
📌 Key Points
- చిన్న సినిమాల టైటిల్స్‌పై సెన్సార్ బోర్డు ఆంక్షలు విధిస్తోందని నిర్మాతల ఆవేదన.
- ‘చాయ్ వాలా’, ‘హే భగవాన్’ చిత్రాల టైటిల్స్‌ను మార్చాలని సెన్సార్ సూచన.
- టైటిల్ మార్పునకు అంగీకరించని ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్ర యూనిట్ ‘ఏ’ సర్టిఫికెట్‌కే సిద్ధం.
- పెద్ద సినిమాల విషయంలో సెన్సార్ నిబంధనలు వేరుగా ఉంటున్నాయని విమర్శలు.
టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు కష్టాలు పెరుగుతున్నాయి. తాజాగా, సినిమాల టైటిల్స్‌పై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. సుహాస్ సినిమా టైటిల్‌ను కూడా మార్చమని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
చిన్న సినిమాలపై సెన్సార్ ఆంక్షలు
Tollywood: టాలీవుడ్‌లో చిన్న సినిమాల మనుగడ రోజురోజుకీ చాలా కష్టమవుతుంది. ఒక 50 చిన్న సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటే, అందులో మినిమం ఐదారు చిత్రాలు విడుదలకు నోచుకోలేకపోతున్నాయి. ఇక సక్సెస్ పరంగా కూడా ఓ ఐదారు సినిమాలు మాత్రమే ఓ మోస్తరు సక్సెస్ అందుకుంటే, ఒకటి రెండు చిత్రాలు మాత్రం హిట్ చిత్రాలుగా నిలుస్తున్నాయి. ఇది, చిన్న సినిమాల పరిస్థితి. అలాంటి చిన్న సినిమాలకు ఇప్పుడు టాలీవుడ్‌లో సరికొత్త కష్టం వచ్చిపడింది. ఆ కష్టం ఏంటంటే.. సినిమా సెన్సార్‌కు వెళితే.. అందులో ఉన్న కంటెంట్ గురించి కాకుండా ఆ సినిమాకు పెట్టిన టైటిల్ గురించి ఎక్కువగా సెన్సార్ వాళ్లు నిబంధనలు విధిస్తుండటం. అవును, రీసెంట్‌గా ‘చాయ్ వాలా’ (Chai Wala) సినిమాకు ఇలాగే జరిగింది. ఇప్పుడు సుహాస్ నటించిన సినిమా ‘హే భగవాన్’ (Hey Bhagavan) చిత్రం ఫిబ్రవరి 20న విడుదల కాబోతుంటే.. సెన్సార్ వాళ్లు ఈ సినిమా టైటిల్ మార్చాలని డిమాండ్ చేయడం ఆశ్చర్యంగా మారింది. ఇక టీమ్ వేరే దారి లేక ‘హే బల్వంత్’ అని మార్చేశారు.
టైటిల్ మార్పునకు సెన్సార్ ఒత్తిడి
రీసెంట్‌గా విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly) చిత్రానికి కూడా టైటిల్ మారిస్తే యుబైఏ సర్టిఫికెట్ ఇస్తామని, లేదంటే ‘ఏ’ సర్టిఫికెట్ ఇస్తామని అన్నారట. ఆ సినిమా మేకర్స్ మాత్రం ‘ఏ’ ఇచ్చినా పర్లేదు కానీ, చివరి నిమిషంలో టైటిల్ మార్చి, ప్రేక్షకులను గందరగోళానికి గురి చేయలేమని చెప్పారట. మరి ఇదే పరిస్థితి స్టార్ హీరోల సినిమాలకు కూడా ఉంటుందా? అని సెన్సార్ తీరును తెలుగు సినిమా ఇండస్ట్రీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలకు ఒకలా, చిన్న సినిమాలకు మరోలా సెన్సార్ వ్యవహరిస్తుందని.. చిన్న సినిమాల నిర్మాతలు ఫైర్ అవుతున్నారు. నిజమే, టైటిల్‌లో ఎటువంటి కాంట్రవర్సీ లేకపోయినా ‘హే భగవాన్’ను ‘హే బల్వంత్’గా మార్చడం ఏంటో మరి? కావాలని చేస్తున్నారా? అనేలా నిజంగానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సెన్సార్ తీరుపై నిర్మాతల ఆగ్రహం
ఇదిలా ఉంటే, సెన్సార్ వారిని ఈ విషయంలో మెచ్చుకునే వారు కూడా ఉన్నారు. ఇంతకు ముందు ఇలాంటివి పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఈ మధ్యకాలంలో ఎవరో సెన్సార్‌కు చాలా గట్టి ఆఫీసర్ పడినట్లున్నాడు. అందుకే కాంట్రవర్సీలకు ముందే చెక్ పెట్టేస్తున్నాడనేలా కూడా మాట్లాడుకుంటున్నారు. నిజమే.. ప్రతి చిన్న విషయానికి ఈ మధ్య మనోభావాలు దెబ్బతింటున్నాయి. ‘హే భగవాన్’ అంటే ఇంకెంత మంది మనోభావాలు దెబ్బతింటాయో.. అని ముందస్తుగానే సెన్సార్ ఆఫీసర్ (Censor Officer) ఆంక్షలు విధించడం.. సినిమాకే మంచిది అనేలా, ఇంతకు ముందు ఇలాంటి విషయాల్లో కాంట్రవర్సీలను ఫేస్ చేసిన వారు అంటున్నారు. ఇదంతా చూస్తూ.. సెన్సార్ టీమ్‌లో ఉన్న ఆ టాలెంటెడ్ పర్సన్ ఎవుర్రా? అనేలా నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తుండటం విశేషం.
మొత్తానికి చిన్న సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు వ్యవహరిస్తున్న తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్యపై సినీ పరిశ్రమ ఎలా స్పందిస్తుందో చూడాలి.


