
ప్రపంచాన్ని పీడిస్తున్న వాతావరణ మార్పులకు పురుషులు అహంకారం, పితృస్వామ్య వ్యవస్థే కారణమంటూ వార్తల్లో నిలిచింది బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా. నటి సోహా అలీ ఖాన్ నిర్వహిస్తున్న ‘ఆల్ అబౌట్ హర్’ అనే పాడ్‌కాస్ట్‌లో వాతావరణ మార్పులపై మాట్లాడిన ఈమె సంచలన కామెంట్స్ చేసింది. ‘ఈ ప్రపంచంలో వాతావరణ మార్పులకు పితృస్వామ్య వ్యవస్థే (మేల్ డామినేషన్) ప్రధాన కారణం. పురుషుల వల్లే పర్యావరణం ఇంతలా దెబ్బతింది. ఏళ్లుగా పురుషాధిక్య వ్యవస్థలు సంరక్షణ కంటే దోపిడీకే ప్రాధాన్యమిచ్చి, ప్రకృతిని, బలహీన వర్గాలను దోపిడీకి గురయ్యే వనరులుగా చేశాయి. స్ట్రీలను చూసినట్టే అడవులు, నదులను వస్తువుల్లా చూశారు. వరదలు, కరువు వస్తే మొదట ఇబ్బందిపడేది ఆడవాళ్లు, పిల్లలే. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో వారికి చోటు లేదు. ఆధిపత్యం పోయి, కరుణ, సమానత్వం ఉంటేనే వీటన్నికి పరిష్కారం దొరుకుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు కాస్త నెట్టింట వైరల్ అవుతూ వివాదానికి దారి తీస్తున్నాయి.
‘కోట్లాది రూపాయల సంపాదనతో, ప్రైవేట్ జెట్ విమానాలు వాడుతూ, లగ్జరీ కార్లలో, ఏసీ రూముల్లో బతుకుతూ సామాన్యుల కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే సెలబ్రిటీలు.. ఇలాంటి నీతులు చెప్పడం విచిత్రంగా ఉంది’ అని నెటినజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ కాలుష్యం పారిశ్రామికీకరణ, శిలాజ ఇంధనాల వాడకం, ప్రభుత్వాల విధాన లోపాలు, కార్పొరేట్ కంపెనీల స్వార్థం వల్ల వస్తున్న జాతీయ, అంతర్జాతీయ సమస్యలని, దీనికి పురుషులకు సంబంధం ఏంటని దియాను ప్రశ్నిస్తున్నారు.

