
వర్షాకాలం వచ్చిందంటే చాలు, జ్వరాల బెడద తప్పదు. అయితే, వచ్చిన జ్వరం సాధారణ వైరల్ ఫీవరా లేక ప్రాణాంతక డెంగ్యూనా అని గుర్తించడం చాలా ముఖ్యం. తొలి 48 గంటల్లో లక్షణాలు ఒకేలా ఉన్నా, సరైన అవగాహనతో ప్రమాదాన్ని నివారించవచ్చు.
Key Points
వర్షాకాలంలో జ్వరాలు పెరగడం సాధారణం, కానీ డెంగ్యూ భయం వెంటాడుతుంది.
వైరల్ ఫీవర్, డెంగ్యూ ప్రారంభ లక్షణాలు తొలి 48 గంటలు ఒకేలా ఉంటాయి.
'48-హవర్ ఫీవర్ రూల్' ద్వారా జ్వరం తీవ్రతను అంచనా వేయవచ్చు.
48 గంటల తర్వాత జ్వరం తగ్గకపోతే, వెంటనే డెంగ్యూ NS1 యాంటిజెన్ టెస్ట్ చేయించుకోవాలి.
వర్షాకాలంలో జ్వరాల ఉధృతి: అసలు కారణం ఏంటి?
ఎండ తీవ్రత నుంచి వర్షాకాలం ఉపశమనం కలిగించినప్పటికీ, ప్రతి ఏటా ఈ సీజన్ ప్రారంభంలో జ్వరాలు భారీగా పెరుగుతుంటాయి. జ్వరం రాగానే చాలా మంది తమ ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోతుందేమోనని, ప్రతి తుమ్ము లేదా శరీరం వేడెక్కడం చూసి ఏదో తీవ్రమైన వ్యాధి అని భయపడుతుంటారు. వీటన్నింటి మధ్య, వర్షాకాలంలో కుటుంబాలు ఎదుర్కొనే అతిపెద్ద సవాలు.. వచ్చిన జ్వరం సాధారణ వైరల్ ఇన్‌ఫెక్షనా లేక ప్రాణాంతక డెంగ్యూ ప్రారంభ లక్షణమా అని తెలుసుకోవడం!
జ్వరం వచ్చిన మొదటి రోజు ఈ రెండు సమస్యల లక్షణాలు ఒకేలా ఉండటం వల్ల తొలి 48 గంటలు అత్యంత కీలకంగా మారతాయి. ఈ సమయంలో లక్షణాలను తప్పుగా అంచనా వేస్తే ప్రాణాలకే ప్రమాదం కావచ్చు, లేదా అనవసరంగా ఆసుపత్రికి పరుగులు తీసి భయాందోళనలు కొనితెచ్చుకున్నట్లవుతుంది.
ఇక్కడే మనకు ‘48-హవర్ ఫీవర్ రూల్’ ఎంతగానో ఉపయోగపడుతుంది. మన శరీరం ఈ వేర్వేరు ఇన్‌ఫెక్షన్లకు ఎలా స్పందిస్తుందో క్లినికల్ ట్రెండ్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు.
సాధారణ శ్వాసకోశ వైరస్ అయినా లేదా దోమల ద్వారా వచ్చే డెంగ్యూ అయినా మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు, మన రోగనిరోధక వ్యవస్థ ఒకే రకమైన రక్షణ చర్యలను ప్రారంభిస్తుంది. వైరస్‌లను నిర్మూలించడానికి మెదడు అంతర్గత ఉష్ణోగ్రతను పెంచే ‘పైరోజెన్స్’ (జ్వరాన్ని ప్రేరేపించే పదార్థాలు)ను విడుదల చేస్తుంది.
ఈ ప్రాథమిక రోగనిరోధక స్పందన అన్ని ఇన్‌ఫెక్షన్లకు ఒకేలా ఉండటం వల్ల, జ్వరం వచ్చిన మొదటి రెండు రోజుల్లో కేవలం శారీరక పరీక్షల ద్వారా అసలు కారణాన్ని గుర్తించడం చాలా కష్టం. ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ వైరాలజీ’ నివేదిక ప్రకారం.. డెంగ్యూ ప్రారంభ లక్షణాలు మొదటి 48 గంటల్లో సాధారణ వైరల్ జ్వరాన్ని పోలి ఉంటాయి. అందువల్ల ఎండెమిక్ ప్రాంతాల్లో ల్యాబ్ పరీక్షలు లేదా నిరంతర నిఘా అవసరం. అయితే, 48 గంటల సమయం దాటిన తర్వాత ఈ రెండు జ్వరాలు వేర్వేరు మార్గాలను తీసుకుంటాయి.
