
📌 Key Points
- ‘ది కేరళ స్టోరీ-2: గోస్ బియాండ్’ విడుదలపై కేరళ హైకోర్టు స్టే విధించింది.
- మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సన్నివేశాలున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.
- సెన్సార్ బోర్డు సరిగ్గా పరిశీలించకుండానే సర్టిఫికెట్ ఇచ్చిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
- సినిమాను పూర్తిగా సమీక్షించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది.
వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’ సీక్వెల్‌గా వచ్చిన ‘ది కేరళ స్టోరీ 2’ విడుదలపై కేరళ హైకోర్టు స్టే విధించింది. సినిమాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సన్నివేశాలు ఉన్నాయని దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
కేరళ హైకోర్టు సంచలన నిర్ణయం
The Kerala Story 2: వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story)కి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ-2: గోస్ బియాండ్’ (The Kerala Story 2: Goes Beyond) విడుదలపై కేరళ హైకోర్టు (Kerala High Court) మధ్యంతర స్టే విధించింది. ఫిబ్రవరి 27న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, కేవలం ఒక్కరోజు ముందే న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ చిత్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా, ఒక వర్గాన్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సినిమాను ప్రదర్శించకూడదని స్పష్టం చేసింది. దీంతో ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదల కావడం లేదు. ఎప్పుడు విడుదల అనేది ఇక కోర్టు తీర్పుపైనే ముడి పడి ఉంది.
సెన్సార్ బోర్డు తీరుపై ఆగ్రహం
ఈ సినిమాపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నప్పటికీ, వాటిని సరిగ్గా పరిశీలించకుండానే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఎలా ఇచ్చిందని ధ్వజమెత్తింది. ప్రాథమికంగా చూస్తే సెన్సార్ బోర్డు తన విచక్షణను ఉపయోగించలేదని, అసలు సినిమా కూడా చూడకుండానే, కేవలం లాంఛనంగా సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కనిపిస్తోందని న్యాయమూర్తి జస్టిస్ బెచు కురియన్ థామస్ ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే అంశాలను అడ్డుకోవడంలో సెన్సార్ మార్గదర్శకాలను పాటించలేదని కోర్టు పేర్కొంది. సినిమా చూసిన అనంతరం కోర్టు ఈ స్టే ని విధించినట్లుగా సమాచారం.
పిటిషనర్ల వాదనలు
ఇక కోర్టులో టీజర్, ట్రైలర్‌లోని కొన్ని సంభాషణలు సమాజంలో చిచ్చు పెట్టేలా ఉన్నాయని పిటిషనర్లు వాదించారు. ఈ నేపథ్యంలో, సినిమాను పూర్తిగా సమీక్షించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పిన హైకోర్టు, ప్రస్తుతానికి 15 రోజుల పాటు స్టే విధిస్తూ, దీనిపై వివరణ ఇవ్వాలని నిర్మాతలకు, సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఇలా స్టే విధించడంతో.. చివరి నిమిషంలో నిర్మాతలకు షాకిచ్చినట్లయింది. ఇంతకు ముందు వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ కూడా ఇలానే ప్రాబ్లమ్స్‌ను ఫేస్ చేసింది. కానీ పార్ట్ 2 విడుదల మాత్రం కష్టమే అనేలా టాక్ వినిపిస్తుంది. వాస్తవానికి సెన్సార్ బోర్డు కూడా ఏం తక్కువ చేయలేదు. దాదాపు 16 కట్స్ విధించి, మెయిన్ సన్నివేశాలను చాలా వరకు ట్రిమ్ చేయించింది. కిస్ సీన్ల నిడివి కూడా తగ్గించినట్లుగా టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో సెన్సార్‌ను తప్పుబడుతూ, కోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరం. చూద్దాం మరి.. ఫైనల్‌గా ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో..
చివరి నిమిషంలో కేరళ హైకోర్టు స్టే విధించడంతో సినిమా విడుదల వాయిదా పడింది. కోర్టు తదుపరి విచారణ తర్వాత సినిమా విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


