
📌 Key Points
- భారత వైమానిక దళంలో అగ్నివీర్ వాయు నియామకాలకు మార్చి 9 నుంచి 15 వరకు ర్యాలీ.
- గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాలీ నిర్వహణ.
- అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పాటుగా ఆంగ్లంలో అర్హత సాధించాలి.
- మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్.
భారత వైమానిక దళంలో అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అవివాహిత పురుషులు మరియు మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 9 నుండి 15 వరకు గుంటూరులో రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరుగుతుంది.
అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ వివరాలు
భారత వైమానిక దళం అవివాహిత భారతీయ పురుష, మహిళా అభ్యర్థుల కోసం ఇంటెక్ 02/26 కింద అగ్నివీర్ వాయు (సైన్స్ స్ట్రీమ్ కాకుండా) కోసం నియామక ర్యాలీని నిర్వహించనుంది. ఈ ర్యాలీ మార్చి 9 నుండి మార్చి 15 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నాగార్జున నగర్‌లోని NH-16లో ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద జరగనుంది. తర్వాత పరీక్షలు ఉంటాయి.
అగ్నిపథ్ పథకం కింద భారత వైమానిక దళంలో చేరాలనుకునే అర్హతగల అభ్యర్థులు నిర్ణీత తేదీలలో ర్యాలీలో పాల్గొనవచ్చు. అభ్యర్థులు అవసరమైన అన్ని పత్రాలను తీసుకెళ్లాలని, నియామక ప్రక్రియ కోసం భారత వైమానిక దళం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని అధికారులు సూచించారు.
అర్హతలు మరియు ముఖ్యమైన తేదీలు
ఈ నియామకాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులు, అలాగే ఇంగ్లిష్‌లో కూడా కనీస మార్కులు పొంది ఉండాలి.
అభ్యర్థులు జనవరి 1, 2006 నుంచి జూలై 1, 2009 మధ్య జన్మించి ఉండాలి. ఐఏఎఫ్ నోటిఫికేషన్‌లో చెప్పినట్టుగా ఎత్తు, బరువు, ఛాతీ విస్తీర్ణం, శారీరక సామర్థ్య ప్రమాణాలకు తప్పనిసరిగా సరిపోవాలి. అయితే పురుషులు, మహిళలకు ప్రత్యేకంగా నిర్దేశించిన ప్రమాణాలను పాటించాలని గుర్తుంచుకోవాలి. ఈ నియామకాల కోసం దరఖాస్తును రూ.550 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించారు. ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన తర్వాత మాత్రమే.. దరఖాస్తు ప్రక్రియ పూర్తి అయినట్టు.
ఎంపిక విధానం మరియు పరీక్షల వివరాలు
అగ్నివీర్ వాయు నియామకాలకు మూడు దశల ఎంపిక ప్రక్రియ చేస్తారు. మెుదటి దశలో ఆన్‌లైన్ రాత పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో అభ్యర్థులు అకాడమిక్ పరిజ్ఞానం, లాజికల్ ఎబిలిటీ పరీక్షిస్తారు. రెండో దశలో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌తోపాటుగా అడాప్టబులిటీ టెస్ట్ 1, అడాప్టబులిటీ టెస్ట్ 2 జరుగుతుంది. ఈ దశలో అభ్యర్థుల శారీరక దృఢత్వం, వాతావరణానికి సరిపోయే సామర్థ్యం చూస్తారు.
మూడో దశలో మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహిస్తారు. ఐఏఎఫ్ వైద్య ప్రమాణాలకు తగినట్టుగా ఉండాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాత ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. తర్వాత ఫైనల్ లిస్టును ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా ప్రకటన చేస్తుంది.
అగ్నివీర్ వాయువులో చేరాలనుకునే నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం. కావున, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొని దేశ సేవకు సిద్ధం కండి.


