతిని ఇచ్చే ఫేక్ ఫుడ్ డెలివరీ యాప్స్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
Key Points
దక్షిణ కొరియాలో 'ఫేక్ ఫుడ్ డెలివరీ యాప్స్' కొత్త ట్రెండ్‌గా మారాయి.
ఈ యాప్స్‌లో ఆర్డర్ చేసినా డబ్బులు కట్ అవ్వవు, డెలివరీ ఉండదు.
అనవసర ఆన్‌లైన్ షాపింగ్, ఫుడ్ ఆర్డర్ అలవాట్లను అరికట్టడమే లక్ష్యం.
'ఫుడ్ నెవర్ కమ్స్' వంటి యాప్స్ వర్చువల్ తృప్తిని అందిస్తాయి.
దక్షిణ కొరియాలో కొత్త ట్రెండ్: ఫేక్ యాప్స్
మీకు ఇష్టం లేకపోయినా, అలవాటైపోయంది కాబట్టి గంటల తరబడి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఆకలి లేకపోయినా చేతులు ఫుడ్ డెలివరీ యాప్స్ మీదకు వెళ్లి, డబ్బులు వృథా చేసుకుంటున్నారా? ఈ ‘డొపమైన్’ హాబిట్స్ని అరికట్టేందుకు ఏం చేయాలో తెలియడం లేదా? అయితే మీరు సౌత్ కొరియాలో మొదలైన ఒక ట్రెండ్ గురించి తెలుసుకోవాలి. ఇలాంటి అలవాట్లను మానుకునేందుకు అక్కడి ప్రజలు, మరీ ముఖ్యంగా జెన్ జీ యువత.. “డొపమైన్ యాప్స్”ని వాడుతున్నారు. ఇవి ఫేక్ ఫుడ్, ఫేక్ యాప్స్! అంటే.. మీరు సదరు యాప్ ఓపెన్ చేస్తారు. ఫుడ్ లేదా షాపింగ్ ఆర్డర్ పెడతారు. పేమెంట్ చేస్తారు కానీ డబ్బులు కట్ అవ్వవు, అవి ఎప్పటికీ డెలివరీ కూడా అవ్వవు!
ఈ ట్రెండ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాట్‌ఫారమ్ ‘ఫుడ్ నెవర్ కమ్స్’. పేరుకు తగ్గట్టే, ఈ యాప్‌లో ఫుడ్ డెలివరీకి సంబంధించిన పూర్తి ప్రక్రియ కనిపిస్తుంది కానీ, చివరికి ఆహారం మాత్రం డెలివరీ అవ్వదు.
రోజూ మనం ఆన్‌లైన్ షాపింగ్ లేదా ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఎలాంటి డిజిటల్ అనుభూతిని పొందుతామో, సరిగ్గా అలాంటి అనుభవాన్నే ఇవి కూడా అందిస్తాయి. అయితే ఇక్కడ ఎలాంటి రియల్ ట్రాన్సాక్షన్స్ జరగవు! వినియోగదారులు మెనూలను పరిశీలించవచ్చు, నచ్చిన వంటకాలను ఎంచుకోవచ్చు, వాటిని కార్ట్‌కు యాడ్ చేయవచ్చు, చివరకు అడ్రస్ ఎంటర్ చేసి పేమెంట్ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. కానీ, నిజమైన డబ్బు కట్ అవ్వదు, ఆర్డర్ ప్లేస్ అవ్వదు!
ఇందులో డెలివరీ టైమ్, స్టార్ రేటింగ్స్, ఆర్డర్ ట్రాకింగ్ ఫీచర్లు కూడా నిజమైన యాప్స్‌లాగే లైవ్‌లో కనిపిస్తాయి. లేనిదల్లా ఒక్కటే.. నిజమైన ఆహారం! వినియోగదారులకు ఈ ‘వర్చువల్ తృప్తి’ ఇవ్వడమే ఈ యాప్స్ ముఖ్య ఉద్దేశం. జేబు ఖాళీ అవ్వకుండానే ఆర్డర్ చేసిన ఫీలింగ్‌ను ఇవి ఇస్తాయి.
‘ది కొరియా టైమ్స్’ కథనం ప్రకారం.. ఖర్చులు తగ్గించుకోవాలని చూసేవారు, అనవసరమైన షాపింగ్ అలవాట్లను అదుపులో ఉంచుకోవాలనుకునే యువతలో ఈ ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది.
డబ్బులు పోకుండానే ఆర్డర్ అనుభూతి
చాలామందికి అర్ధరాత్రి వేళల్లో ఏవైనా నచ్చిన పదార్థాలు తినాలనే కోరిక పుడుతుంటుంది. అలాంటి సమయాల్లో ఈ యాప్స్ వారికి ఒక మైండ్ గేమ్‌లా ఉపయోగపడుతున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన 25 ఏళ్ల ఉద్యోగి కిమ్ తన అనుభవాన్ని పంచుకుంటూ, “అర్ధరాత్రి 2 గంటల సమయంలో నాకు ఆకలిగా అనిపించినప్పుడు ఈ ఫేక్ ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ చేస్తాను. నచ్చిన వంటకాలను కార్ట్‌లో వేసి, ఆర్డర్ ప్రక్రియను పూర్తి చేస్తాను. నిజానికి నేను ఏదీ కొనడం లేదని నాకు తెలుసు, కానీ ఏదో ఆర్డర్ చేశాననే ఫీలింగ్ మానసిక ప్రశాంతతను ఇస్తుంది,” అని పేర్కొన్నారు.
