|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎర్రి పుష్పాలు కాదు.. మాస్ మగాళ్లు: పుష్ప మూవీపై ఓ సీనియర్ జర్నలిస్ట్ డిఫరెంట్ రివ్యూ.. ఇది ప్రతి మగాడు చదవాల్సిందే

Published: 27-05-2025, 5:22 AM
ఎర్రి పుష్పాలు కాదు.. మాస్ మగాళ్లు: పుష్ప మూవీపై ఓ సీనియర్ జర్నలిస్ట్ డిఫరెంట్ రివ్యూ.. ఇది ప్రతి మగాడు చదవాల్సిందే

పుష్ప సినిమా భారీ విజయం సాధించడంలో మాస్ ఆడియన్స్ పాత్ర ఎంతో కీలకం. ఈ కథనంలో, సీనియర్ జర్నలిస్ట్ రాజు పుష్ప మూవీపై వేరే కోణంలో విశ్లేషణ చేశారు. ‘ఎర్రి పుష్పాలు’ అనే పదం వెనుక ఉన్న అర్థాలను తెలుసుకుందాం.

Key Points

1

పుష్ప సినిమా సక్సెస్‌కు మాస్ ఆడియన్స్ ప్రధాన కారణం.

2

మాస్ మగాళ్ళు తమను తాము ఎర్రి పుష్పాలుగా ఎందుకు భావిస్తున్నారో విశ్లేషణ.

4

సీనియర్ జర్నలిస్ట్ రాజు రాసిన పుష్ప మూవీ రివ్యూ.

మాస్ ఆడియన్స్ మరియు పుష్ప సినిమా

మాస్.. ఇప్పుడు, ఎప్పుడూ ఓ సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ కు వీళ్లే కారణం. ఈ మాస్ జనం ఈలలు, గోలలు లేకపోతే థియేటర్లు బోసిపోతాయి. ముఖ్యంగా పుష్పలాంటి మాస్ హీరో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడంటే దానికి కారణం ఈ మాసే. మరి ఈ మాస్ మగాళ్లు తమను తాము ఎందుకు ఎర్రి పుష్పాలుగా భావించుకుంటున్నారు? పుష్ప మూవీ అంతపెద్ద హిట్ కావడానికి వీళ్లు ఏవిధంగా కారణమయ్యారు? అల్లు అర్జున్ పుష్ప మూవీపై సీనియర్ జర్నలిస్ట్ రాజు రాసిన ఓ డిఫరెంట్ రివ్యూ ఇక్కడ చదవండి.

‘‘ పుష్ప అంటే పువ్వనుకుంటివా? కాదు… ఫైరు…’’ – ఆ సినిమాలో హీరో తన పేరు గురించి తన గురించి తానే స్వయంగా చెప్పుకునే ఓ ‘పంచ్ డైలాగ్’ ఇది. ఇది కోట్ల మంది గుండెల్లో అను నిత్యం మార్మోగే డైలాగ్. ఈ లోకంలో ప్రతి ఒక్కడిదీ ఇదే తపన.. ‘నేను పువ్వుని కాదు.. నేను ఫైరుని’ అని చాటి చెప్పుకోవాలనే తపన. ఆ హీరోలాగా నేను కూడా ‘తగ్గేదే లా’ అని స్టయిల్ గా డైలాగ్ కొట్టి ఎదుటివాడిని బిత్తరపోయేలా చేయాలనే తహతహ.

ఎందుకంటే జనసామాన్యంలో ‘పువ్వు’ అంటే ఓ ఈసడింపు. ‘ఫైరు’ అంటే ఏదో బెదిరింపు భావన. ఇక్కడ పువ్వు అంటే అసలు అర్థమే వేరు. అసలు పదమే వేరు. అసలు పదమేమిటో, అసలు అర్థమేమిటో అందరికీ తెలిసినా.. నలుగురిలో మాట్లాడేటపుడు కాస్త మర్యాద ముసుగేసి మాట్లాడాలి కదా అని ఈ తంటాలు. అయినా అందరికీ అసలు బూతు పదాల స్థానంలో మామూలు మాటలను పెట్టేసి బూతులు కాని బూతులు మాట్లాడేయటం ఇప్పుడు మామూలైపోయింది.

