|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వైజాగ్ షిప్‌యార్డులో సంచలనం! ‘సాగర కన్య’ నౌకలో సర్పాల కాపలా! అసలేం జరుగుతోంది?

Published: 05-03-2026, 2:05 AM
వైజాగ్ షిప్‌యార్డులో సంచలనం! 'సాగర కన్య' నౌకలో సర్పాల కాపలా! అసలేం జరుగుతోంది?
  • విశాఖ షిప్‌యార్డులో ‘సాగర కన్య’ నౌకలో పాములు కలకలం
  • అండమాన్ నుండి మరమ్మత్తుల కోసం వచ్చిన నౌకలో సర్పాలు
  • సముద్ర పరిశోధనలకు ఉపయోగపడే నౌకలో పాముల భయం
  • పాములు పట్టే వారిచే తనిఖీలు, మరమ్మతులు నిలిపివేత

విశాఖ షిప్‌యార్డులో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. అండమాన్ నుండి వచ్చిన ‘సాగర కన్య’ అనే పరిశోధన నౌకలో పాములు కనిపించడంతో కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో మరమ్మత్తు పనులు నిలిచిపోయాయి.

సాగర కన్య నౌకలో పాముల కలకలం

వైజాగ్ షిప్‌యార్డులో చోటుచేసుకున్న ఓ వింత ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. సముద్ర పరిశోధనల్లో ఎంతో కీలకమైన ‘సాగర కన్య’ నౌకలో పాములు ప్రత్యక్షమవ్వడం కార్మికులను భయాందోళనలకు గురిచేస్తోంది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డు (HSL)కు అండమాన్ నుంచి మరమ్మతుల కోసం వచ్చిన ‘సాగర కన్య’ పరిశోధన నౌకలో పాములు కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. సముద్ర అధ్యయనం, భౌగోళిక పరిస్థితులు, వాతావరణ మార్పులపై అత్యంత విలువైన పరిశోధనలు చేసే ఈ నౌకను ‘సాగర కన్య’గా వ్యవహరిస్తారు. గత కొంతకాలంగా అండమాన్ నికోబార్ దీవుల తీర ప్రాంతంలో తన పరిశోధనా సేవలను ముగించుకున్న ఈ నౌక, సాధారణ మరమ్మతుల కోసం ఇటీవల విశాఖ తీరానికి చేరుకుంది. అయితే షిప్‌యార్డు కార్మికులు పనుల నిమిత్తం నౌకలో వెళ్లగా అక్కడ ఒక్కసారిగా పాములు ప్రత్యక్షమవ్వడంతో వారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఊహించని విధంగా పాములు ఎదురుపడటంతో భయపడిపోయిన కార్మికులు వెంటనే పనులను నిలిపివేసి బయటకు వచ్చేయడంతో షిప్‌యార్డులో గందరగోళ పరిస్థితి నెలకొంది.

సాగరకన్యలోకి సర్పాలు ఎలా వచ్చాయి?

అండమాన్ నుండి వచ్చిన నౌకలో సర్పాలు

ఈ పాములు నౌకలోకి ఎలా ప్రవేశించాయనే అంశంపై షిప్‌యార్డు వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ నౌక సుదీర్ఘకాలం పాటు అండమాన్ తీర ప్రాంతంలో ఉన్న సమయంలో, అక్కడి దట్టమైన అటవీ ప్రాంతాలకు సమీపంలో లంగరు వేసి ఉండటమే దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఆ సమయంలోనే పాములు నౌకలోకి చొరబడి ఉండవచ్చని, అవి నౌకలోని చీకటిగా ఉండే గదులు, యంత్రాల మధ్య దాక్కుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అండమాన్ వంటి ప్రాంతాల్లో విషపూరితమైన సర్పాలు ఎక్కువగా ఉంటాయనే వార్తలతో కార్మికులు నౌకలోకి వెళ్లడానికి సాహసించడం లేదు. ప్రస్తుతం నిపుణులైన పాములు పట్టే వారిని రప్పించి, నౌకలోని ప్రతి మూలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పనులను పునఃప్రారంభించాలని షిప్‌యార్డు యాజమాన్యం నిర్ణయించింది.

షిప్‌యార్డులో నిలిచిన మరమ్మత్తు పనులు

అయితే నౌకా సిబ్బంది ఏమంటున్నారంటే పెద్ద షిప్‌యార్డులో జెట్టీలకు, నౌకలు నిలిపేందుకు మధ్యలో పాంటూన్లను ఉంచడం వల్ల పాములు లోపలకి వెళ్లే ఆస్కారం ఉండబోదని, నౌకలోకి ఇవి ఎలా వచ్చాయో తమకు కూడా తెలియదని అంటున్నారు. అలాగే తాము అండమాన్ నుంచి విశాఖ చేరే వరకు తమకు ఎలాంటి పాములు కనబడలేదని కూడా చెబుతున్నారు. నౌక అడుగు భాగాల్లో ఏవో రహస్య వస్తువులు గాని అంతుచిక్కని మిస్టరీ ఉందని.. అందువల్లే అక్కడ భయంకర విషసర్పాలు వాటికి కాపలా ఉన్నాయనే మరో వార్త కూడా షిప్ యార్డులో షికారు చేస్తోంది. దీనిని యాజమాన్యం కొట్టివేస్తున్నప్పటికీ.. దాదాపు 3 నెలల నుంచి ఏ ఒక్క కార్మికుడు నౌకవైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

ప్రస్తుతం ఈ ఘటన షిప్‌యార్డులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాముల బెడద తొలగించి, నౌక మరమ్మతులను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.