|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

యుద్ధ భయాలు: నిత్యావసరాలపై కేంద్రం కీలక ప్రకటన! ధరలు పెరుగుతాయా?

Published: 06-04-2026, 7:35 AM
యుద్ధ భయాలు: నిత్యావసరాలపై కేంద్రం కీలక ప్రకటన! ధరలు పెరుగుతాయా?
  • దేశంలో నిత్యావసరాల నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం ప్రకటన
  • గోధుమలు, బియ్యం నిల్వలు అవసరానికి మించి అందుబాటులో ఉన్నాయి
  • భారతీయ నౌకలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయని ప్రకటన
  • పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు భారత్ దౌత్య ప్రయత్నాలు చేస్తోంది

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో నిత్యావసర వస్తువుల లభ్యత మరియు ధరలపై కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. నిత్యావసరాల ధరలు స్థిరంగా ఉన్నాయని, తగినంత నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

నిత్యావసరాల నిల్వలపై కేంద్రం ప్రకటన

పశ్చిమాసియాలో యుద్ధం వేళ (West Asia Conflict) దేశంలో నిత్యావసరాల లభ్యత, వాటి ధరలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. నిత్యావసర ధరల్లో పెద్దగా మార్పులు లేవని బఫర్ స్టాక్స్ (Buffer Stock) తగినంతగా ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. ఇవాళ ఢిల్లీలో వివిధ మంత్రిత్వ శాఖల తరపున మీడియాతో అధికారులు మాట్లాడారు. కేంద్ర ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి సి.శిఖ మాట్లాడుతూ.. దేశంలో గోధుమలు, బియ్యం నిల్వలు అవసరానికి మించి అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బఫర్ స్టాక్ నిబంధనల కంటే మూడు రెట్లు అధికంగా నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద గోధుమలు సుమారు 222 లక్ష మెట్రిక్ టన్నులు, బియ్యం: సుమారు 380 లక్ష మెట్రిక్ టన్నులు ఉన్నాయని తెలిపారు. ఈ నిల్వలు ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) అవసరాలను తీర్చడమే కాకుండా, ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సరిపోతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.భారతదేశానికి కీలక భాగస్వామ్య దేశాలైన ఇండోనేషియా, మలేషియా, రష్యా, ఉక్రెయిన్, అర్జెంటీనా మరియు బ్రెజిల్ నుండి దిగుమతులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని శిఖ తెలిపారు.

భారతీయ నౌకల భద్రతపై కేంద్రం హామీ

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ హర్మూజ్ జలసంధి మరియు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న భారతీయ నౌకలు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముకేష్ మంగళ్ స్పష్టం చేశారు. గత 24 గంటల్లో భారతీయ జెండా ఉన్న నౌకలపై ఎలాంటి దాడులు లేదా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, గత రెండు రోజుల్లో భారతీయ జెండాతో ప్రయాణిస్తున్న ‘గ్రీన్ సంఘ్వి’ (Green Sanghvi), ‘గ్రీన్ ఆశా’ (Green Asha) అనే రెండు ఎల్‌పీజీ (LPG) నౌకలు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని దాటి సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకున్నాయని ఆయన వివరించారు.

పశ్చిమాసియాలో శాంతి కోసం భారత్ ప్రయత్నాలు

పశ్చిమాసియా ఉద్రిక్తతలపై భారత్ ముమ్మర దౌత్య పరమైన ప్రయత్నాలు చేస్తోందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. శాంతిని నెలకొల్పేందుకు,తాజా పరిణామాలను సమీక్షించేందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పలు దేశాల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. ఆదివారం జైశంకర్ యూఏఈ (UAE) మరియు ఖతార్ (Qatar) విదేశాంగ మంత్రులతో ఫోన్ ద్వారా మాట్లాడి ప్రాంతీయ భద్రత, వాణిజ్య మార్గాలపై నెలకొన్న ఆందోళనలపై చర్చించినట్లు వెల్లడించారు. ఇరాన్ విదేశాంగ మంత్రి స్వయంగా జైశంకర్‌కు ఫోన్ చేసి మాట్లాడి పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు మరియు ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు స్థిరంగా ఉంటాయని కేంద్రం భరోసా ఇచ్చింది. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.