
తేజ సజ్జా నటించిన మిరాయ్ సినిమా ఓటీటీ హక్కులు రికార్డు స్థాయిలో రూ.40 కోట్లకు అమ్ముడయ్యాయి. సినిమా బడ్జెట్‌లో 90% ఈ డీల్ ద్వారా వచ్చింది. జియోహాట్‌స్టార్ ఈ హక్కులను దక్కించుకుంది.
Key Points
మిరాయ్ సినిమా ఓటీటీ హక్కులు రూ.40 కోట్లకు అమ్ముడుపోయాయి.
సినిమా బడ్జెట్‌లో 90% ఓటీటీ హక్కుల ద్వారానే వచ్చింది.
జియోహాట్‌స్టార్ ఓటీటీ హక్కులను దక్కించుకుంది.
థియేట్రికల్ హక్కులు కూడా భారీగానే పలికాయి.
మిరాయ్ ఓటీటీ హక్కుల వివరాలు
తేజ సజ్జా నటించిన మరో పాన్ ఇండియా మూవీ మిరాయ్ (Mirai). ఈ సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 12) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అయితే ఇప్పటికే తేజ నటించిన హనుమాన్ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో మిరాయ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సూపర్ హీరో సినిమా ఓటీటీ హక్కులకు రికార్డు ధర పలికినట్లు వార్తలు వస్తున్నాయి.
కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తేజ సజ్జా నటించిన మిరాయ్ సినిమా ఓటీటీ హక్కులను జియోహాట్‌స్టార్ దక్కించుకున్నట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది. ఈ మూవీ వర్గాలు ఈ విషయం చెప్పినట్లు ఆ రిపోర్టు తెలిపింది. ఈ హక్కుల కోసం ఏకంగా రూ.40 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఈ సినిమాను రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.
రిలీజ్ ముందే బడ్జెట్ వసూలు
అంటే 90 శాతం బడ్జెట్ ఒక్క ఓటీటీ హక్కుల ద్వారానే వచ్చినట్లు లెక్క. ఇదే కాకుండా మూవీ శాటిలైట్, మ్యూజిక్ హక్కులకు కూడా భారీగానే రానుంది. రిలీజ్ కు ముందే బడ్జెట్ వచ్చేయడంతో ఇక బాక్సాఫీస్ వసూళ్లన్నీ లాభాలే అనుకోవాలి.
మిరాయ్ థియేట్రికల్ హక్కులు కూడా రూ.37 కోట్లు పలికాయి. ఆ లెక్కన కనీసం రూ.34 కోట్లకుపైగా వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాపై ఉన్న అంచనాలు, అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఇదేమంత పెద్ద కష్టమైన విషయంలా అనిపించడం లేదు. అయితే ఈ సినిమాకు అనుపమ, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన కిష్కింధపురి నుంచే గట్టి పోటీ ఎదురు కానుంది.
బాక్సాఫీస్ అంచనాలు
మిరాయ్ కూడా ఓ సూపర్ హీరో మూవీనే. గతేడాది హనుమాన్ తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న తేజ సజ్జా అలాంటిదే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్ తో అంచనాలు పెరిగిపోయాయి. గ్రాఫిక్స్ కూడా చాలా క్వాలిటీగా అనిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో విలన్ గా మంచు మనోజ్ నటించడం విశేషం. ఈ ఫ్యాంటసీ డ్రామాలో జగపతి బాబు కూడా ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఇక మిరాయ్ బాక్సాఫీస్ సక్సెస్ ను బట్టి ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో తేలనుంది. అక్టోబర్ మూడు లేదా నాలుగో వారంలో జియోహాట్‌స్టార్ లోకి మిరాయ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మిరాయ్ సినిమా ఓటీటీ హక్కుల ద్వారా భారీ లాభాలు ఆర్జించింది. రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వసూళ్లు అదనపు లాభాలను అందిస్తాయని భావిస్తున్నారు.


