
📌 Key Points
- సీఎస్ఆర్ నిధులపై కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.
- విద్య, వైద్యం, జలవనరులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సీఎం ప్రకటన.
- విద్యాభివృద్ధికి రహేజా, రాంకీ, యశోద ఫౌండేషన్ల నుంచి రూ.110 కోట్ల విరాళం.
- సీఎస్ఆర్ నిధుల వినియోగానికి ప్రత్యేక అధికారి నియామకం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ఆర్ నిధులపై సమీక్ష నిర్వహించారు. విద్య, వైద్యం వంటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీలకు సూచించారు. మూడు కంపెనీలు విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు విరాళం ప్రకటించాయి. ఈ నిధులను సద్వినియోగం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
సీఎస్ఆర్ నిధులపై రేవంత్ రెడ్డి సమీక్ష
సమాజాభివృద్ధికి చేసే కార్యక్రమాలను ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంపెనీలు సీఎస్ఆర్‌కు చేస్తున్న వ్యయం వందకు వంద శాతం సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యం, జల వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. కంపెనీలు వీటితో పాటు తమకు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకొని సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు.
ప్రభుత్వంతో పాటు కంపెనీలు కలిపి చేసే వ్యయంతో తెలంగాణ విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్ది భవిష్యత్ అవకాశాలను వారు అందిపుచ్చుకునేలా తయారు చేయగలమని రేవంత్ రెడ్డి అన్నారు. విద్యపై పెట్టే వ్యయాన్ని తాము భవిష్యత్ తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామని తెలిపారు.
విద్యారంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల సంఖ్యలో హైదరాబాద్ నగరంలోనే 44 శాతం ఉన్నారని.. వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు సీఎం. కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక వసతులను వినియోగించుకుంటున్న క్రమంలో తమ సీఎస్ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాలని కోరారు.
సీఎస్ఆర్ నిధుల వినియోగంలో ఇప్పటి వరకు సరైన విధానం లేనందున దీని కోసమే తాము ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించామని ముఖ్యమంత్రి తెలిపారు. కంపెనీ ల ప్రతినిధులు ఆ అధికారితో సమన్వయం చేసుకొని తమకు ఆసక్తి ఉన్న విద్య, వైద్యం, జల వనరులు, నైపుణ్య శిక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అడవుల సంరక్షణ ఇలా దేనికైనా సీఎస్ఆర్ నిధులు వినియోగించవచ్చని సూచించారు.
ఇప్పటికే రహేజా గ్రూప్ రూ.50 కోట్లు, రాంకీ గ్రూప్ రూ.50 కోట్లు, యశోద ఫౌండేషన్ రూ.10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకు వచ్చాయని.. ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. మెుత్తం మూడు కంపెనీల నుంచి విద్యాభివృద్ధి కోసం రూ.110 కోట్లు రానున్నాయి.
రూ.110 కోట్ల విరాళం ప్రకటించిన కంపెనీలు
కంపెనీల ప్రతినిధులు స్పందిస్తూ సీఎస్ఆర్ నిధుల విషయంలో ఇప్పటి వరకు ఇలా ఎవరూ తమను సంప్రదించలేదని తెలిపారు. ఈ విషయంలో చొరవ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అభినందనలు తెలిపారు. పాఠశాల విద్య, ఆసుపత్రులు, వారసత్వ కట్టడాల పరిరక్షణకు వారు ఆసక్తి చూపారు.
సమావేశంలో రహేజా ఫౌండేషన్ నుంచి శ్రావణ్ కుమార్, రాంకీ ఫౌండేషన్ నుంచి దాక్షాయణి ఆళ్ల, యశోద ఆసుపత్రి నుంచి డాక్టర్ గోరుకంటి సురేందర్ రావు, గోరుకంటి ఫల్గుణ్ రావు, మేఘా గ్రూప్ నుంచి సుధా రెడ్డి, అపోలో ఆసుపత్రుల గ్రూప్ నుంచి అపర్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో సీఎస్ఆర్ నిధులు సద్వినియోగం కానున్నాయి. దీని ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఆశిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.


