|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మావోయిస్టుల్లో కలకలం: అగ్రనేత లొంగుబాటుకు సిద్ధమయ్యారా? సంచలన లేఖ!

Published: 13-04-2026, 6:05 PM
మావోయిస్టుల్లో కలకలం: అగ్రనేత లొంగుబాటుకు సిద్ధమయ్యారా? సంచలన లేఖ!
  • మావోయిస్టు పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా లొంగిపోతారనే వార్తలు.
  • కిషన్ దా రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్.
  • క్షీణిస్తున్న మావోయిస్టు ఉద్యమంపై కిషన్ దా ఆందోళన.
  • జనజీవన స్రవంతిలో కలవాలని బెస్రాకు కిషన్ దా సూచన.

మావోయిస్టు పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అగ్రనేత మిసిర్ బెస్రా లొంగిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కిషన్ దా రాసిన ఒక లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కిషన్ దా లేఖలో సంచలన విషయాలు

మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఈస్టర్న్ రీజనల్ బ్యూరో(ఈఆర్బీ) ఇన్చార్జి, జార్ఖండ్‌కు చెందిన అగ్రనేత మిసిర్ బెస్రా అలియాస్ సాగర్ తన సహచరులతో కలిసి త్వరలో లొంగిపోనున్నట్లు ఆ రాష్ట్ర మీడియా వర్గాల సమాచారం. ఈ నెల 3న రాంచీ జైలులో అనారోగ్యంతో మరణించిన మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా మార్చి 20న సాగర్(బెస్రా) పేరుతో రాసిన ఉత్తరం అక్కడి సోషల్ మీడియా సర్కిళ్లలో చెక్కర్లు కొడుతోంది. ఆ ఉత్తరంలో కిషన్ దా రాస్తూ.. ప్రస్తుతం పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయని, మధ్యభారత(సీఆర్బీ), తూర్పుభారత(ఈఆర్బీ) గెరిల్లా జోన్ ప్రాంతాల్లో తీవ్ర నష్టాలు జరిగాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాయుధ పోరాటాన్ని సరైన అర్థంలో ఇప్పుడు ముందుకు తీసుకెళ్లడం సాధ్యమేనా.. అనే విషయాన్ని ఆలోచించాల్సిందిగా కోరారు. మీరు ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని కిందిస్థాయి కేడర్లతో సంప్రదించి సముచిత నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

ఒకవేళ తగిన నిర్ణయం తీసుకోవడంలో అనవసర జాప్యం జరిగితే, మరిన్ని నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కిషన్ దా బెస్రాను హెచ్చరించారు. జనజీవన స్రవంతిలో కలిసే నిర్ణయం కనుక మనం కనుక తీసుకుంటే, ప్రభుత్వం, పోలీసులు మీపై ఎటువంటి నిర్ణయాత్మక చర్యలు తీసుకోరని స్పష్టం చేశారు. మీ నిర్ణయాన్ని వీలైనంత త్వరగా నాకు చెప్పడానికి వీలుగా ఒక ఫోన్ నంబర్ ఇస్తున్నానన్నారు. అప్పటివరకూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ కార్యకలాపాలను సాగించాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలన్నింటినీ అత్యంత రహస్యంగా ఉంచాలని కోరారు.

బెస్రా లొంగుబాటు వెనుక కారణాలేమిటి?

