
📌 Key Points
- గర్భాశయ క్యాన్సర్ నిర్మూలనకు కేంద్రం HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టింది.
- రాజస్థాన్‌లో ప్రధాని మోడీ ‘గర్డాసిల్’ వ్యాక్సిన్‌ను ప్రారంభించారు.
- గతంలో సెర్వవాక్ HPV వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌పై వివాదాలు తలెత్తాయి.
- ప్రస్తుతం ఉపయోగిస్తున్న గర్డాసిల్ వ్యాక్సిన్‌ను మెర్క్ సంస్థ తయారు చేసింది.
గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే, గతంలో జరిగిన వ్యాక్సిన్ ట్రయల్స్‌లో లోపాల కారణంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ కార్యక్రమంపై పలు అనుమానాలు ఉన్నాయి.
HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం
భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) నిర్మూలన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చకు దారితీస్తోంది. ఫిబ్రవరి 28న రాజస్థాన్ లోని అజ్మీర్‌లో ప్రధాని మోడీ స్వయంగా ‘గర్డాసిల్’ వ్యాక్సిన్‌ను ప్రారంభించడం ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఆశా వర్కర్లు ఇంటింటికీ తిరిగి 14 ఏళ్ల లోపు బాలికల వివరాలు సేకరించి, వారికీ HPV వ్యాక్సిన్లు వేయిస్తున్నారు. దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న గర్భాశయ క్యాన్సర్లను దృష్టిలో పెట్టుకొని, అత్యంత ఖరీదైన ఈ వ్యాక్సిన్‌ను సుమారు 1.15 కోట్ల మంది బాలికలకు ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, గతంలో సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన సెర్వవాక్ HPV వ్యాక్సిన్ ఉదంతంతో ప్రస్తుత వ్యాక్సిన్ డ్రైవ్‌పై ప్రజల్లో తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
భారత్ లో 2009-2010 లో సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన సెర్వవాక్ HPV వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పై తీవ్ర వివాదం చెలరేగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లా, గుజరాత్‌లోని వడోదరలో దాదాపు 24,000 మంది బాలికలపై ఈ టీకా ప్రయోగాలు జరిగాయి. అయితే, ఈ ప్రక్రియలో ఏడుగురు బాలికలు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పార్లమెంటరీ కమిటీ, ట్రయల్స్ నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని గుర్తించింది. ముఖ్యంగా, గిరిజన ప్రాంతాల్లోని హాస్టల్ విద్యార్థులకు వారి తల్లిదండ్రుల నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే టీకాలు వేశారని, చాలా చోట్ల వార్డెన్లే తల్లిదండ్రుల సంతకాలు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. దీనిని పార్లమెంటరీ కమిటీ తీవ్రంగా తప్పుపట్టింది. అయితే విచారణ అనంతరం ఈ మరణాలకు వ్యాక్సిన్‌తో ఎటువంటి సంబంధం లేదని వారంతా వివిధ కారణాలతో చనిపోయారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయినప్పటికీ, ట్రయల్స్ నిర్వహించిన ‘పాత్’ (PATH) సంస్థ, ఐసిఎంఆర్ (ICMR) లపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ ప్రాజెక్టును అప్పట్లో తాత్కాలికంగా నిలిపివేశారు.
“గర్డాసిల్” వ్యాక్సిన్ భద్రమేనా?
ప్రస్తుతం ప్రభుత్వం ఉపయోగిస్తున్న గర్డాసిల్ వ్యాక్సిన్‌ను అమెరికాకు చెందిన మెర్క్ సంస్థ తయారు చేసింది. దీని భద్రతపై గత కొన్ని దశాబ్దాలుగా అంతర్జాతీయ స్థాయిలో వేల సంఖ్యలో పరిశోధనలు జరిగాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), అమెరికాకు చెందిన సిడిసి, అంతర్జాతీయ వ్యాక్సిన్ అడ్వైజరీ కమిటీలు ఈ వ్యాక్సిన్‌ను అత్యంత సురక్షితమైనదిగా గుర్తించాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో ఈ వ్యాక్సిన్‌ను విజయవంతంగా ఉపయోగిస్తున్నారు. క్లినికల్ డేటా ప్రకారం.. గర్భాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే అత్యంత ప్రమాదకరమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) రకాలను ఇది 90% వరకు సమర్థవంతంగా అరికడుతుందని నిరూపించబడింది. ఈ వ్యాక్సిన్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలను ఉత్పత్తి చేసి, భవిష్యత్తులో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది.
