
📌 Key Points
- నిర్మాత ఎస్‌కేఎన్ ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంలో భాగం
- ‘బేబి’ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత హిందీ రీమేక్ ప్రయత్నాలు
- దర్శకుడు సాయి రాజేష్‌పై ఎస్‌కేఎన్ ప్రశంసలు
- సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు
ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ తన జీవితంలో జరిగిన మార్పు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సాయి రాజేష్ తన జీవితాన్ని మార్చేశారని, స్విఫ్ట్, ఆల్టో కార్లు మాత్రమే తెలిసిన తనకు బెంజ్ కారు కొనే స్థాయికి చేర్చారని అన్నారు. ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంలో ఆయన భాగస్వామి.
ఎస్‌కేఎన్ నిర్మాణంలో ‘చెన్నై లవ్ స్టోరీ’
Producer SKN: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), శ్రీ గౌరి ప్రియ (Sri Gouri Priya) జంటగా.. ‘కలర్ ఫొటో, బేబి’ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాలను అందించిన మేకర్స్ ఎస్‌కేఎన్ (Producer SKN), సాయి రాజేశ్ నిర్మాణంలో రూపుదిద్దకుంటోన్న చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story). అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. మెలొడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సోమవారం ఈ సినిమా నుంచి ‘గుర్తుందా’ అనే సాంగ్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్‌కెఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
‘బేబి’ సక్సెస్ వెనుక కథ
‘‘నాకు హిట్స్ వస్తున్నా, నిర్మాతగా నేను సినిమాలు చేసేందుకు ఎప్పుడూ తొందరపడలేదు. నా మనసుకు నచ్చిన కథ దొరికినప్పుడే సినిమాలు నిర్మించాలని అనుకున్నాను. ‘బేబి’ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత హిందీలో బేబి రీమేక్ స్టార్ట్ చేశాం. కానీ, అంత సాఫీగా జరగలేదు.. కొన్ని అవాంతరాలు వచ్చాయి. తెలుగులో సినిమా చేయాలనుకుంటున్న టైమ్‌లో సాయి రాజేశ్ ఈ కథ చెప్పారు. ఈ కథతోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాం. ‘బేబి’ వంటి బిగ్ సక్సెస్ తర్వాత ఏ దర్శకుడైనా మరో పెద్ద ప్రొడక్షన్‌లోకి వెళ్లాలని అనుకుంటారు. కానీ నా చిన్ననాటి మిత్రుడు.. స్విఫ్ట్, ఆల్టో కార్లు మాత్రమే తెలిసిన నాకు.. బెంజ్ కారు కొనుక్కునేలా చేసిన దర్శకుడు సాయి రాజేశ్ నాతోనే సినిమా చేస్తున్నారు. నా దర్శకులు మారుతి, సాయి రాజేశ్, రాహుల్ సంకృత్యన్, రవి నంబూరి.. ఇలాంటి వారి వల్లే నేను ఈ వేదిక మీద నిలబడ్డాను. రవి నాకు సోదరుడు. ‘బేబి’ మూవీకి ఆయన చేసిన సపోర్ట్‌కు కృతజ్ఞతగా సాయి రాజేశ్ ఈ మూవీ డైరెక్షన్ చేసే ఛాన్స్ రవికి ఇచ్చారు. వాస్తవానికి తన కథల్ని మరో దర్శకుడికి ఇవ్వాలంటే సాయి రాజేశ్ చాలా ఆలోచిస్తారు. రవి ప్రతిభపై నమ్మకంతో ఆయనకు అవకాశం ఇచ్చారు. రవికి రైటింగ్ మీద ఉన్న ప్రతిభ, సినిమాను రూపొందించడంలో ఉన్న కామన్‌సెన్స్ మా అందరికీ నచ్చాయి.
సాయి రాజేష్‌పై ఎస్‌కేఎన్ ప్రశంసలు
‘క’ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం ఈ కథ విని వెంటనే చేస్తానని ముందుకొచ్చారు. మంచి కథల్ని ప్రేక్షకులకు చూపించాలనే తపన ఉన్న హీరో కిరణ్. ఈ కథను నిర్మించాలంటే మీకు ధైర్యం ఉండాలి, నటించాలంటే నాకు ధైర్యం ఉండాలంటూ శ్రీ గౌరి ప్రియ ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పింది. మేము మణిగాడ్ అని పిలుచుకునే మణిశర్మ సంగీత దర్శకత్వంలో నిర్మాతలుగా మా పేర్లు ఉండటం నిజంగా మా అదృష్టం. అనంత శ్రీరామ్ ఎంతో డెప్త్ ఉన్న పాటలు రాశారు. ఒక హానెస్టీ మూవీ చేసినప్పుడే టీమ్ అందరిలో ఎగ్జైట్‌మెంట్ ఉంటుంది. ‘చెన్నై లవ్ స్టోరీ’లోని ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్, ప్రతి డైలాగ్ అందరికీ అలాంటి ఎగ్జైట్‌మెంట్ ఇస్తుంది. ఖర్చు ఎక్కువైనా మంచి క్వాలిటీ కోసం డాల్బీలో ఈ సినిమాను చేస్తున్నాం. ఈ విషయం చెప్పినప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రోత్సహించారు. మా సినిమాను జూన్ 26 అనుకున్నాం కానీ ఆ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా వస్తోంది. మా సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తాం’’ అని చెప్పుకొచ్చారు.
నిర్మాత ఎస్‌కేఎన్ తన ప్రయాణంలో సాయి రాజేష్ సహకారాన్ని కొనియాడారు. వారి స్నేహం, సినిమా పట్ల వారికున్న అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకం. మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.


