
📌 Key Points
- మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.
- సిట్ చీఫ్‌గా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్, 9 మంది సభ్యులుగా ఉంటారు.
- ఫామ్‌హౌస్‌లో డ్రగ్ పార్టీ జరిగిందని పోలీసులు దాడి చేశారు, పలువురు అరెస్ట్.
- ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంలో పలువురు రాజకీయ నేతల పేర్లు వినిపిస్తుండటం సంచలనంగా మారింది.
సిట్ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం
మెయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు బయటికొస్తున్నాయి. అయితే ఈ కేసును సిట్ తో విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సిట్ చీఫ్‌గా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ వ్యవహరిస్తారు. గ్రేహౌండ్స్ కమాండర్ ఎం.రవీందర్, షాదనగర్ డీసీపీ శిరీష, ఈగల్ డీఎస్పీలు బుచ్చయ్య, హరీశ్ చంద్రారెడ్డి, మోయినాబాద్ ఎస్‌హెచ్‌వో మల్లిఖార్జున, ఎస్‌ఐలు కోటేశ్వర్ రావు, వెంకన్న, సదత్ అలీ సభ్యులుగా ఉన్నారు.
ఫామ్‌హౌస్‌పై పోలీసుల దాడి
బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో మద్యం పార్టీ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఫామ్‌హౌస్‌లో డ్రగ్ పార్టీ జరుగుతోందని విశ్వసనీయ సమాచారం మేరకు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE) ఫోర్స్, పోలీసు బృందం శనివారం రాత్రి దాడి చేశాయి. ఈ పార్టీకి రియల్టర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు కూడా హాజరైనట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. పాల్గొన్న వారిలో ఒక మహిళ కూడా ఉంది. రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది.
పాజిటివ్ వచ్చిన వారిలో ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్, పైలట్ రోహిత్‌రెడ్డి ఉన్నారు. పోలీసులు సోదాలకు వెళ్లిన సమయంలో నమిత్‌శర్మ అనే వ్యక్తి కాల్పులు జరిపారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్
ఈ ఘటనపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చారు. రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, నమిత్‌శర్మలను కోర్టులో ప్రవేశపెట్టగా… 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులోని తీవ్రత దృష్ట్యా…. సిట్ తో విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మరోవైపు ఈ వ్యవహరంపై సిట్ ఏర్పాటైన నేపథ్యంలో… కేసును మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది. అయితే ప్రధాన నిందితులను కస్టడీ కోరే అవకాశం ఉంది. మరోవైపు రితేశ్ రెడ్డి గన్ లైసెన్స్ రద్దు చేయాలని సైబరాబాద్ కమిషనర్‌కు సిట్ లేఖ రాసింది. అంతేకాకుండా…. ఫామ్‌హౌస్‌కు సంబంధించిన వివరాలను రెవెన్యూ శాఖ నుంచి సేకరించే పనిలో ఉన్నట్లు తెలిసింది.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. సిట్ ఏర్పాటుతో ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దర్యాప్తు ఎలా సాగుతుందో వేచి చూడాలి.