మన పురుషాధిక్య సమాజంలో ‘పూ…’ అనేది అచ్చ తెలుగులో ఒక పురుషుడ్ని తిట్టగల ఒక పచ్చి బూతు. స్త్రీ జననాంగాన్నే స్త్రీకి గుర్తింపుగా మార్చేసి తిట్టుగా దిగజార్చిన పదమది. బూతు మాటలు పక్కన పెట్టేసి చూస్తే.. ‘ఏమీ చేతగాని ఆడదానివి’ అని మగాడ్ని తిట్టే తిట్టు అది. ఆ తిట్టుకు మరి కొన్ని విశేషణాలు కూడా ముందు చేరుస్తుంటారు. ‘పిచ్చి పూ…’ అని.. ‘వెర్రి పూ…’ అని దానినే మరింతగా జనస్వామికం చేసి ‘ఎర్రి పూ…’ అని తిడుతుంటారు. అంటే ఏమీ తెలియని, ‘ఏమీ చేతగాని, ఏమీ చేయలేని ఆడదానివి’ అనే ఈసడింపు ప్రాధమిక అర్థం. ఇంకా విస్తృతార్థంలో విచ్చలవిడిగా వ్యభచరించే స్త్రీ అనే ఛీత్కారం కూడా ఉంటుంది.

ఈ బండబూతును పబ్లిక్‌గా ‘వెర్రి పువ్వు’ అని ఇంకాస్త సంస్కృతీకరించి ‘వెర్రి పుష్పం’ అని బాహాటంగా తిట్టేసుకోవడం మన సంస్కృతిలో మామూలు అలవాటైపోయింది. ఈ అర్థాలన్నీ స్పష్టంగా తెలిసే సినిమాకు గానీ, సినిమా హీరోకి గానీ ఆ పేరు పెట్టారని అనుకోలేం గానీ.. ఈ అర్థాల ప్రభావం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా ఉండి తీరుతుంది.

అనేకానేక అంతరాలతో నిండిపోయిన ఆధునిక తారతమ్య సమాజంలో.. మరి ముఖ్యంగా కులం, గోత్రం, వంశం లాంటి అనేకానేక పితృస్వామిక వారసత్వ ‘గొప్ప’ల గీటురాయిల కింద నలిగిపోతూ.. తమను తాము ఓ పనిక మాలిన పుష్పంగా భావించుకుంటూ ఆత్మన్యూనతతో తల్లడిల్లుతున్న మగాళ్లు కోటానుకోట్లుగా ఉన్నారు. వారినే సినీ పరిభాషలో మాస్ అని, వీర మాస్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఆధునిక సినిమాలు ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ అనే మెజారిటీ సినిమాలు అలాంటి మాస్ మగాళ్ల భావోద్వేగాలను టార్గెట్ చేసుకునే కథలు అల్లి తెరకెక్కుతుంటాయి. ఎందుకంటే థియేటర్లకు ఎగబడి విచ్చలవిడిగిగా సినిమాలు చూసేది ఆ మాస్ మగాళ్లే మరి.

‘ఎర్రి పుష్పాలు’ అనే పదం యొక్క అర్థం

బతుకుపోరులో ఏ రోజుకారోజు మరొకరి చెప్పుచేతల్లోనో దయాదాక్షిణ్యాల మీదో ఈసురోమంటూ బతకాల్సిన దుస్థితిలో సమాజం దృష్టిలో ఎదుగూబొదుగూ లేని బతుకులీడిస్తున్న ఈ మగాళ్లందరూ లోలోపల తమను తాము చేతగాని దద్దమ్మలుగా – అంటే ‘వెర్రి పుష్పాలు’గా ఎంచుకుంటూ ఉంటారు. ఆ ఆత్మన్యూనత నుంచి బయట పడడానికి పగటి కలలు కంటుంటారు. అకస్మాత్తుగా ఒక రోజు పెద్ద హీరోలమైపోయినట్టు, అందరినీ అదరిస్తూ బెదిరిస్తూ ఎదిగిపోతున్నట్టు. ఆపదల్లో అవసరాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ చేదుకుంటూ నాయకులమైపోయినట్టు. ప్రత్యర్థులను పుర్రచేత్తో, ఎడమ కాల్తో గాల్లోకి ఎగరేసి తన్నేస్తున్నట్టు.

నిజజీవితంలో అలా కాలేరు కదా. కానీ అడ్డదారుల్లో అలా ఎదిగిపోవచ్చనుకుంటారు. ఆ అడ్డదారులు కూడా అందరికీ దొరకవు. దొరికిన వారిలో అందరికీ ఆ తెగింపు ఉండదు. తెగించిన వారందరూ అలా ఎదిగిపోలేరు అనేది వేరే సంగతి. కలలు కనడానికి ఇవేమీ అడ్డుకాదు కదా. కనేస్తుంటారు. ఆ కలలే ఓ సినిమాగా తెర మీదకు వస్తే ప్రతి ఒక్క మాస్ మగాడూ అది తన కథే అనేసుకుంటాడు. ఆ సినిమాని ఓన్ చేసేసుకుంటాడు.

ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. ప్రతి ఒక్కడికీ గుర్తింపు కావాలి. శత కోటి లింగాల్లో ఓ బోడి లింగం లాగా బతికీడుస్తున్న జీవులకు ‘నేను స్పెషల్’ లింగం అనే గుర్తింపు కావాలి. ‘నేనొక గొప్ప లింగం’ అని సాటి బోడి లింగాలకి చాటి చెప్పాలనే తపన. జనమంతా ముఖ్యంగా మగాళ్లంతా సామూహికంగా ‘పువ్వు’లుగా మిగిలిపోయిన సమాజమిది. ఎవరికి వారు తమను తాము ‘ఎర్రి పువ్వు’ గా అనుకునేలా చేస్తున్న సమాజమిది.

అదే సమయంలో నేను ‘స్పెషల్ పువ్వును.. మీలాగా ఎర్రి పువ్వును కాదు’ అని చాటింపు వేయాలని తపన పడుతుంటారు. ‘నిజానికి నేను పువ్వులా కనిపిస్తాను కానీ పెద్ద ఫైరుని’ అని గాల్లో అసాధారణ ఫీట్లు చేస్తూ తన విశ్వరూపం చూపించాలని కలలు కంటుంటారు.

సినిమాలో కూడా పుష్పకు ఐడెంటిటీ సమస్య. బ్రాండ్ సమస్య. ఇంటి పేరు లేకపోవడం. తండ్రి పేరు చెప్పుకోలేకపోవడం. దానివల్ల జనంలో చిన్నచూపు. దానితో వచ్చే ఆత్మన్యూనత. దాన్ని అధిగమించడానికి అహంకార ప్రదర్శన. ఎవడైతే నాకేంటి అనే హీరోయిజం. కొందరు అభ్యుదయవాదులు దీనిని ‘ఆత్మగౌరవ’ ప్రదర్శనగా పరిగణించవచ్చు గాక. కండబలంతో బుర్రబలంతో ‘అడ్డదారుల్లో’ డబ్బు సంపాదించేసి అడ్డొచ్చిన అధికారాన్ని ఎడమకాలితో తన్నేసి, రాజ్యాధికారాన్ని సైతం ఎడమ చేత్తో మార్చేసేంత శక్తిమంతుడిగా ఎదిగిపోతాడు.

ఆ క్రమంలో పెళ్లాం కోరిక తీర్చడానికి, తనను అవమానించిన మంత్రి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి.. ముఖ్యమంత్రినే మార్చేయిస్తాడు. ఇంకా పుట్టని తన బిడ్డ కోసం వీర భక్తితో చీర కట్టుకుని నాట్యం చేసి పూజలు చేస్తాడు. తన వంశానికి చెందిన ఆడపిల్ల మానప్రాణాలను కండ బలంతో కాపాడేసి ఇంటి పేరును సంపాదించేసుకుంటాడు.

సీనియర్ జర్నలిస్ట్ రాజు రివ్యూ

సినిమా సూపర్ హిట్. పాన్ ఇండియా హిట్. జనం ఈ సినిమాని ఇంతగా ఓన్ చేసుకోవడానికి కారణం.. వాళ్లంతా పుష్పతో ఐడెంటిఫై కావడమే అని అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ లక్షల మంది పోటీపడితే ఏవేవో పరిస్థితులు అనుకూలించి ఒకడు టాపర్ అవుతాడు. ఓ కలెక్టరు గిరీనో ఓ ఎమ్మార్వో కొలువునో సంపాదిస్తాడు. ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన నలుగురు కాస్త ఊరట పొందినా మిగతా లక్షలాది మంది తమని తాము దద్దమ్మలమని అనుకునే దుస్థితి. జనసామాన్యం కూడా అలాగే చూస్తుంది మరి.

