
నవరాత్రుల్లో నాలుగవ రోజు కాత్యాయనీ దేవి పూజా కాలం. వివాహయోగం కోరుకునేవారు కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం.
Key Points
నవరాత్రుల్లో నాలుగో రోజు కాత్యాయనీ దేవిని పూజించడం చాలా ముఖ్యం.
వివాహం ఆలస్యమవుతున్నవారు కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి.
కాత్యాయనీ దేవి శక్తి, స్త్రీ శౌర్యానికి ప్రతీక.
ఆమె ఆరాధన వల్ల అడ్డంకులు తొలగిపోతాయి, ఆరోగ్యం, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయి.
కాత్యాయనీ దేవి అవతారం
నవరాత్రులు మొదలైపోయాయి. తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని తొమ్మిది రూపాలలో పూజిస్తూ వుంటారు. ప్రతి రోజు వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ఈరోజు దసరా నవరాత్రుల్లో నాల్గవ రోజు. నాలుగవ రోజు కాత్యాయనీ దేవి పూజించాలి.
దేవీ మహాత్మ్యంలో దుర్గామాత తొమ్మిది రూపాలలో ఒక రూపం కాత్యాయనీ దేవి. పురాణాల ప్రకారం ఈ అవతారం మహర్షి కాత్యాయనుడు చేసిన దీర్ఘ తపస్సు ఫలితంగా ప్రత్యక్షమైంది. అశుభ శక్తుల వినాశనం, సత్యధర్మాల స్థాపన కోసం శక్తి స్వరూపిణి కాత్యాయనీ అవతరించింది.
మహిషాసురుడు అనే రాక్షసుడు లోకాలను జయించి, దేవతలను తరిమికొట్టాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అతని మీద యుద్ధం చేయలేకపోయారు. అప్పుడు వారి శక్తులన్నిటినీ సమన్వయించి కాంతిరూపిణిగా కాత్యాయనీని సృష్టించారు. మహర్షి కాత్యాయనుని ఆశ్రమంలోనే ఆమె అవతరించిందని చెప్పబడుతుంది. అందువల్ల ఈ అవతారం “కాత్యాయనీ” అనే పేరుతో ప్రఖ్యాతి పొందింది.
వివాహయోగం కోసం కాత్యాయనీ వ్రతం
పురాణ గాథల ప్రకారం కాత్యాయనీ దేవి సింహవాహనంపై ఆరూఢమై, చతుర్భుజాలతో, ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో త్రిశూలం, మూడో చేతిలో కమలం, నాలుగో చేతితో అభయముద్రలో భక్తులకు రక్షణ వాగ్దానం చేస్తుంది. ఆమె దివ్య కాంతి రాక్షససేనలను సమూలంగా నాశనం చేసి, మహిషాసురుని సంహరించింది.
శారదా నవరాత్రుల్లో ఆరవ రోజున కాత్యాయనీ అమ్మవారిని పూజించడం ముఖ్యంగా సూచించబడింది. పురాణ వచనాల ప్రకారం ఆమెను ఆరాధించే వారికి అడ్డంకులు తొలగిపోతాయి. వివాహయోగ ప్రాప్తిని, శారీరక-మానసిక ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక శక్తిని పొందుతారని నమ్మకం. ప్రత్యేకించి వివాహయోగం ఆలస్యమవుతున్న యువతులు కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించితే త్వరితగతిన శుభముహూర్తం లభిస్తుందని స్కాంద పురాణం, మార్కండేయ పురాణం గాథలు సూచిస్తున్నాయి.
ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతి సంవత్సరం నవరాత్రుల నాల్గవ రోజు కాత్యాయనీ ఆలంకారం ఘనంగా జరుగుతుంది. తెల్లని పట్టు వస్త్రాలలో, సింహవాహనంపై దివ్యరూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తారు. దేవాలయ పరిసరాలు జై కాత్యాయనీ మాతా నినాదాలతో మారు మ్రోగుతాయి.
కాత్యాయనీ దేవి శక్తి మరియు ప్రాముఖ్యత
కాత్యాయనీ దేవి శక్తి అవతారం మాత్రమే కాదు, స్త్రీ శౌర్యానికి ప్రతీక. భక్తిలో అచంచల విశ్వాసం ఉంచిన వారికి ఆమె సర్వ రక్షణ ప్రసాదిస్తుంది. ఇక నేటి సమాజంలో స్త్రీ శక్తి ప్రాముఖ్యం పెరుగుతున్న సందర్భంలో కాత్యాయనీ అవతారం ఆరాధన మరింత విశిష్టత సంతరించుకుంటోందని పండితులు తెలిపారు.
జై కాత్యాయనీ మాతా.. జై జై కాత్యాయనీ మాతా..
కాత్యాయనీ దేవిని భక్తితో ఆరాధించడం ద్వారా వివాహయోగం లభిస్తుందని నమ్ముతారు. శారీరక, మానసిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ప్రగతికి కూడా ఇది దోహదం చేస్తుంది.