వైరల్ ఫీవర్ vs డెంగ్యూ: 48 గంటల కీలకం
సకాలంలో పారాసిటమాల్ వేసుకున్నప్పటికీ 48 గంటల తర్వాత కూడా జ్వరం తగ్గకుండా స్థిరంగా ఎక్కువగా ఉంటే, ఇంటర్నెట్ థియరీలను నమ్మకుండా వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి.
1. టెస్టింగ్ విండో : జ్వరం వచ్చిన 1 నుంచి 4 రోజుల్లోపు ‘డెంగ్యూ NS1 యాంటిజెన్’ టెస్ట్ చేయించుకుంటే శరీరం లో యాంటీబాడీలు తయారుకాకముందే వైరస్ ఉనికిని ఖచ్చితంగా గుర్తిస్తుంది. దీనితో పాటు కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ ద్వారా ప్లేట్‌లెట్స్, హెమటోక్రిట్ బేస్‌లైన్ స్థాయిలను తెలుసుకోవడం ముఖ్యం.
2. ప్లేట్‌లెట్ భ్రమ – క్రిటికల్ ఫేజ్ : చాలా మంది జ్వరం తగ్గగానే ప్రమాదం తప్పిందని అనుకుంటారు. కానీ డెంగ్యూలో, జ్వరం తగ్గిన తర్వాతి కాలమే (సాధారణంగా 3వ రోజు నుంచి 5వ రోజు వరకు) అసలైన ‘క్రిటికల్ ఫేజ్’. ఈ దశలోనే ప్లాస్మా లీకేజీ జరిగి, రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్ కౌంట్ వేగంగా పడిపోవడం జరుగుతుంది. ‘PLoS నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్’ పరిశోధన ప్రకారం.. అంతర్గత రక్తస్రావం, ఫ్లూయిడ్ చేరడం వంటి తీవ్రమైన డెంగ్యూ సమస్యలు జ్వరం తగ్గి సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చే దశలోనే బయటపడతాయి.
ల్యాబ్ రిపోర్టులు వచ్చే వరకు ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
సకాలంలో గుర్తించడం ఎలా? టెస్టులు, చికిత్స
పారాసిటమాల్ మాత్రమే వాడండి: జ్వరం నియంత్రణకు వైద్యుల సలహా మేరకు కేవలం పారాసిటమాల్ మాత్రమే వాడాలి. ఇబుప్రోఫెన్, ఆస్పిరిన్ లేదా డిక్లోఫెనాక్ వంటి నొప్పి నివారణ మందులను అస్సలు వాడకూడదు (వైద్యులు చెప్పేంతవరకు). ఇవి రక్తాన్ని పలచన చేస్తాయి. ఒకవేళ డెంగ్యూ ఉంటే ఇవి అంతర్గత రక్తస్రావాన్ని తీవ్రం చేస్తాయి.
హైడ్రేషన్ ముఖ్యం: కేవలం మంచినీరు మాత్రమే కాకుండా బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఓఆర్ఎస్ లవణాలు, తాజా కొబ్బరి నీళ్లు, వెజిటబుల్ సూప్‌లు వంటి ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే ద్రవ పదార్థాలను తీసుకోవాలి.
ప్రమాదకర సంకేతాలను గమనించండి: నిరంతర వాంతులు, చిగుళ్లు లేదా ముక్కు నుంచి రక్తం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా అకస్మాత్తుగా తీవ్రమైన నీరసం/మత్తు వంటి ప్రమాదకర సంకేతాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రిలో చేరాలి.
వర్షాకాలంలో వచ్చే జ్వరాలను తేలికగా తీసుకోవద్దు. 48 గంటల తర్వాత కూడా జ్వరం తగ్గకపోతే, ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ద్వారా డెంగ్యూ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.


