
📌 Key Points
- బెంగళూరులో కుమారుడి చేతిలో వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది.
- పక్షవాతంతో బాధపడుతున్న తల్లిని నాలుగో అంతస్తు నుంచి విసిరి చంపిన కొడుకు.
- ఆర్థిక ఇబ్బందులు, సంరక్షణ భారం కావడం వల్లే హత్య చేసినట్లు నిందితుడి వాంగ్మూలం.
- పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
బెంగళూరులో ఒక హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. కన్నతల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుమారుడే ఆమె పాలిట యముడయ్యాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమెను నాలుగో అంతస్తు నుంచి తోసి హత్య చేశాడు.
దారుణ హత్యకు గురైన వృద్ధురాలు
జన్మనిచ్చిన కన్నతల్లిని దైవంతో సమానంగా భావించే ఈ సమాజంలో, ఓ కొడుకు కనికరం లేకుండా ప్రవర్తించిన తీరు సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అనారోగ్యంతో మంచం పట్టిన 75 ఏళ్ల వృద్ధురాలిని ఆమె కుమారుడు అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తు నుంచి కిందకు విసిరేసి హత్య చేసిన దారుణ ఘటన బెంగళూరులోని ఆర్‌ఆర్ నగర్ (RR Nagar), బీఈఎంఎల్ లేఅవుట్‌లో వెలుగులోకి వచ్చింది.
ఆర్థిక ఇబ్బందులే హత్యకు కారణమా?
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు వెంకటేష్ (Venkatesh) అలియాస్ దశరథ్ ఓ ప్రైవేటు కంపెనీ షోరూమ్‌లో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతని తల్లి సావిత్రమ్మ (75) గత ఐదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. పదేళ్ల క్రితం తండ్రి చనిపోవడంతో తల్లి సంరక్షణ బాధ్యతను వెంకటేష్ చూస్తున్నాడు. అయితే, ఆమె చికిత్సకు అయ్యే ఖర్చులు భరించడం, ఆమెను చూసుకోవడం రోజురోజుకూ తనకు భారంగా మారుతోందని వెంకటేష్ భావించాడు. బుధవారం మధ్యాహ్నం, భార్య ఉద్యోగానికి వెళ్లిన సమయంలో వెంకటేష్ తన తల్లిని ఎత్తుకుని అపార్ట్‌మెంట్ (Apaetment) నాలుగో అంతస్తుకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ఆమెను కనికరం లేకుండా కిందకు పడేశాడు. తీవ్ర గాయాలైన సావిత్రమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఏమీ తెలియనట్లుగా వెంకటేష్ తన ఇంటికి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.
పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన నిజాలు
భవనం వెనుక ఏదో భారీ వస్తువు పడినట్లుగా శబ్దం రావడంతో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఇంటి యజమాని విక్రమ్ బయటకు వచ్చి చూశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధురాలిని చూసి షాక్‌కు గురైన ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఆర్‌ఆర్ నగర్ (RR Nagar) పోలీసులు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. ‘నా తల్లి ఆరోగ్యం కుదుటపడటం లేదు. ఆమెను చూసుకోవడం కోసం గతంలో ఉద్యోగం కూడా వదిలేశాను. ప్రతిరోజూ నరకంలా అనిపించింది. అందుకే ఆమెను వదిలించుకోవాలని ఈ పని చేశా’ అంటూ నిందితుడు వెంకటేష్ పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చాడు.
ఈ ఘటన సమాజంలో మానవ సంబంధాల విలువలను ప్రశ్నార్థకం చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత కారణాల వల్ల ఇలాంటి దారుణాలకు పాల్పడటం అత్యంత బాధాకరం. నిందితుడికి కఠిన శిక్ష పడాలని ప్రజలు కోరుతున్నారు.


