
📌 Key Points
- ఖమ్మంలో వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం.
- ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు పట్టాల అందజేత.
- అర్హులైన 412 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, సొంత గ్రామాల్లో స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు.
- గతంలో భూదాన్ భూముల్లో ఇళ్లు కూల్చివేతతో నిరాశ్రయులైన బాధితులకు ప్రభుత్వం పునరావాసం.
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్ బాధితులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనుంది. దీనిలో భాగంగా లబ్ధిదారులకు టోకెన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ఈ కార్యక్రమానికి హాజరై పట్టాలు అందజేయనున్నారు.
బాధితులకు అండగా ప్రభుత్వం
ఖమ్మంలోని వెలుగుమట్ల వినోభా నగర్ కాలనీలో నిర్వాసితులైన కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు పట్టాలు, మంజూరు పత్రాలను అందజేయనున్నారు. వినోభా నవోదయ భూదాన్ కాలనీ నుండి ఎంపిక చేసిన లబ్ధిదారులకు అధికారులు టోకెన్ల పంపిణీని ప్రారంభించారు. అయితే నిర్వాసిత కుటుంబాలకు ఇంటి స్థలాలను ఎక్కడ కేటాయించాలనే దానిపై అధికారులు గోప్యత పాటించారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని సంప్రదించగా.. భూమి ఎక్కడ ఉందో తరువాత మీడియాకు వెల్లడిస్తామని చెప్పారు. ఖమ్మం శివార్లలోని తొమ్మిది ఎకరాల భూమిలో ఎంపిక చేసిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 75 చదరపు గజాల ఇళ్ల స్థలాలు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. వెలుగుమట్ల వద్ద ఉన్న అదే భూదాన్ భూమిలోని ప్లాట్లకు కూడా పట్టాలు జారీ చేయవచ్చనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.
భూదాన్ భూమిలో 742 కుటుంబాలకు చెందిన ఇళ్లను అధికారులు ఫిబ్రవరి 24వ తేదీన కూల్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భూదాన్ భూమిని ఆక్రమించారని హైకోర్టు, సీసీఎల్ఏ ఆదేశాల మేరకు తొలగించినట్టుగా వెల్లడించారు. దీంతో చాలా మంది బాధితులు రోడ్ల మీద పడ్డారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రజా సంఘాలు బాధితుల తరఫున నిరసనలు తెలిపాయి.
మంజూరు పత్రాల పంపిణీ
చాలా కుటుంబాలు బంధువుల ఇళ్లకు, సొంత గ్రామాలకు వెళ్లాయి. సుమారు 135కుపైగా కుటుంబాలు మాత్రం పునరావస కేంద్రాల్లో తలదాచుకున్నాయి. ఈ విషయం పెద్ద చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో కూల్చివేత చిత్రాలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. కొందరి కోసం కావాలనే ఇళ్లను కూల్చివేశారనే ప్రచారం మెుదలైంది. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది.
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. సామాజిక, ఆర్థిక సర్వే చేశారు. మెుత్తం 412 కుటుంబాలకు అర్హత ఉన్నట్టుగా గుర్తించారు. వారికి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు టోకెన్లు పంపిణీ చేస్తోంది. 311 మంది తీసుకోగా.. సొంత గ్రామాల్లో స్థలం కలిగిన మరో 101 మంది లబ్ధిదారులకు అక్కడే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు.
పునరావాస చర్యలు
వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేత బాధితుల వద్దకు ప్రతిపక్ష పార్టీలు పోరాటం చేశాయి. ఎంతదూరమైన వెళ్తామని, బాధితులకు అండగా ఉంటామని ప్రకటించాయి. మరోవైపు ప్రజా సంఘాలు సైతం బాధితుల పక్షాన పోరాడుతూనే ఉన్నాయి. బాధితులకు సంబంధించిన వీడియోలు కూడా తెలంగాణ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం వెలుగుమట్లలో అర్హులకు ఇళ్లను మంజూరు చేసింది.
అయితే ఇప్పుడు మరో వివాదం కూడా తెరపైకి వచ్చింది. కొందరికి మాత్రమే టోకెన్లు ఇచ్చారని, మిగిలిన వారికి ఇవ్వలేదని బాధితుల్లో కొందరు చెబుతున్నారు. 700కిపైగా కుటుంబాలు ఉన్నాయని అంటున్నారు. ఖమ్మం కలెక్టర్ వద్ద పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు ఇచ్చారు. సరిగా సర్వే చేసి అర్హులై అందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఒక ముఖ్యమైన ముందడుగు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బాధితులకు కొంత ఊరటనిస్తుంది. ఇది వారి జీవితాల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తుంది.


