
ప్రముఖ దక్షిణాది నటి బి. సరోజా దేవి (87) బెంగళూరులో కన్నుమూశారు. తొలి సినిమాకే జాతీయ అవార్డు అందుకున్న ఆమె, ఎం.జి.ఆర్., ఎన్.టి.ఆర్. వంటి దిగ్గజాలతో కలిసి నటించారు. ఆమె మరణం సినీ రంగానికి తీరని లోటు.
Key Points
లెజెండరీ నటి సరోజా దేవి కన్నుమూశారు.
తొలి సినిమాకే జాతీయ అవార్డు అందుకున్నారు.
ఎంజీఆర్, ఎన్టీఆర్ వంటి దిగ్గజాలతో నటించారు.
200 కంటే ఎక్కువ సినిమాలలో నటించి సినీ ప్రియులను మెప్పించారు.
సరోజా దేవి జీవిత విశేషాలు
ప్రముఖ దక్షిణ భారత నటి బి.సరోజా దేవి (87) సోమవారం బెంగళూరులో కన్నుమూశారు. వార్తా సంస్థ పిటిఐ కథనం ప్రకారం.. ఆమె బెంగళూరులోని మల్లేశ్వరం నివాసంలో వృద్ధాప్య సంబంధిత అనారోగ్యాలతో మరణించారు. ఆమెను తమిళంలో కన్నడత్తు పైంగిలి (కన్నడ చిలుక) అని, కన్నడలో అభినయ సరస్వతి (భావాల సరస్వతి) అని పిలుస్తారు. దాదాపు 200 సినిమాల్లో సరోజా దేవి నటించారు. దిగ్గజాలు ఎంజీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాల్లో సరోజా దేవి యాక్ట్ చేశారు.
బి.సరోజా దేవి మృతికి ఖుష్బూ సుందర్ సంతాపం తెలిపారు. “స్వర్ణ యుగం ముగిసింది. సరోజాదేవి అమ్మ గొప్ప నటి. దక్షిణ భారతదేశంలో ఆమెకున్న పేరు ప్రఖ్యాతలు మరెవరికీ లేవు. ఆమె చాలా ప్రేమగల వ్యక్తి. ఆమెతో నాకు మంచి అనుబంధం ఉంది. బెంగళూరుకు వెళ్లినప్పుడు ఆమెను కలవకుండా నా పర్యటన పూర్తయ్యేది కాదు. నేను చెన్నైలో ఉన్నప్పుడల్లా ఆమె ఫోన్ చేసేది. ఆమెను చాలా మిస్ అవుతాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. ఓం శాంతి” అని ఎక్స్ లో పోస్టు చేశారు ఖుష్బూ .
ఫస్ట్ సినిమాతోనే జాతీయ అవార్డు
అపురూప సినీ ప్రస్థానం
సరోజా దేవి తన 17 సంవత్సరాల వయస్సులో కన్నడ చిత్రం మహాకవి కాళిదాస (1955) ద్వారా తెరంగేట్రం చేశారు. తన తొలి చిత్రంలో నటనకు ఆమె జాతీయ అవార్డు ను గెలుచుకున్నారు. ఆమె కన్నడ సినిమా మొదటి మహిళా సూపర్ స్టార్‌గా కూడా పేరుగాంచారు. మరో లెజెండరీ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్‌తో కలిసి ఆమె నటించిన తమిళ చిత్రం నాడోడి మన్నన్ (1958).. సరోజా దేవిని తమిళ సినిమా అగ్ర నటీమణులలో ఒకరిగా నిలబెట్టింది.
దివంగత ఎన్టీఆర్ సినిమా పాండురంగ మహాత్యం సినిమాతో 1957లో తెలుగులో అడుగుపెట్టారు సరోజా దేవి. తెలుగులో భూకైలాస్, పెళ్లి సందడి, పెళ్లి కానుక, ఇంటికి దీపం ఇల్లాలే, జగదేక వీరుని కథ, శ్రీ సీతారామ కల్యాణం, మంచి చెడు, దాగుడు మూతలు, శకుంతల, మాయని మమత, పండంటి కాపురం, మనుషుల్లో దేవుడు తదితర సినిమాలు చేశారు. చివరగా 2019లో వచ్చిన కన్నడ సినిమా నటసార్వభౌమలో క్యామియో చేశారు.
శోక సంతాపం
ఏడు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో సరోజా దేవి సుమారు 200 సినిమాలు చేశారు. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో చిత్రాల్లో నటించారు. 1955 నుంచి 1984 వరకు 29 ఏళ్లలో వరుసగా 161 సినిమాల్లో లీడ్ హీరోయిన్ గా చేసిన ఏకైక నటి సరోజా దేవి. ఆమె 1969లో పద్మశ్రీ, 1992లో పద్మ భూషణ్ పురస్కారాలను అందుకున్నారు.
1938 జనవరి 7న ఇప్పటి కర్ణాటకలో పుట్టారు సరోజా దేవి. 1967లో శ్రీహర్షను పెళ్లి చేసుకున్నారు. ఆయన 1986లో మరణించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు.
తెలుగు, తమిళ, కన్నడ సినిమా రంగాలకు సరోజా దేవి అందించిన కృషి అపురూపమైనది. ఆమె మరణం సినీ ప్రియులకు తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.