ఇక్కడ మరొకడు మాయ చేసో మోసం చేసో ధన బలంతోనో కుల బలంతోనో ఓ మోస్తరు వ్యాపారవేత్త అవుతాడు. అలా కాలేనోళ్లు తాము పనికిమాలిన వాళ్లమనుకుంటారు. మిగతా అందరూ అలా అనుకునేలా చేస్తారు. ఇంకొకళ్లు చచ్చీచెడీ ఆటలాడి ఒకటిరెండు పతకాలు గెలిస్తే వారికి వీరతాళ్లు వేసి ఊరేగించగా పేరుకు పేరూ, డబ్బుకి డబ్బూ వచ్చి పడుతుంది. మిగిలిన వాళ్లు ‘ఆడ్రా హీరో’ అని నెత్తికెత్తుకుని తమను తాము చేతగాని వాళ్లను చేసేసుకుంటారు.

ఒక ఉద్యోగం కోసం వెయ్యి మంది పోటీపడినపుడు ఆ ఉద్యోగం వచ్చినవాడు విజేత. మిగతా వారు పరాజితులు. ఒక డాక్టరు కోర్సు సీటు కోసం పది వేల మంది పిల్లలు పోటీ పడితే ఒక్కరికే దక్కుతుంది. ఆ ఒక్కరు విజేత మిగతా వారంతా పరాజితులు. ఉద్యోగం రాకపోవడానికి కారణాలుగా ముందు మన చేతగాని తనాన్ని నిందించుకుంటాం. ఆ తర్వాత సాటి వారిని తప్పుపడతాం. మనకన్నా తక్కువ మార్కులొచ్చినా కోటాలో కొట్టేశారని, నోటి కాడ కూడు లాగేశారని తిట్టుకుంటాం.

అన్ని విషయాల్లోనూ ఇంతే. అయితే స్వనింద. లేదంటే పరనింద. కానీ ‘అవసరమున్న వారందరికీ ఉద్యోగాలు ఉండాలి కదా? ఎందకు లేవు?’ అని ఆలోచించం. ‘చదువుకోవాలని కోరుకుంటున్న వారందరికీ సీట్లు ఉండాలి కదా?’ అని ఊహించం. అన్ని విషయాల్లోనూ ఇంతే. పైపెచ్చు ‘ఎన్ని ఉద్యోగాలిస్తారు? ఎన్ని సీట్లు తెచ్చి పెడతారు? డబ్బులేమన్నా తేరగా వస్తాయా?’ అని మనమే సమర్థించుకుంటాం.

ఇంకా ముందుకెళ్లి అసలు ‘కలెక్టరు పోస్టుకి రిజర్వేషన్లు ఏంటి?’ అని ప్రశ్నిస్తాం. కానీ పాకీ పనికి (ఇక్కడ కులాన్ని తక్కువ చేసే ఉద్దేశం లేదు) దరఖాస్తు కూడా చేయం. ఎందుకంటే ఊడిగం చేసే పని చెత్త అని, పెత్తనం చేసే పని గొప్ప అనే వివక్ష మన మెదళ్లలో నాటుకుపోయింది. అందుకే మన ఆలోచనలు ఎప్పుడూ అలాంటి ‘గొప్ప’ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. నిజ జీవితంలో దద్దమ్మలుగా మిగిలిపోయినా అలోచనల్లో ‘గొప్ప’ను పెంచి పోషిస్తూ ఉంటాయి. దాని చుట్టూ పగటి కలలు కంటూ ఉంటాయి. అడ్డదారుల్లో అయినా సరే గొప్ప హీరో అయిపోయి అందరి మీదా పెత్తనం చేస్తున్నట్టు కథలు కంటుంటాం. అలాంటి కథ ఒకటి తెరకెక్కినపుడు మన కలల హీరో కళ్లమందుకు వచ్చినట్టవుతుంది. ఇంకేముందు బ్రహ్మరథం పట్టేస్తాం.

‘మనమంతా సహోదరులం. సమానులం..’ అనే రాజ్యాంగ స్ఫూర్తి గురించి కానీ.. ‘మన కోసం, మన చేత, మన పేరుతో’నే నడుస్తున్న వ్యవస్థ లోటుపాట్ల గురించి ఆలోచించలేం. అలా ఆలోచించలేనంత కాలం మనం ఎర్రి పువ్వులుగానే (బూతు అర్థంలో కాదు) మిగిలిపోతాం. ఫైరు పుష్ప కలను నెత్తిన మోస్తూనే ఉంటాం.

పుష్ప సినిమా విజయం వెనుక ఉన్న మాస్ ఆడియన్స్ ప్రభావాన్ని, ‘ఎర్రి పుష్పాలు’ అనే పదానికి ఉన్న వివిధ అర్థాలను ఈ రివ్యూ విశ్లేషిస్తుంది. సీనియర్ జర్నలిస్ట్ రాజు అభిప్రాయాలు చర్చనీయాలు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.