|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విశాఖ రైల్వే జోన్: గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే మంత్రి! త్వరలో ప్రారంభం!!

Published: 18-03-2026, 12:05 PM
విశాఖ రైల్వే జోన్: గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే మంత్రి! త్వరలో ప్రారంభం!!
  • విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కానున్నాయని రైల్వే మంత్రి ప్రకటన.
  • జోన్ ప్రధాన కార్యాలయ భవనం పునాది పనులు పూర్తయ్యాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి.
  • ఆంధ్రప్రదేశ్‌లో రూ.70,232 కోట్లతో రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని రైల్వే మంత్రి తెలిపారు.
  • 2025-26లో ఏపీ రైల్వే ప్రాజెక్టులకు రూ.9,417 కోట్లు కేటాయింపులు జరిగాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన.

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభమవుతాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.

త్వరలో విశాఖ రైల్వే జోన్ ప్రారంభం!

విశాఖ రైల్వే జోన్ గురించి కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడింది. త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టుగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖిత పూర్వకంగా ఈ మేరకు సమాధానం చెప్పారు. జనరల్ మేనేజర్, ఇతర ఉన్నతాధికారుల నియామకాలు పూర్తయ్యాయని వెల్లడించారు.

‘జోన్ ప్రధాన కార్యాలయ భవనం పునాది పనులు పూర్తయ్యాయి. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు లైన్‌కు రూ.2047 కోట్లు మంజూరు చేశాం. ఆంధ్రప్రదేశ్‌లో రూ.70232 కోట్లతో రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి.’ అని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. 2024లో విశాఖపట్నం లోని ముడసర్లోవ దగ్గర 52.2 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రైల్వే శాఖకు అప్పగించిందని గుర్తు చేశారు.

ఏపీ రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు

సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం కేంద్రం రూ.106.89 కోట్లు మంజూరు చేసిందని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. 2025 జనవరి నెలలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు శంకుస్థాపన జరిగిందన్నారు. ‘వీఎంఆర్డీఏ భవనం డెక్ నుంచి త్వరలోనే విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా జనరల్ మేనేజర్, ఇతర అధికారుల నియామకం కూడా త్వరలో జరుగుతాయి. ఏపీ రైల్వే ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌లో 2009 నుంచి 2014 మధ్యకాలంలో ఏటా సగటున రూ.886 కోట్లు ఏపీకి కేటాయింపులు జరిగాయి. కానీ 2025-26లో ఏకంగారూ.9,417 కోట్లు కేటాయింపులు చేశాం.’ అని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.

ఏపీలో రైల్వే ట్రాకుల నిర్మాణంలో వేగం పెరిగిందని కేంద్ర రైల్వే మంత్రి చెప్పారు. ప్రతీ ఏటా సగటున 143 కిలోమీటటర్ల మేరకు కొత్త రైల్వే ట్రాక్ పనులు చేపడుతున్నట్టుగా స్పష్టం చేశారు. అమరావతి రైల్వే లైన్ కోసం రూ.2047 కోట్లు మంజూరు చేశామని వెల్లడంచారు. అమరావతి రైల్వే లైన్ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి.. ప్రస్తుతం భూసేకరణ ప్రారంభమైందన్నారు.

కొత్త రైల్వే ట్రాక్ పనుల్లో వేగం

‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త లైన్లు, డబ్లింగ్ పనులు కలిపి మొత్తం 39 రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయి. వాటి విలువ రూ. 70,232 కోట్లు. గుంతకల్-గుంటూరు డబ్లింగ్ పనులతో పాటుగా విజయవాడ-గూడూరు మూడో లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.’ అని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.

విశాఖ రైల్వే జోన్ త్వరలో ప్రారంభం కానుండటం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించడంతో రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి వేగవంతం కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.