“మొదట్లో దీన్ని కేవలం ఒక సరదా కోసమే ప్రారంభించాను. కానీ ఆశ్చర్యకరంగా, ‘ఏదో ఒకటి ఆర్డర్ చేయాలి,’ అనే కోరికను తీర్చడం ద్వారా, నిజంగా ఏదీ ఆర్డర్ చేయకుండానే ఇది వింతైన తృప్తిని ఇస్తుందని గ్రహించాను,” అని ఈ ‘ఫుడ్ నెవర్ కమ్స్’ యాప్ డెవలపర్ మాల్హీ తెలిపారు.
డైటింగ్ చేసేవారికి, బడ్జెట్ నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి, ఆన్‌లైన్‌లో పిచ్చిపిచ్చిగా వెతికే అలవాటును మానుకోవాలనుకునే వారికి ఈ యాప్ అద్భుతంగా పనిచేస్తుందని మాల్హీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
ఆర్డర్ పెట్టకుండానే ఈ యాప్స్ ఎలా సంతృప్తిని ఇస్తాయనే దానికి సైన్స్ పరమైన కారణం ఉంది. మన మెదడులో ఆనందం, బహుమతి, ప్రేరణను ప్రేరేపించే ఒక రసాయనమే ‘డోపమైన్’. హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ ప్రకారం.. మనకు ఏదైనా బహుమతి లేదా ఆనందం అందినప్పుడు మాత్రమే కాదు, అది అందబోతోందనే ‘ఆశ’ ఉన్నప్పుడు కూడా ఈ డోపమైన్ విడుదలవుతుంది. అందుకే ఈ ఫేక్ ఆర్డర్ల ప్రక్రియ కూడా మెదడుకు అసలైన షాపింగ్ లాంటి అనుభూతినే అందిస్తుంది.
ఇలాంటి ఫేక్ యాప్స్ వాడుతున్నప్పుడు.. యూజర్లు నిజమైన యాప్‌లో లాగే ఆలోచిస్తారు, విజువల్స్ చూస్తారు, క్లిక్స్ చేస్తారు. ఫలితంగా డబ్బు ఖర్చు కాకపోయినా, మెదడు మాత్రం ఏదో సాధించామనే రివార్డ్ ఫీలింగ్‌ను పొందుతుంది.
అనవసర ఖర్చులకు చెక్ ఎలా?
డబ్బు ఆదా చేసుకోవడానికి, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటానికి ఈ డోపమైన్ సైట్లు స్వల్పకాలికంగా మంచి పరిష్కారంగా కనిపిస్తున్నప్పటికీ, నిపుణులు దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఒత్తిడులు, పెరుగుతున్న జీవన వ్యయాలు, డిజిటల్ ప్రపంచంపై మితిమీరిన ఆధారపడటం వంటి తీవ్రమైన సామాజిక సమస్యలకు ఇవి అద్దం పడుతున్నాయని విమర్శకులు వాదిస్తున్నారు.
సోషల్ మీడియాలో రీల్స్ స్క్రోల్ చేసినట్లే, ఇవి కూడా తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి తప్ప ఒంటరితనం, మానసిక ఆందోళన వంటి అసలు సమస్యలను పరిష్కరించలేవు. జుంగ్వోన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కిమ్ హెయోన్-సిక్ మాట్లాడుతూ.. “భవిష్యత్తుపై అభద్రతాభావం, తీవ్రమైన మానసిక అలసట ఉన్న ఆధునిక సమాజ పరిస్థితులను ఈ ట్రెండ్ ప్రతిబింబిస్తోంది. యువత ఇప్పుడు ఆన్‌లైన్‌లో కేవలం ఒక కాల్పనిక ప్రపంచంతో అనుసంధానించి ఉండటంలోనే ఓదార్పును వెతుక్కుంటున్నారు,” అని విశ్లేషించారు.
సాంకేతికత మన జీవితాలను ఎంతలా శాసిస్తోందో చెప్పడానికి ఈ ‘ఫేక్ ఫుడ్’ యాప్స్ ఒక తాజా ఉదాహరణ. ఇది బరువు తగ్గడానికి లేదా డబ్బు ఆదా చేయడానికి తాత్కాలికంగా సాయపడవచ్చు గాక, కానీ నిజమైన జీవితంలోని తృప్తి కోసం వర్చువల్ ప్రపంచంపై యువత ఇంతగా ఆధారపడటం ఆలోచించాల్సిన విషయమే.
ఈ ఫేక్ యాప్స్ అనవసర ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వారికి, ముఖ్యంగా యువతకు ఒక పరిష్కారంగా మారాయి. ఆర్థిక భారం లేకుండా ఆన్‌లైన్ ఆర్డర్ అనుభూతిని పొందడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి.


