
📌 Key Points
- మూసీ నది పునరుజ్జీవనానికి తెలంగాణ ప్రభుత్వం ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్ట్ చేపట్టింది.
- ఈ ప్రాజెక్టు మొదటి దశకు రూ. 5,812.4 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
- గాంధీ విగ్రహ నిర్మాణం కోసం రూ. 73.8 కోట్లు కేటాయించారు.
- ప్రభుత్వం పారదర్శకంగా, దశలవారీగా ప్రాజెక్టును పూర్తి చేస్తోంది.
హైదరాబాద్‌లో మూసీ నదిని పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం
మూసీ నది పునరుజ్జీవనంలో భాగంగా హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రతిష్టాత్మకంగా “గాంధీ సరోవర్” ప్రాజెక్ట్ ను చేపట్టేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఈ ప్రాజెక్ట్ కోసం కావాల్సిన భూమిని సేకరిస్తోంది. అయితే పలు నివాస ప్రాంతాలను కూడా ఖాళీ చేయించే దిశగా కసరత్తు చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పేరుతో లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటిపై స్పందించిన ప్రభుత్వం… వివరణ ఇస్తూ ఓ క్లారిటీ ఇచ్చింది.
మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం…. మొదటి దశలో అంచనా వేసిన ఖర్చును రూ. 5,812.4 కోట్లుగా పేర్కొంది. జోన్ 1 (హిమాయత్ సాగర్ → గాంధీ సరోవర్) కోసం రూ. 1,684 కోట్లు, జోన్ 2 (ఉస్మాన్ సాగర్ – గాంధీ సరోవర్) కోసం రూ. 1,992 కోట్లు ఖర్చు చేయనుంది. ఇక పన్నులు ,ఇతర నిబంధనలు, పనుల నిమిత్తం రూ. 1,596 కోట్లు కేటాయించనుంది.
పునరుజ్జీవనానికి ప్రభుత్వం కేటాయించిన నిధులు
ఈ అంశాలన్నీ కూడా మొత్తం నదీ తీర అభివృద్ధి ప్రణాళికలో భాగమే అని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. నదీ పర్యావరణ పునరుద్ధరణ, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, వరద నిర్వహణ, డ్రైనేజీ మెరుగుదల, నదీ తీరంలో బహిరంగ ప్రదేశాలు, సైక్లింగ్ ట్రాక్‌లు, వంతెనలు, రిటైనింగ్ వాల్స్, ట్రంక్ సివరేజ్ లైన్ల వంటి అర్బన్ మౌలిక సదుపాయాలపై వంటి అంశాలపై దృష్టి సారిస్తామని పేర్కొంది. ఈ ప్రాజెక్టును అత్యంత పారదర్శక విలువలతో, ఒక ప్రణాళికా బద్దంగా, వివిధ దశల వారీగా పూర్తి చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రాజెక్టుపై ప్రభుత్వం యొక్క ప్రకటన
గాంధీ సరోవర్ అనేది మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమంలో ఒక భాగం మాత్రమే అని సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ఇందులో గాంధీ విగ్రహానికి సంబంధించి అంచనా వేసిన ఖర్చు రూ. 73.8 కోట్లు మాత్రమే అని వివరించింది. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించి సరైన సమాచారం కోసం అధికారిక ప్రాజెక్ట్ పత్రాలను లేదా ప్రభుత్వ ప్రకటనలను మాత్రమే అధికారిక సమాచారంగా భావించాలని కోరింది. తప్పుడు సమాచారాన్ని, ఫేక్ న్యూస్ ను, ఉద్దేశ్య పూర్వకంగా చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ఒక ముఖ్యమైన ముందడుగు. ప్రభుత్వం దీనిని పారదర్శకంగా పూర్తి చేస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని నమ్మకుండా అధికారిక ప్రకటనలను విశ్వసించాలని కోరారు.