సెర్వవాక్ వ్యాక్సిన్ వివాదాలు
2013 జపాన్ లో ఈ గర్డాసిల్ వ్యాక్సిన్ వేయించుకున్న కొందరు బాలికలలో తీవ్రమైన బాడీ పెయిన్స్, మోటార్ డిజార్డర్స్ వంటి సమస్యలు కనిపించాయనే ఆరోపణలు రావడంతో జపాన్ ప్రభుత్వం తాత్కాలికంగా దీనిని నిలిపివేసింది. అయితే దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు జరిగిన లోతైన శాస్త్రీయ పరిశోధనల తర్వాత, ఆ అనారోగ్య సమస్యలకు, వ్యాక్సిన్‌కు ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేదని తేలింది. దీనితో 2022 నుండి జపాన్ ప్రభుత్వం తిరిగి HPV వ్యాక్సినేషన్‌ను అధికారికంగా ప్రారంభించింది. నేడు ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో గర్భాశయ క్యాన్సర్ కేసులు గణనీయంగా తగ్గడానికి ఈ వ్యాక్సినేషన్ ప్రధాన కారణమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
గర్డాసిల్ వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో వంధ్యత్వం వస్తుందనే ఆందోళనలు వ్యక్తం కాగా.. ఇప్పటివరకు జరిగిన ఏ పెద్ద క్లినికల్ స్టడీలోనూ ఈ వ్యాక్సిన్ వల్ల అండశయాలు దెబ్బతినడం, సంతానలేమి సమస్యలు రావడం వంటివి జరగలేదని తేలింది. నిజానికి, గర్భాశయ క్యాన్సర్ ముదిరిన దశలో ప్రాణాలను కాపాడటానికి గర్భాశయాన్ని పూర్తిగా తొలగించాల్సి వస్తుంది. అప్పుడు మహిళలు శాశ్వతంగా సంతాన సామర్థ్యాన్ని కోల్పోతారు. ఈ వ్యాక్సిన్ అటువంటి ప్రమాదకర స్థితి రాకుండా రక్షిస్తుంది.
ఇప్పుడే ఎందుకింత హడావిడి?
ప్రభుత్వం ఇంత హడావుడిగా, అత్యంత ఖరీదైన వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేయడం వెనుక ఉన్న వ్యూహంపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం 14 ఏళ్ల లోపు బాలికలనే ఎంచుకోవడానికి ఒక బలమైన శాస్త్రీయ కారణం ఉంది. HPV వైరస్ ప్రధానంగా శారీరక సంబంధాల ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి, ప్రీ ఆడాలసెంట్ స్టేజ్ లోనే టీకా ఇస్తే శరీరంలో రోగనిరోధక శక్తి అత్యున్నత స్థాయిలో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి పెద్ద మొత్తంలో టీకాలు వేయడం ద్వారా ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ (Herd Immunity) సాధించి, దేశం నుండి ఈ క్యాన్సర్‌ను పూర్తిగా తుడిచిపెట్టవచ్చనేది ప్రభుత్వ దీర్ఘకాలిక వ్యూహం. అయినప్పటికీ, వ్యాక్సిన్ వల్ల ఏదైనా దుష్ప్రభావాలు (Side Effects) తలెత్తితే దానికి బాధ్యత వహించే యంత్రాంగంపై స్పష్టత ఉండాలని సామాజిక కార్యకర్తలు, ఆరోగ్య నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి జిల్లాలో ఉండే AEFI (Adverse Events Following Immunization) కమిటీలు ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ విషయంలో పారదర్శకత పాటిస్తూ, తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించిన తర్వాతే వ్యాక్సినేషన్ చేయడం ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
గర్డాసిల్ వ్యాక్సిన్ భద్రతపై ఆందోళనలు
సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఎవరిది బాధ్యత?
ఏ వ్యాక్సిన్ తీసుకున్నా జ్వరం, ఇంజెక్షన్ చేసిన చోట వాపు లేదా తల తిరగడం వంటి సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం సహజం. ఒకవేళ తీవ్రమైన దుష్ప్రభావాలు తలెత్తితే, దానిని పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాలో AEFI కమిటీలు సిద్ధంగా ఉన్నాయి. దేశవ్యాప్త ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించడంతోపాటు అవసరమైతే నష్టపరిహారం వంటి విషయాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, పారదర్శకమైన అవగాహనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం వల్ల లక్షలాది మంది మహిళల ప్రాణాలను భవిష్యత్తులో కాపాడవచ్చు.
లక్ష్యం గొప్పదే.. కానీ..!
గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన అనేది ఒక గొప్ప లక్ష్యమైనప్పటికీ.. ప్రజల ఆరోగ్యం, భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదు. గర్డాసిల్ వంటి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వ్యాక్సిన్లను వాడటం వల్ల రిస్క్ తక్కువని సైన్స్ చెబుతున్నప్పటికీ, గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 100 శాతం సురక్షితం అని సర్టిఫై చేసినప్పటికీ, ప్రతి వ్యక్తి శరీర తత్వం వేరుగా ఉంటుంది కాబట్టి, అత్యవసర వైద్య సేవలను సిద్ధంగా ఉంచడం అత్యవసరం. కేవలం లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా, ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడం ద్వారానే భారతదేశాన్ని క్యాన్సర్ రహిత దేశంగా మార్చడం సాధ్యమవుతుంది.
HPV వ్యాక్సిన్ భద్రతపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి, ప్రభుత్వం మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అపోహలను తొలగించి వాస్తవాలను తెలియచేయాలి.


