
📌 Key Points
- ప్రజాధనం సంక్షేమం కోసం వినియోగించాలనేది పౌరుల ఆశయం.
- మతపరమైన పండుగలకు ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం చర్చనీయాంశం.
- లౌకిక రాజ్యం అన్ని మతాల పట్ల సమాన దూరం పాటించాలి.
- ప్రభుత్వాలు పండుగలను అధికారికంగా నిర్వహించడం కొత్త ధోరణిగా మారింది.
ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చేరుతుంది. ఈ ధనాన్ని ప్రజల సంక్షేమం కోసం వినియోగించాలనే ఆశతో ఉంటారు. అయితే, ప్రభుత్వాలు పండుగలకు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వివాదాస్పదంగా మారింది.
ప్రజాధనం వినియోగంపై ప్రశ్నలు
ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులో నుంచి చెల్లించే పన్నులు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం. ఆ ధనం ప్రజల సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వినియోగించాలనే ఆశ ప్రతి పౌరుడికి ఉంటుంది. అయితే, ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు మతపరమైన పండుగలు, వేడుకలను అధికారిక కార్యక్రమా లుగా నిర్వహిస్తూ కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేయడం కొత్త చర్చకు దారితీస్తోంది. దీంతో ప్రజా ధనం వినియోగం అసలు ఎక్కడ ఉండాలి? అనే ప్రశ్న మరింత బలంగా వినిపిస్తోంది.
భారతదేశం ఒక లౌకిక రాజ్యం. లౌకికత అంటే ప్రతి మతాన్ని గౌరవించడం మాత్రమే కాదు.. ప్రభుత్వ వ్యవస్థ అన్ని మతాల పట్ల సమాన దూరం పాటిస్తూ పరిపాలనపై దృష్టి పెట్టడం కూడా. మతపరమైన విశ్వాసాలు వ్యక్తిగతమైనవి, సమాజానికి చెందినవి. అవి కుటుంబాల్లో, సమాజాల్లో, ప్రార్థనా స్థలాల్లో జరిగితేనే వాటి అసలు ఆధ్యాత్మికత నిలుస్తుంది.
లౌకిక రాజ్య పాలన సూత్రాలు
భారతీయ సమాజంలో పండుగలు ప్రజలే నిర్వహించుకునే సాంస్కృతిక ఆచారాలు.. పండుగలన్నీ ఆయా సమాజాల విశ్వాసాలు, సంప్రదాయాలతో ముడిపడి ఉన్నవి. కుటుంబాలు, సమాజాలు కలిసి స్వయంగా నిర్వహించుకునే ఈ వేడుకల్లోనే వాటి అసలు ఆనందం, ఆధ్యాత్మికత కని పిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు ఈ పండుగ లను అధికారిక కార్యక్రమాలుగా నిర్వహిస్తూ ప్రజా ధనాన్ని భారీగా ఖర్చు చేయడం ఒక కొత్త ధోరణిగా మారింది. ఇలాంటి సందర్భాల్లో సామాన్యుడి దృష్టిలో ఒక సహజమైన సందేహం తలెత్తుతుంది. రమజాన్ సమయంలో ఇఫ్తార్ విందులు నిర్వహించడం ముస్లింలకు పవిత్రమైన ఆచారం. రోజంతా ఉపవాసం చేసిన తర్వాత సాయంత్రం ఉపవాసం విరమించడం ఆధ్యాత్మికతకు సంబంధించినది. ఇదే విధంగా బతుకమ్మ పండుగ, క్రిస్మస్ వేడుకలు లేదా ఇతర మత పరమైన పండుగలు కూడా ఆయా సమాజాల విశ్వాసాలకు చెందినవే.. శతాబ్దాలుగా ప్రజలు ఈ పండుగలను తమ ఇళ్లలో, తమ సమాజాల్లో స్వయంగా నిర్వహించుకుంటూ వచ్చారు.. ఇప్పుడు ప్రభుత్వాలు ఈ వేడుకలను ఎందుకు అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించాలి? పండుగల సాంస్కృతిక విలువను ఎవరూ ప్రశ్నించరు.. కానీ ప్రజల పన్నుల రూపంలో వచ్చిన ధనాన్ని ఈ కార్యక్రమాలకు వినియోగించడం ఎంతవరకు సమంజసం?
