
మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఏ నిపుణుడూ బ్యారేజ్ కట్టొద్దని చెప్పలేదని, రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నివేదికను ఉటంకించారు.
Key Points
మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణాన్ని ఏ నిపుణుడూ వ్యతిరేకించలేదు.
రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ అనుకూల నివేదిక ఇచ్చింది.
పీసీ ఘోష్ కమిషన్‌కు అఫిడవిట్ సమర్పించారు.
7.5 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది.
హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దని ఏ నిపుణుడూ చెప్పలేదని, అక్కడ నిర్మాణానికి అనుకూలంగానే ఉందని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు సైతం రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఈ విషయాలను అఫిడవిట్ రూపంలో సమర్పించిందని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
రైతుల ప్రయోజనాల కంటే రేవంత్ రెడ్డికి రాజకీయాలే ముఖ్యంగా మారాయని, కేసీఆర్‌కు పేరు వస్తుందనే కుళ్లుతోనే మేడిగడ్డ దగ్గర వృథాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోయడం లేదని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ప్రాజెక్టు సాంకేతికతపై మాట్లాడిన హరీశ్ రావు.. ‘మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించవచ్చు కానీ, అక్కడ నుంచి నేరుగా మిడ్ మానేరుకు నీటిని తీసుకెళ్లడం సాధ్యం కాదని ఆనాడు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ సూచించింది. ఆ నిపుణుల కమిటీ సూచనలను గౌరవించి, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నేరుగా నీళ్లు తరలించే ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. కమిటీ చెప్పిన మార్గదర్శకాల ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాం. ఈ విషయాన్ని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ పీసీ ఘోష్ కమిషన్‌కు అఫిడవిట్ రూపంలో అధికారికంగా సమర్పించింది. వాస్తవాలు ఇలా ఉంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం నిపుణుల కమిటీ రిపోర్టును పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు.’ అని హరీశ్ రావు మండిపడ్డారు.
రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక ఏమిటి?
రాష్ట్రంలో వర్షాలు పడటం లేదని, నీరు లేకుండా ఎలా ఎత్తాలని నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటాన్ని హరీశ్ రావు తీవ్రంగా తప్పుపట్టారు. కరువు వచ్చినా, కాలం కాకపోయినా తెలంగాణలో నీళ్లు నిల్వ ఉండే ఏకైక ప్రాంతం మేడిగడ్డ కాబట్టే కేసీఆర్ అక్కడ బ్యారేజ్ కట్టారని స్పష్టం చేశారు.
ప్రస్తుత నీటి లభ్యత గణాంకాలను హరీశ్ రావు మీడియా ముందుంచారు. మేడిగడ్డ దగ్గర ప్రస్తుతం సుమారు 89,230 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని చెప్పారు. గత మూడు రోజుల్లోనే 3,47,180 క్యూసెక్కుల నీరు కిందకు వెళ్ళిపోయిందని, నిన్న ఒక్కరోజే 1.22 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైందని గుర్తుచేశారు. ఇప్పటివరకు సుమారు 7.5 టీఎంసీల నీరు సముద్రం పాలు కావడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
గోదావరి జలాలు వృథా అవుతున్నాయా?
‘ఈ నిమిషంలో కన్నేపల్లి (లక్ష్మీ) పంప్‌హౌస్ దగ్గర మోటార్లు ఆన్ చేస్తే కనీసం 3 టీఎంసీల నీటిని సులభంగా లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయడం లేదు. నీళ్లు ఎత్తిపోస్తే కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే ఏకైక కుట్రతో రేవంత్ రెడ్డి రైతుల గొంతు కోస్తున్నారు. నీళ్లు వృథాగా పోతుంటే చూస్తూ కూర్చోవడం రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం.’ అని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయాలు ముఖ్యమా లేక తెలంగాణ రైతాంగ సంక్షేమం ముఖ్యమా అని ఆయన ప్రశ్నించారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హరీశ్ రావు వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ రాజకీయ వేడిని పెంచాయి. నీటి నిర్వహణపై నిపుణుల సూచనలను పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

