|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రైతులకు పండుగే: నేరుగా ఖాతాల్లోకి రూ.6000! అన్నదాత సుఖీభవ నిధుల విడుదల ఖాయం!

Published: 10-03-2026, 10:35 PM
రైతులకు పండుగే: నేరుగా ఖాతాల్లోకి రూ.6000! అన్నదాత సుఖీభవ నిధుల విడుదల ఖాయం!
  • పీఎం కిసాన్ యోజన 22వ విడత నిధులను మార్చి 13న విడుదల చేయనున్న ప్రధాని మోదీ.
  • అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ.14,000, పీఎం కిసాన్ కింద రూ.6,000 ఆర్థిక సహాయం.
  • 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం అమలుకు రూ.6,300 కోట్లు కేటాయింపు.
  • వరి పంటకు ఇన్‌పుట్ సబ్సిడీని రూ.17,000 నుంచి రూ.25,000కు పెంచిన ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ రైతులకు కేంద్రం తీపి కబురు అందించింది. ఉగాది కానుకగా అన్నదాత సుఖీభవ పథకం నిధులను విడుదల చేయనుంది. మార్చి 13న రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ కానున్నాయి.

అన్నదాత సుఖీభవ నిధుల విడుదల తేదీ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఉగాది కానుకగా అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. పీఎం కిసాన్ యోజన 22వ విడుదల నిధులను మార్చి 13వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ విడుదల చేస్తారని కేంద్రం ప్రకటించింది. అయితే పీఎం కిసాన్ యోజన డబ్బులతో అన్నదాత సుఖీభవ పథకం నిధులను కూడా విడుదల చేస్తుంది ఏపీ ప్రభుత్వం.

దీంతో ఉగాదికంటే ముందుగానే మార్చి 13వ తేదీన అన్నదాతల ఖాతాల్లోకి సుమారు రూ.6000 జమ అవుతాయి. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతీ సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన రైతులకు రూ.20వేల ప్రభుత్వం అందజేస్తోంది. ఇందులో అన్నదాత సుఖీభవ పథకం నుంచి రూ.14000, పీఎం కిసాన్ యోజన కింద రూ.6000 అందిస్తున్నారు.

మూడు విడుతల్లో భాగంగా ఈ నిధులు జమఅవుతాయి. ఇప్పుడు పీఎం కిసాన్ యోజన 22వ విడత నిధుల విడుదలకు కేంద్రం మార్చి 13 డేట్ ఫిక్స్ చేసింది. వాటితోపాటుగా అన్నదాత సుఖీభవ నిధులు కూడా రైతుల అకౌంట్లో పడతాయి. సంక్రాంతి సమయంలోనే ఈ డబ్బులు జమ అవుతాయని అనుకున్నప్పటికీ.. పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.

పీఎం కిసాన్ యోజనతో కలిపి రైతులకు ఆర్ధిక భరోసా

పీఎం కిసాన్ యోజన సాయం అందాలి అంటే.. రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ కంప్లీట్ చేయాలి. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ స్పష్టంగా చెప్పింది. పీఎం కిసాన్ లబ్ధి అందుకునేందుకు రైతులు ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి.

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సూపర్ సిక్స్‌లో భాగంగా అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్నామని తాజాగా ఓ ప్రకటనలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. సంవత్సరానికి రూ.20,000 మూడు విడతలుగా అందిస్తున్నామని తెలిపారు. ఇందులో రాష్ట్రం నుంచి రూ.14,000, కేంద్రం నుంచి పీఎం కిసాన్ ద్వారా రూ.6,000 అందుతున్నాయని చెప్పారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం అమలుకు రూ.6,300 కోట్లు కేటాయించామని, ఇప్పటికే రెండు విడతలుగా మొత్తం రూ.6,309.44 కోట్లు రైతు కుటుంబాలకు పంపిణీ చేశామని మంత్రి వివరించారు.

పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వరి పంటకు ఇన్‌పుట్ సబ్సిడీని రూ.17,000 నుంచి రూ.25,000కు పెంచామని చెప్పారు. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు సుమారు 2 లక్షల మంది రైతులకు రూ.310 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీగా అందించామని వెల్లడించారు. గత ప్రభుత్వ కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న 81 మంది రైతుల కుటుంబాలకు చెల్లించకుండా మిగిలిపోయిన రూ.5.67 కోట్ల నష్టపరిహారాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. అదేవిధంగా మరో 214 మంది రైతుల కుటుంబాలకు రూ.14.98 కోట్ల నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కృషి

ఉద్యానవన పంటలు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు కూడా రూ.50 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీగా అందించామని అచ్చెన్నాయుడు చెప్పారు. అదేవిధంగా గతంలో సాంకేతిక కారణాలతో మిగిలిపోయిన 1.21 లక్షల మంది రైతులకు రూ.147.34 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి వెల్లడించారు. అరకు ప్రాంతంలోని కాఫీ తోటల్లో కాఫీ బెర్రీ బోరర్ వ్యాధి వ‌ల‌న‌ నష్టపోయిన 81 మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా రూ.7,23,825 ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు.

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం సమగ్రంగా పునఃసమీక్షించిందని మంత్రి తెలిపారు. వ్యవసాయ, రెవెన్యూ, పౌర సరఫరాల మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి పథకం అమలుపై విశ్లేషణ చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఖరీఫ్ 2024 సీజన్‌కు ఈ-క్రాప్ నమోదు ఆధారంగా ఉచిత పంటల బీమా అమలు చేశామని తెలిపారు. అనంతరం రైతు కూడా బాధ్యతాయుత భాగస్వామిగా ఉండేలా రబీ 2024–25 నుంచి స్వచ్ఛంద నమోదు విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు.

అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతుల ఆర్ధికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.