
ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ మరణం పట్ల విషాదం వ్యక్తమవుతున్న వేళ, ఆయన మరణానికి అసలు కారణాన్ని ఆయన సోదరుడు రాహుల్ దేవ్ వెల్లడించారు. కలుషిత ఆహారం, ఒంటరితనం వంటి కారణాలను ఆయన వివరించారు.
Key Points
ముకుల్ దేవ్ మరణానికి కలుషితమైన ఆహారపు అలవాట్లే కారణమని సోదరుడు రాహుల్ దేవ్ వెల్లడించారు.
ఆయన చివరి రోజుల్లో ఏమీ తినలేదు, త్రాగలేదు, ఒంటరితనం ఎక్కువగా ఎదుర్కొన్నారు.
రాహుల్ దేవ్ ముకుల్ డిప్రెషన్‌తో చనిపోయాడనే వార్తలను ఖండించారు.
తండ్రి, తల్లి మరణాల తర్వాత ముకుల్ ఒంటరిగా, నిరాశగా జీవించారని రాహుల్ తెలిపారు.
రాహుల్ దేవ్ వెల్లడి
ఇటీవల మరణించిన నటుడు ముకుల్ దేవ్ తెలుగులో చాలా సినిమాలే చేశారు. `కృష్ణ`, `ఏక్ నిరంజన్`, `కేడి`, `అదుర్స్`, `బెజవాడ`, `నిప్పు` వంటి చిత్రాల్లో విలన్‌గా నటించి ఆకట్టుకున్నారు. తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యారు. కానీ ఆ తర్వాత తెలుగులో అంతగా మూవీస్ చేయలేదు. హిందీకే పరిమితమయ్యారు. ఆయన బ్రదర్ రాహుల్ దేవ్ కూడా అనేక తెలుగు చిత్రాలు చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ముకుల్ దేవ్ హఠాన్మరణం చెందారు. మే 23, 2025 రోజున ఆయన మరణించారు. డిప్రెషన్ కారణంగా.నే ఆయన చనిపోయినట్టు ప్రచారం జరిగింది. అయితే, 24 రోజుల తర్వాత, ఆయన సోదరుడు రాహుల్ దేవ్ ఈ వార్తలను ఖండించి, అసలు కారణాన్ని వెల్లడించారు.
అన్న రాహుల్ దేవ్ చెప్పిన దాని ప్రకారం, ముకుల్ దేవ్ కలుషితమైన ఆహారపు అలవాట్ల వల్ల మరణించారని, సరైన ఫుడ్ తీసుకోలేదని తెలిపారు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ, `ముకుల్ ఎనిమిదన్నర రోజులు ICUలో ఉన్నారు. వైద్యుల చెప్పినదాని ప్రకారం, ఇది చెడు ఆహారపు అలవాట్ల వల్లే జరిగింది.
కలుషిత ఆహారపు అలవాట్లు
చివరి నాలుగు, ఐదు రోజులు ఆయన ఏమీ తినలేదు, త్రాగలేదు. ఒంటరితనాన్ని ఎక్కువగా ఫేస్ చేశాడు. బ్రతకాలనే కోరిక చచ్చిపోయింది. చాలా సినిమా ఆఫర్లను తిరస్కరించారు. అంత్యక్రియల తర్వాతే నాకు అసలు విషయం అర్థమైంది, దీంతో ఆ బాధ ఇంకా ఎక్కువైంది` అని అన్నారు.
2019లో తండ్రిని చూసుకోవడానికి ముకుల్ దేవ్ ఢిల్లీకి మారారని, అదే సంవత్సరం ఆయన తండ్రి చనిపోయారని రాహుల్ చెప్పారు. 2023లో ఆయన తల్లి కూడా చనిపోయారు. ముకుల్ ఒంటరిగా ఉండి, రచనపై దృష్టి పెట్టారని అన్న రాహుల్ అన్నారు.
తన కూతురిని చాలా మిస్ అవుతున్నారని, తనను తాను చూసుకోలేకపోయారని, ఒంటరితనం వల్ల ఎవరూ సహాయం చేయలేకపోయారని రాహుల్ చెప్పారు.
డిప్రెషన్ వార్తలపై ఆగ్రహం
ముకుల్ డిప్రెషన్‌తో బాధపడుతున్నారని, దాని వల్లే చనిపోయారనే రూమర్స్ పై రాహుల్ దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఆయనతో సంబంధం పెట్టుకోలేదు. ఆయన అనారోగ్యంతో ఉన్నారని అంటున్నారు, కానీ ఆయన హాఫ్ మారథాన్ పూర్తి చేశారు. బరువు పెరిగింది, ఎందుకంటే తనను తాను చూసుకోవడం మానేశారు.
2019 నుండి 2024 వరకు ఆయన్ని మీరు చూశారా?. ఆయన్ను ఆసుపత్రిలో చూడటానికి వెళ్లారా? ప్రార్థన సభకు హాజరయ్యారా?” అని ప్రశ్నించారు. ముకుల్ చాలా చమత్కారమైన, తెలివైన, సున్నితమైన వ్యక్తి అని, ఆయన్ను అలాగే గుర్తుంచుకోవాలని రాహుల్ వెల్లడించడం విశేషం.
ముకుల్ దేవ్ మరణం తెలుగు సినీ ప్రేక్షకులకు విషాదాన్ని కలిగించింది. ఆయన జీవితం, మరణానికి సంబంధించిన విషయాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఆయన ఆత్మకు శాంతి.