అయితే, ఈ ఉత్తరం నిజంగానే కిషన్ దా రాసిందేనా? ఈ నెల 3న అనారోగ్యంతో మరణించడానికి కేవలం 14 రోజుల ముందు రాశారా? అనే విషయాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది పోలీసుల సృష్టి అని కొంత మంది విశ్లేషకులు కొట్టిపారేస్తే, మరికొందరు అది నిజమేనంటున్నారు. జైలులో ఉంటూ మావోయిస్టు ఉద్యమం దేశవ్యాప్తంగా ఘోర ఓటమి పాలు కావడం, పొలిట్‌బ్యూరో సహా సీసీ సభ్యులు చాలా మంది ఆయుధాలు వదిలేసి చట్టం ఎదుట లొంగిపోవడం, చాలా మంది నేతలు ఎన్‌కౌంటర్లలో చనిపోవడం ఆయన నిత్యం పత్రికల్లో చదువుతున్నారు కనుక బాగా ఆలోచించిన తర్వాతే బెస్రాకు ఉత్తరం రాశారని భావిస్తున్నారు. జార్ఖండ్‌లో మిగిలిన తన సహచరులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో చివరి రోజుల్లో ఆ లేఖ రాసి వుంటారంటున్నారు.

మరణించిన కిషన్ దా 2021లో అరెస్టుకు ముందు కేవలం పొలిట్‌బ్యూరో సభ్యుడు మాత్రమే కాదు. ఒకప్పటి మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్(ఎంసీసీ) కేంద్ర కమిటీ కార్యదర్శి కూడా. ఆ గ్రూపును దివంగత కన్నై చటర్జీ స్థాపిస్తే, ఆయన మరణానంతరం ఆయన స్థానాన్ని కిషన్ దా భర్తీ చేశారు. పార్టీని జార్ఖండ్, బిహార్, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో చాలా బలమైన శక్తిగా అభివృద్ధి చేశారు. మిసిర్ బెస్రా ప్రారంభం నుంచీ కిషన్ దా నీడలోనే అత్యున్నత స్థాయికి ఎదిగారు. 2004లో ఎంసీసీ, పీపుల్స్ వార్ గ్రూపులు విలీనమై మావోయిస్టు పార్టీగా అవతరించినప్పుడు ఈ ఇద్దరు కూడా కేంద్రకమిటీ సభ్యులయ్యారు. కిషన్ దా పొలిట్‌బ్యూరోలో తక్షణమే నియమితులు కాగా, బెస్రాను తదనంతర కాలంలో అందులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బిహార్, జార్ఖండ్, బెంగాల్ తదితర తూర్పు రాష్ట్రాల ఉద్యమాలకు ఆయనే సారథ్యం వహిస్తున్నారు.

పోలీసుల వ్యూహమా? నిజమా?

కాగా, కిషన్ దా ఉత్తరం నిజంగానే బెస్రాకు రాసివుంటే, అది ఆయనకు చేరివుంటే ఏ నిర్ణయం తీసుకుంటారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. అయితే, తనకు గురువు లాంటి నేత అయిన కిషన్ దా కోరడం వల్లనూ, ప్రస్తుతం నిజంగానే విప్లవోద్యమం అత్యంత గడ్డు పరిస్థితులు నెలకొన్నందునా బెస్రా జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకే అవకాశాలు ఉన్నాయని జార్ఖండ్ మీడియా వర్గాలకు అందిన విశ్వసనీయ సమాచారం. ఒకవేళ జార్ఖండ్ బిహార్ రాష్ట్రాల్లో ఇప్పటికీ మిగిలిపోయిన మావోయిస్టు కేడర్ల లొంగుబాటుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కిషన్ దాను ఒప్పించి అలా లేఖ రాయించిన అవకాశాలను కూడా కొట్టివేయలేం. అప్పుడు కూడా పరిస్థితులకు తగిన విధంగా బెస్రా ఆలోచిస్తాడని, ముఖ్యంగా అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి లొంగుబాటు నేపథ్యంలో ఆయన కూడా తన సహచరులతో పాటు బయటకు వస్తాడని అంటున్నారు. ఏం జరగనుందో కొద్ది రోజుల్లో తేలనుంది.

కిషన్ దా లేఖ నిజమైనదా కాదా అనే దానిపై స్పష్టత లేదు. అయితే, బెస్రా లొంగుబాటు వార్తలు మావోయిస్టు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.