|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టికెట్ల ధరల పెంపుపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం! హైకోర్టు ఆదేశాలకు బ్రేక్!

Published: 13-03-2026, 7:05 AM
టికెట్ల ధరల పెంపుపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం! హైకోర్టు ఆదేశాలకు బ్రేక్!
  • తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది.
  • సినిమా విడుదలకి 90 రోజుల ముందే జీవో ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
  • మైత్రీ మూవీ మేకర్స్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది.
  • ప్రస్తుతం ఉన్న టికెట్ ధరల విధానాన్నే కొనసాగించాలని సూచన.

సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం మరో మలుపు తిరిగింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేస్తూ స్టే విధించింది. దీంతో టికెట్ ధరల పెంపుపై ఊరట లభించింది.

హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే

Movie Ticket Rates: సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను.. సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. టికెట్ ధరలను పెంచాలంటే సినిమా విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేయాలని హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ నిర్ణయంపై ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం, జస్టిస్ జే.కే. మహేశ్వరి.. జస్టిస్ ఏ.ఎస్. చందూర్కర్‌లతో కూడి ఉంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ స్టే విధించింది. అలాగే ప్రస్తుతం టికెట్ ధరల పెంపుపై అమల్లో ఉన్న విధానాన్ని కొనసాగించాలని సూచించింది.

దీంతో త్వరలో విడుదల కానున్న సినిమాలకు కొంత ఊరట లభించినట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రీమియర్ షోలు నిర్వహించడం.. అవసరమైతే టికెట్ ధరలు పెంచుకోవడం వంటి అంశాల్లో నిర్మాతలకు సౌలభ్యం లభించింది.

నిర్మాణ సంస్థ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం

ఈ వివాదానికి సంక్రాంతి సమయంలో జరిగిన ఒక పరిణామం కారణమైంది. ఆ సమయంలో విడుదలైన కొన్ని తెలుగు సినిమాలకు టికెట్ ధరలను పెంచుతూ రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఒక మెమో జారీ చేశారు. ఈ నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారణ సమయంలో న్యాయస్థానం ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

భవిష్యత్తులో టికెట్ ధరలను పెంచకూడదని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ..మన శంకరవరప్రసాద్ గారు.. సినిమా విషయంలో ధరల పెంపుకు ఎలా అనుమతి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే రాజాసాబ్..సినిమా సహా మరికొన్ని చిత్రాలకు ఒకే రోజు టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇచ్చినప్పుడు ఆ విషయాన్ని కోర్టు దృష్టికి ఎందుకు తీసుకురాలేదని కూడా ప్రశ్నించింది.

టికెట్ ధరల పెంపు మెమోను పబ్లిక్ డొమైన్‌లో ఉంచిన విషయాన్ని కోర్టు సుమోటోగా పరిగణించవచ్చని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో టికెట్ ధరలను పెంచే నిర్ణయాన్ని సినిమా విడుదలకు కనీసం 90 రోజుల ముందే ప్రజలకు తెలియజేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

సినిమా టికెట్ల ధరల వివాదానికి కారణం ఏమిటి?

అయితే ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సర్వోన్నత న్యాయస్థానం ప్రస్తుతం ఆ ఆదేశాల అమలుపై స్టే విధించింది. దీంతో తెలంగాణలో సినిమా టికెట్ ధరల విషయంలో ఇప్పటివరకు అమలులో ఉన్న విధానమే కొనసాగనుంది.

సుప్రీంకోర్టు స్టే విధించడంతో, తెలంగాణలో సినిమా టికెట్ ధరల విషయంలో ఇప్పుడున్న విధానమే కొనసాగనుంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.