యాక్టివిస్ట్ లుబ్నా సర్వత్, ఆర్‌టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం, 2024 మార్చి 15న ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన ‘స్టేట్ దావత్-ఎ-ఇఫ్తార్’ కార్య క్రమానికి (ఒక పూట సాయంత్రం భోజనానికి) సుమారు రూ.2.77 కోట్ల వరకు ఖర్చు అయినట్లు వెల్లడైంది. ఫర్నిషింగ్స్‌కు కోట్ల రూపాయలు, ఆహ్వాన పత్రాలకు లక్షల రూపాయలు, వంట ఖర్చులకు పెద్ద మొత్తాలు వెచ్చించగా, అనాథలకు ఇచ్చిన దుస్తుల ఖర్చు మాత్రం ఈ మొత్తం వ్యయంతో పోలిస్తే చాలా తక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం. సుమారు 12 వేల మందికి ఇచ్చిన ఆ ఇఫ్తార్ విందుకు ఒక్కొక్కరిపై సగటుగా రూ.2,285 వరకు ఖర్చు అయినట్లు లెక్కలు సూచిస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలోని మసీదుల్లో నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమాల్లో ఒక్కో వ్యక్తికి సుమారు రూ.200 ఖర్చుతో వేలాది పేదలకు ఆహారం అందించగలుగుతున్నారు.. ఈ పోలిక ప్రజా ధనం వినియోగంపై సహజంగానే అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. అలాగే పండుగల పేరుతో జరిగే ఈ కార్యక్రమాల్లో పారద ర్శకతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిసార్లు ఈ ఖర్చులు అక్రమాలకు, అవినీతికి మార్గం సుగమం చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పండుగల రాజకీయీకరణ – కొత్త ధోరణి
ప్రభుత్వాల అసలు బాధ్యత ప్రజలకు సమర్థవంతమైన పరిపాలన అందించడం. ప్రజలు తమ సంప్రదాయాలను, పండుగలను తామే ఆనందంగా జరుపుకునే స్థాయికి చేరుకునేలా ఆర్థిక, సామాజిక అవకాశాలను కల్పించడం కూడా పరిపాలనలో భాగం. నిజానికి ప్రజలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించినప్పుడు వారు తమ సామర్థ్యానికి అనుగుణంగా పండుగలను తామే ఆనందంగా జరుపుకుంటారు.. అలాంటి వేడుకల్లో ప్రభుత్వం ప్రత్యేక్షంగా జోక్యం చేసుకోవడం ప్రజల ఆర్థిక స్థితి బలహీనతను మాత్రమే కాదు, వారి అభివృద్ధి విషయంలో పాలకుల వైఫల్యాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. దానం రూపంలో జరిగే పండుగలు సంబరాల కంటే ఇది రాజకీయ ప్రదర్శనలుగా మారిపోయాయి. అందుకే ప్రభుత్వం ప్రజా పాలన మెరుగుపర్చడంపైనే దృష్టి పెట్టాలి. పౌరుల వ్యక్తిగత ఆచార వ్యవహారాలపై కాదు. విద్యా రంగాన్ని బలోపేతం చేయడం, యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడం, ఉపాధి అవకాశాలు సృష్టించడం, ఆరోగ్య సేవలను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం. ఇవే ప్రజలు ప్రభుత్వాల నుంచి ఆశించే అంశాలు..
ప్రస్తుత పరిస్థితుల్లో నిరుద్యోగం యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. నైపుణ్యాల లోపం, విద్యలో అసమానతలు కూడా పెద్ద సమస్యలుగా మారాయి. ఇలాంటి సమయంలో కోట్ల రూపాయలను పండుగల ప్రదర్శనలపై ఖర్చు చేయడం కన్నా, అదే ధనాన్ని విద్యారంగం, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు, స్టార్టప్‌లకు మద్దతు వంటి కార్యక్రమాలకు వినియోగిస్తే సమాజానికి మరింత ప్రయోజనం ఉంటుంది. మతపరమైన విశ్వాసాలు ప్రజల హృదయాలకు సంబంధించినవి. వాటిని ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం లేదు.. ప్రజలు తమ సంప్రదాయాలను, పండుగలను తామే నిర్వహించుకుంటే ఆ ఆనందం మరింత సహజంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యవస్థ మాత్రం అన్ని మతాల పట్ల సమాన దూరం పాటిస్తూ ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. అందుకే ప్రజా ధనం వినియోగంలో ప్రాధాన్యతలు స్పష్టంగా ఉండాలి. ప్రజల భవిష్యత్తును బలోపేతం చేసే రంగాల్లో పెట్టుబడులు పెరగడం అదే ప్రజాస్వామ్య పరిపాలనకు నిజమైన అర్థం.
ప్రభుత్వాలు ప్రజాధనాన్ని సక్రమంగా వినియోగించాలని, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. పన్నుల డబ్బు వినియోగంపై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉంది.


