|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

థియేటర్ పార్కింగ్ ఫీజుల గందరగోళం! కొందరికి గుడ్ న్యూస్, ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్!

Published: 18-03-2026, 12:05 PM
థియేటర్ పార్కింగ్ ఫీజుల గందరగోళం! కొందరికి గుడ్ న్యూస్, ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్!
  • దిల్‌సుఖ్‌నగర్ కోణార్క్ థియేటర్‌లో పార్కింగ్ ఫీజు వసూలుపై హైకోర్టు తీర్పు.
  • సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుపై స్టే విధించిన హైకోర్టు.
  • తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఊరట లభించినట్లు కోర్టు తెలిపింది.
  • హైదరాబాద్‌లోని ఏషియన్ కోణార్క్ థియేటర్ మినహా మిగతా థియేటర్లలో ఫీజు వసూలు చేసుకోవచ్చు.

తెలంగాణ హైకోర్టు పార్కింగ్ ఫీజుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదన్న తీర్పుపై స్టే విధించింది. దీనితో థియేటర్ యాజమాన్యాలకు ఊరట లభించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

సింగిల్ స్క్రీన్ థియేటర్లకు హైకోర్టు ఊరట

Parking Fees: రీసెంట్‌గా దిల్‌సుఖ్‌ నగర్‌లోని కోణార్క్ థియేటర్లో ఒక ప్రేక్షకుడి నుంచి రూ. 20 పార్కింగ్ ఫీజు (Parking Fees) వసూలు చేయడంతో ఆ వ్యక్తి కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును ప్రకటించింది. మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్‌లో టికెట్ లేదా బిల్ చూపిస్తే ఉచిత పార్కింగ్ ఇచ్చే నిబంధననే ఇకపై తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు (Single Screen Thaters) కూడా వర్తింపజేయాలని ఆదేశించింది. కానీ ఇప్పుడా తీర్పుపై స్టే విధించింది. దీంతో మూవీ లవర్స్ షాకిచ్చినట్లయింది. అసలే సినిమా టికెట్ల ధరలు, పాప్ కార్న్ ధరలు చూసి జనాలు సినిమాలు చూసేందుకు థియేటర్లకు రావడం లేదు. మళ్లీ పార్కింగ్ ఫీజ్ అంటూ నెత్తిన భారం వేయవద్దని చెప్పిన కోర్టు సడెన్‌గా ఆ తీర్పుపై స్టే విధించడంతో మూవీ లవర్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే..

మూవీ లవర్స్‌కు నిరాశ కలిగిస్తున్న పార్కింగ్ ఫీజులు

తెలంగాణలోని సింగిల్ స్క్రీన్, స్టాండ్ అలోన్ థియేటర్ల యజమానులకు హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు తాజాగా స్టే విధించింది. దీనితో ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ రుసుము వసూలు చేసుకునేందుకు మార్గం సుగమమైంది. థియేటర్ యజమానుల తరఫున సీనియర్ అడ్వొకేట్ ఎస్. నిరంజన్ రెడ్డి, అడ్వొకేట్ సిర్గపూర్ సాహిల్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. పిటిషనర్ కేవలం ఒకే ఒక థియేటర్‌లో వసూలు చేస్తున్న పార్కింగ్ ఫీజుపై కోర్టును ఆశ్రయించారని, కాబట్టి ఆ ఆదేశం కేవలం ఆ ఒక్క థియేటర్‌కే పరిమితం కావాలని కోర్టు పేర్కొంది.

కోణార్క్ థియేటర్‌కు ప్రత్యేక ఆదేశాలు

ఈ నేపథ్యంలో, హైదరాబాద్‌లోని ఏషియన్ కోణార్క్ థియేటర్ మినహా, తెలంగాణలోని మిగతా అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు యథావిధిగా పార్కింగ్ ఫీజులు వసూలు చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. థియేటర్ల యాజమాన్యాల వాదనలు వినకుండానే పార్కింగ్ ఫీజు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయడం సరికాదని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది థియేటర్ల నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, గత ఉత్తర్వులపై స్టే విధిస్తూ తుది నిర్ణయం తీసుకుంది. దీనితో చాలా కాలంగా పార్కింగ్ ఫీజు విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు సంతోషం వ్యక్తం చేస్తుండగా, సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనే సినిమా చూడాలనుకునే వారు కాస్త నిరాశకు లోనవుతున్నారు.

హైకోర్టు తాజా నిర్ణయంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలకు ఊరట లభించింది. అయితే, సినిమా చూడడానికి వెళ్ళే సామాన్య ప్రజానీకానికి ఇది కొంత నిరాశ కలిగించే విషయమే. దీనిపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.