
📌 Key Points
- భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్తలో కూడా లక్షణాలు కనిపించడాన్ని ‘కువాడ్ సిండ్రోమ్’ అంటారు.
- సుమారు 20% నుంచి 60% మంది పురుషులు ఈ సిండ్రోమ్ లక్షణాలను అనుభవిస్తారు.
- భార్యపై ప్రేమ, సానుభూతి వల్ల పురుషుల్లో శారీరక, మానసిక మార్పులు వస్తాయి.
- విశ్రాంతి, యోగా, ధ్యానం ద్వారా ఈ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
భార్య గర్భవతిగా ఉన్న సమయంలో భర్తలో కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని వైద్య నివేదికలు తెలుపుతున్నాయి. దీనినే కువాడ్ సిండ్రోమ్ అంటారు. ఈ సిండ్రోమ్ రావడానికి గల కారణాలు మరియు నివారణ మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కువాడ్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
సాధారణంగా మహిళల్లో గర్భధారణ సమయంలో వాంతులు, అలసట, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ, ఆశ్చర్యకరంగా భార్య గర్భం దాల్చినప్పుడు భర్తల్లో కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా తండ్రుల్లో వివిధ రకాల లక్షణాలు కనిపించడాన్ని వైద్య పరిభాషలో ‘కువాడ్ సిండ్రోమ్’, (CouvadeSyndrome,) ‘సింపథెటిక్ ప్రెగ్నెన్సీ’ అని పిలుస్తారు. ఫ్రెంచ్ పదం ‘Couver’ (పొదగడం) నుండి వచ్చిన ఈ పేరు, పురుషుల్లో శారీరక, మానసిక మార్పులను సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 శాతం నుంచి 60 శాతం మంది పురుషులు తమ భాగస్వామి గర్భవతిగా ఉన్న సమయంలో ఏదో ఒక దశలో ఈ లక్షణాలను అనుభవిస్తున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
పురుషుల్లో కనిపించే లక్షణాలు
ఈ సిండ్రోమ్ రావడానికి ప్రధాన కారణం దంపతుల మధ్య ఉండే బలమైన భావోద్వేగ అనుబంధం. భార్య పడే శారీరక ఇబ్బందుల పట్ల భర్తకు ఉండే అమితమైన సానుభూతి (Empathy) వల్ల ఆమె పడే కష్టాలు భర్తలో ప్రతిబింబిస్తాయి. దీనివల్ల పురుషుల్లో వికారం (Morning Sickness), ఆకలి పెరగడం, బరువు పెరగడం, నిద్రలేమి వంటి శారీరక లక్షణాలతో పాటు ఆందోళన, చిరాకు వంటి మానసిక మార్పులు కనిపిస్తాయి. కేవలం మానసికమే కాకుండా, ఈ సమయంలో పురుషుల్లో కూడా హార్మోన్ల మార్పులు సంభవిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వారిలో ప్రోలాక్టిన్, స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలు పెరిగి, టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడం వల్ల వారు మరింత సున్నితంగా మారుతుంటారని తెలుస్తుంది.
నివారణ మార్గాలు, వైద్యుల సూచనలు
సాధారణంగా ఈ లక్షణాలు గర్భధారణ జరిగిన మొదటి మూడు నెలల్లో (First Trimester) మొదలై, రెండో త్రైమాసికంలో కాస్త తగ్గి, మళ్లీ ప్రసవ సమయానికి (Third Trimester) తీవ్రమవుతుంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇది ఏదో జబ్బు, ప్రమాదకరమైన పరిస్థితి కాదని, ఇది కేవలం తండ్రి కాబోతున్నామనే ఆందోళన, భార్యపై ఉన్న ప్రేమకు శారీరక స్పందన మాత్రమేనని వైద్య నివపుణులు స్పష్టం చేస్తున్నారు. అలాగే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తగినంత విశ్రాంతి తీసుకోవడం, యోగా, ధ్యానం చేయడం ద్వారా ఈ ఒత్తిడి నుంచి బయటపడవచ్చని. ఈ లక్షణాలు ప్రసవం తర్వాత సహజంగానే మాయమవుతాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
కువాడ్ సిండ్రోమ్ అనేది ప్రమాదకరమైనది కాదు. ఇది భార్యపై ప్రేమకు ప్రతిస్పందన మాత్రమే. సరైన విశ్రాంతి తీసుకోవడం ద్వారా దీనిని అధిగమించవచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


