
జ్యేష్ఠ మాసం హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైనది. బ్రహ్మదేవునికి ఇష్టమైన ఈ మాసంలో వివిధ పండుగలు, పూజలు జరుపుకుంటారు. విష్ణు సహస్రనామ పారాయణం, దానధర్మాలు ఈ మాసంలో ప్రత్యేక ప్రాధాన్యతను పొందుతాయి.
Key Points
జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవునికి ప్రీతికరమైనది.
విష్ణు సహస్రనామ పారాయణానికి అనుకూలమైన కాలం.
నిర్జల ఏకాదశి, మహాజ్యేష్ఠ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకుంటారు.
దశ పాపహర దశమి రోజున పాపాల నుండి విముక్తి లభిస్తుంది.
జ్యేష్ఠ మాసం: పురాణాల ప్రకారం
బ్రహ్మదేవుడి ఆరాధనకూ, విష్ణు సహస్రనామ పఠనకూ, ఏకాదశి పూజలకూ అనుకూలమైన మాసం జ్యేష్ఠం. దానధర్మాలకు ఎంతో ప్రాధాన్యం ఉండే మాసం జ్యేష్ఠం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
జ్యేష్ఠ మాసం హిందూ పంచాంగ ప్రకారం, చైత్ర మాసంతో ప్రారంభమయ్యే సంవత్సరంలో మూడవ మాసం. ఇది సాధారణంగా మే, జూన్ నెలల్లో వస్తుంది. ఈ మాసాన్ని జ్యేష్ఠం అని పిలుస్తారు. ఈ మాసంలో వేడిగా, ఎండగా ఉండే కాలం కావడంతో దీనిని గ్రీష్మ ఋతువు అని కూడా అంటారు.
ఈ సమయంలో సూర్యుడి తాపం ఎక్కువగా ఉండి, ప్రకృతిలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ మాసంలో నదులు, బావులు, కాలువలకు పూజలు చేస్తారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
బ్రహ్మ దేవుడికి ఇష్టమైన మాసం
జ్యేష్ఠ మాసంలోని ముఖ్యమైన పండుగలు
పురాణాల ప్రకారం, జ్యేష్ఠం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైన మాసమని పురాణాలు చెబుతున్నాయి అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ నెలలో తనని ఆరాధించినవారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడనీ, ఐశ్వర్యంతో పాటు ఆనందాన్నీ ప్రసాదిస్తాడనీ అంటారు. అదే సమయంలో విష్ణు సహస్రనామాలనూ పఠిస్తే అనంతమైన ఫలితాలు కలుగుతాయని చెబుతారు.
జ్యేష్ఠా అనే పేరు ఎలా వచ్చింది?
పౌర్ణమి నాడు చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చింది. ఇది తెలుగు మాసాల్లో మూడోది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శ్రీరాముడు జ్యేష్ఠ మాసంలోనే హనుమంతుడిని కలిశాడట. ఇక ‘నిర్జల ఏకాదశి’గా పిలిచే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి, నీరు, అన్నం, పండ్లు వంటివి దానం చేయాలంటారు పెద్దలు. దీనివల్ల 12 ఏకాదశి తిథుల్లో స్వామిని పూజించిన ఫలితం దక్కుతుంది.
జ్యేష్ఠ మాసం: ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
ఈ నెలలో వచ్చే పౌర్ణమికి ‘మహాజ్యేష్ఠ’ అని పేరు. దీన్నే ‘ఏరువాక పున్నమి’గా వ్యవహరిస్తారు. ఇది రైతుల పండుగ. ఈ రోజున ఎద్దులను శుభ్రం చేసి, అలంకరించి, నైవేద్యం నివేదించి, ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దుక్కి దున్నిస్తారు రైతులు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఇక జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమిని ‘దశ పాపహర దశమి’గా పిలుస్తారు. అంటే పదిరకాల పాపాలను పోగొట్టే రోజని అర్థం. గంగా దేవి అవతరించిన రోజూ ఇదే. అందుకే ఉత్తరాదిన ‘దశహర గంగోత్సవం’ పేరుతో గంగమ్మను ఆరాధిస్తారు.
అలాగే, ఈ రోజున నల్ల నువ్వులు, బెల్లం తదితరాలను గంగాదేవికి సమర్పిస్తే మంచిదని నమ్ముతారు. వీటన్నింటితోపాటు, ఈ నెలలో చెప్పులు, గొడుగు, ఆహారం వంటివి దానం చేస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని చెబుతున్నాయి శాస్త్రాలు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ : 9494981000
జ్యేష్ఠ మాసం ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయం. ఈ మాసంలోని పండుగలు, పూజలు ఆధ్యాత్మిక ప్రగతికి దోహదపడతాయి. భక్తితో కూడిన ఆచరణలతో జీవితంలో శ్రేయస్సు పొందండి.


