|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాలీవుడ్ ఈవెంట్స్: అతిథులు రాలేదని రోదనలు ఎందుకు? అసలు సమస్య ఇక్కడే ఉంది!

Published: 05-02-2026, 1:05 PM
టాలీవుడ్ ఈవెంట్స్: అతిథులు రాలేదని రోదనలు ఎందుకు? అసలు సమస్య ఇక్కడే ఉంది!
  • చిన్న సినిమాల ఈవెంట్లలో సెలబ్రిటీలు రాకపోవడానికి అతి భజన, కంటెంట్ క్వాలిటీ కారణం.
  • సెలబ్రిటీలను పిలిచి గంటల తరబడి డబ్బా కొట్టుకోవడం, అసభ్యకరమైన పాటలు ప్లే చేయడం విసుగు కలిగిస్తుంది.
  • చంద్రహాస్ ఈవెంట్‌లో జరిగిన రచ్చ వల్ల జేడీ చక్రవర్తి, ఆది సాయికుమార్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
  • సెలబ్రిటీలు ఈవెంట్‌కు రావాలంటే షూటింగ్ షెడ్యూల్స్, వ్యక్తిగత కారణాలు కూడా ఉంటాయి.

టాలీవుడ్‌లో చిన్న సినిమాల ఈవెంట్లకు సెలబ్రిటీలు రాకపోవడంతో దర్శకనిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, సెలబ్రిటీలు ఎందుకు రావడం లేదో తెలుసుకోవాలి. ఈవెంట్లలో జరుగుతున్న అతి భజన, నాసిరకం కంటెంటే కారణం.

సెలబ్రిటీలు ఎందుకు రావడం లేదు?

Tollywood Events: టాలీవుడ్‌లో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. చిన్న సినిమాల ప్రీ-రిలీజ్ వేడుకలోనో, సాంగ్ లాంచ్ ఈవెంట్‌లలోనో దర్శకనిర్మాతలు మైక్ పట్టుకుని ఎమోషనల్ అయిపోతున్నారు. ‘మేము ఎంతో మంది సెలబ్రిటీలను బతిమిలాడాం, కానీ ఎవరూ రావడం లేదు.. చిన్న సినిమాలంటే అంత చులకనా?’ అంటూ స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయితే, ఈ ఏడుపులు, సానుభూతి ప్రసంగాల వెనుక ఉన్న అసలు కారణాలేంటో గమనించడం లేదు. గెస్ట్‌లు రావడం లేదని బాధపడే ముందు, అసలు వారు రావడానికి ఇష్టపడకపోవడానికి కారణం ఏమిటో ఆలోచించుకోవాలని హితబోధ చేస్తున్నారు.

ఒక పెద్ద హీరో లేదా సెలబ్రిటీ (Celebrity) ఒక ఈవెంట్‌కు రావాలంటే దానికి చాలా లెక్కలు ఉంటాయి. వారికి షూటింగ్ షెడ్యూల్స్ ఉండొచ్చు లేదా ఆ సమయంలో పబ్లిక్ అప్పీరెన్స్ ఇవ్వడం వారికి ఇష్టం లేకపోవచ్చు. ఒకరిని పిలిచినప్పుడు వారు రాకపోతే అది వారి వ్యక్తిగత నిర్ణయం. కానీ, దాన్నేదో చిన్న సినిమాలపై వివక్షగా చిత్రీకరించి సానుభూతి పొందాలని చూడటం హాస్యాస్పదంగా ఉంది. నిజానికి, సెలబ్రిటీలు రావడానికి భయపడటానికి ప్రధాన కారణం అక్కడ జరిగే అతి భజన, కంటెంట్ క్వాలిటీ. చాలా చిన్న సినిమాల ఈవెంట్స్‌లో స్టేజ్ పైన జరిగే హంగామా సెలబ్రిటీలకు ఇబ్బందిగా మారుతోంది. గెస్ట్‌గా వచ్చిన వారిని కూర్చోబెట్టి, గంటల తరబడి తమ గురించి తాము డబ్బా కొట్టుకోవడం, సంబంధం లేని విషయాలు మాట్లాడటం గెస్ట్‌లకు విసుగు తెప్పిస్తోంది. అన్నింటికీ మించి, ఈ మధ్య కాలంలో ప్రమోషన్ పేరుతో చేస్తున్న చెత్త కంటెంట్ పరాకాష్టకు చేరింది. స్టేజ్ మీద డబుల్ మీనింగ్ డైలాగులు, అసభ్యకరమైన పాటలు, వికృత చేష్టలు మితిమీరిపోతున్నాయి. గెస్ట్‌గా వచ్చిన వారు ఆ సీట్లలో కూర్చుని ఆ అసభ్యతను చూస్తూ నవ్వలేక, ఏడవలేక చిన్నబోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.

కారణం అతి భజన, నాసిరకం కంటెంట్

ఇటీవల యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ (Attitude Star Chandrahass) ఈవెంట్‌లో జరిగిన రచ్చ టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఆ వేడుకకు గెస్ట్‌లుగా వచ్చిన జేడీ చక్రవర్తి, ఆది సాయికుమార్ వంటి సీనియర్ నటులు.. హీరో చేసిన ప్రవర్తన వల్ల వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకరి ఈవెంట్‌కు వెళ్లి, అక్కడ జరిగే కాంట్రవర్సీల వల్ల తమ పరువు పోతుంటే ఏ సెలబ్రిటీ మాత్రం రావాలని కోరుకుంటాడు? ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు జరిగితే, భవిష్యత్తులో నిజంగా మంచి సినిమా తీసి ఎవరైనా పిలిచినా పెద్ద హీరోలు రావడానికి పది సార్లు ఆలోచిస్తారు. పబ్లిసిటీ వస్తుందని చేసే ఇలాంటి విన్యాసాలు చివరకు సినిమా రిజల్ట్‌పైనే దెబ్బకొడుతున్నాయి. నెగిటివ్ పబ్లిసిటీ వల్ల సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న కొద్దిపాటి గౌరవం కూడా పోతోంది. చిన్న సినిమాల దర్శకనిర్మాతలు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలి. గెస్ట్‌లను పిలిచినప్పుడు వారి సమయాన్ని గౌరవించాలి. స్టేజ్ మీద గౌరవప్రదమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. మీ సినిమాలో విషయం ఉంటే ప్రేక్షకులు ఎలాగూ ఆదరిస్తారు. కానీ, కేవలం సెలబ్రిటీల రాక మీదనే సినిమా విజయం ఆధారపడి ఉంటుందని భావించడం తప్పు. ముందు కంటెంట్‌ను నమ్ముకోవాలి. స్టేజ్ మీద ఏడ్చి సానుభూతి పొందడం కంటే, ఒక పద్ధతి ప్రకారం ప్రమోషన్స్ నిర్వహించుకోవడం ఉత్తమం. ఈవెంట్లలో డిసిప్లిన్ లేకపోతే, భవిష్యత్తులో ఏడుస్తూ మొత్తుకున్నా ఏ సెలబ్రిటీ కూడా అటువైపు కన్నెత్తి చూడరనేది తాజా ఈవెంట్‌‌‌ని విశ్లేషిస్తూ.. విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వివాదాలకు దూరంగా ఉండాలనే ఆలోచన

చిన్న సినిమా దర్శకనిర్మాతలు సెలబ్రిటీలు రావడం లేదని బాధపడే బదులు, వేడుకల్లోని లోపాలను సరిదిద్దుకుంటే మంచి ఆదరణ లభిస్తుంది. కంటెంట్ క్వాలిటీపై దృష్టి పెట్టడం ముఖ్యం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.