|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ ఒక్కటవుతున్నాయా? టెలికాం రంగంలో పెను మార్పు!

Published: 21-03-2026, 4:35 AM
షాకింగ్: వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ ఒక్కటవుతున్నాయా? టెలికాం రంగంలో పెను మార్పు!
  • వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ పరిధిని పెంచుకునేందుకు టెలికాం టవర్లు, స్పెక్ట్రమ్ పంచుకోనున్నాయి.
  • ఈ ఒప్పందం ద్వారా రెండు సంస్థలకు నిర్వహణ వ్యయం తగ్గి, ఆర్థికంగా ఊరట లభిస్తుంది.
  • గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్, పట్టణాల్లో వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ బలంగా ఉంది.
  • దేశవ్యాప్తంగా వోడాఫోన్ ఐడియాకు 20.5 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

టెలికాం రంగంలో ఊహించని పరిణామం చోటుచేసుకోనుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ చేతులు కలపడానికి సిద్ధమయ్యాయి. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు నెట్‌వర్క్ పరిధిని పెంచుకోవడమే లక్ష్యంగా ఈ సంస్థలు ముందుకు సాగుతున్నాయి.

నెట్‌వర్క్ విస్తరణకు వ్యూహాత్మక ఒప్పందం

ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు నెట్‌వర్క్ పరిధిని (Network Coverage) మరింత విస్తరించుకోవాలనే లక్ష్యంతో వోడాఫోన్ ఐడియా ప్రభుత్వ రంగ సంస్థ BSNL చేతులు కలుపబోతోంది. ఈ రెండు సంస్థలు తమ వద్ద ఉన్న టెలికాం టవర్లు (Towers), ఆప్టికల్ ఫైబర్ స్పెక్ట్రమ్ (Spectrum) వంటి వనరులను ఒకరికొకరు పంచుకోవడంపై చర్చలు ప్రారంభించాయి. మౌలిక సదుపాయాలను పంచుకోవడం వల్ల నెట్‌వర్క్ నిర్వహణ వ్యయం (Operational Costs) గణనీయంగా తగ్గుతుందని, ఇది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రెండు సంస్థలకు ఎంతో ఊరటనిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో BSNL నెట్‌వర్క్ బలంగా ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో వొడాఫోన్ ఐడియా మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ ఒప్పందం కుదిరితే రెండు సంస్థల వినియోగదారులకు మెరుగైన సిగ్నల్, డేటా సేవలు అందుతాయి. జియో, ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ సంస్థలతో పోటీ పడటానికి ఈ సహకారం అత్యంత కీలకం కానుంది. అయితే, ఈ ఒప్పందంపై తుది నిర్ణయం పూర్తిగా వాణిజ్యపరమైన అంశాలపై ఆధారపడి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

రెండు సంస్థలకు ఆర్థిక ఊరట

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వోడాఫోన్ ఐడియా సుమారు 20.5 కోట్ల మేర వినియోగదారులను కలిగి ఉంది. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలికాం ఆపరేటర్‌గా కొనసాగుతోంది. ఇందులో యాక్టివ్ కస్టమర్లు 19.3 కోట్లుగా ఉంగా.. మార్కెట్ వాటా 17.5 శాతం నుంచి 18 శాతం ఉంది. గత కొన్ని ఏళ్లుగా జియో, ఎయిర్‌టెల్ (Airtel) నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీ వల్ల వోడాఫోన్ ఐడియా ప్రతి నెలా సగటున 10 లక్షల నుంచి 20 లక్షల వరకు వినియోగదారులను కోల్పోతూ వస్తోంది. వోడాఫోన్ ఐడియా వినియోగదారులలో మెజారిటీ భాగం ఇంకా 4జీ నెట్‌వర్క్‌లోనే ఉన్నారు. ఇటీవల నిధుల సేకరణ తర్వాత 5G సేవలను విస్తరించడం ద్వారా వినియోగదారులను నిలుపుకోవాలని సంస్థ ప్రయత్నిస్తోంది.

వినియోగదారులకు మెరుగైన సేవలు

ఇక ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNLకు సుమారు 9.5 కోట్లు మంది వినియోగదారులు ఉండగా, మార్కెట్ వాటా 8 శాతం నుంచి 8.5 శాతంగా ఉంది. వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు 40 లక్షలకు పైగా ఉండటం విశేషం.

మొత్తానికి, ఈ చర్చలు సఫలమైతే టెలికాం రంగంలో ఒక కొత్త మార్పుకు నాంది పలుకుతుంది. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.