|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభుత్వం అనుమతించినా టికెట్ ధరలు పెంచం! ఎగ్జిబిటర్ల సంచలన నిర్ణయం, టాలీవుడ్‌లో ప్రకంపనలు!

Published: 12-05-2026, 5:00 PM
ప్రభుత్వం అనుమతించినా టికెట్ ధరలు పెంచం! ఎగ్జిబిటర్ల సంచలన నిర్ణయం, టాలీవుడ్‌లో ప్రకంపనలు!
  • ప్రభుత్వం అనుమతించినా టికెట్ రేట్లు పెంచబోమని ఎగ్జిబిటర్ల ప్రకటన.
  • ఫిక్స్‌డ్ రెంటల్ సిస్టమ్ బదులు పర్సంటేజ్ షేర్ విధానం డిమాండ్.
  • సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడకు ఇది బతుకు పోరాటం.
  • సామాన్యుడిని దృష్టిలో ఉంచుకొని ధరలు పెంచబోమని స్పష్టీకరణ.

ప్రభుత్వం అనుమతించినా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలు పెంచబోమని తెలంగాణ ఎగ్జిబిటర్లు సంచలన ప్రకటన చేశారు. ఫిక్స్‌డ్ రెంటల్ సిస్టమ్ వల్ల థియేటర్లు మూతపడుతున్నాయని, పర్సంటేజ్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సామాన్యుడికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఎగ్జిబిటర్ల సంచలన నిర్ణయం

Percentage System : మాములుగా టికెట్ రేట్లు పెంచండి మహాప్రభో అంటూ ప్రభుత్వాలని వేడుకుంటారు సినిమా మేకర్స్.కానీ ఇపుడు సీన్స్ రివర్స్ అయింది. మీరు టికెట్ రేట్స్ పెంచినా మేము మాత్రం టికెట్ రేట్లు పెంచే ప్రసక్తే లేదంటూ ఖరాఖండిగా చెప్పేయడం విశేషం.ఇంతకీ ఎగ్జిబిటర్లు ఇంత మంచి బంపర్ అనౌన్స్‌మెంట్ ఎందుకు ఇచ్చారా అని ఆలోచిస్తున్నారా ..?అసలు విషయంలోకి వెళ్దాం.

ప్రభుత్వం జీవో ఇచ్చినా సరే..

గత కొంతకాలంగా రెంటల్ సిస్టం VS పర్సెంటేజ్ షేర్ అంటూ థియేటర్ల పంచాయితీ నడుస్తున్న సంగతి తెల్సిందే. అయితే తాజాగా ఇదే విషయమై కొండాపూర్ లో సమావేశం అయ్యారు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్. ఒకవైపు మల్టీ ప్లెక్స్‌ లు మరో వైపు ఓటీటీల మధ్యలో నలిగిపోతున్న సింగిల్ స్క్రీన్లని కాపాడాలని, అందులో భాగంగా వచ్చిన వసూళ్ళలో పర్సంటేజ్ ఇవ్వాలని నిర్ణయించారు.ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్  ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

“ఇది కేవలం డిమాండ్ కాదు, ఎగ్జిబిటర్ల బతుకు పోరాటం” అని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం ఉన్న ఫిక్స్‌డ్ రెంటల్ సిస్టమ్ వల్ల థియేటర్లని నిర్వహించడం చాలా కష్టమైపోయిందని, సినిమా ఆడినా ఆడకపోయినా ఎక్కువ మొత్తంలో డబ్బులు కట్టాల్సి రావడంతో థియేటర్లు మూతపడుతున్నాయని వాపోయాడు. అందుకే ‘పర్సంటేజీ విధానం’ అమలైతేనే సింగిల్ స్క్రీన్లు నిలబడతాయని చెబుతూ “ప్రభుత్వం జీవో ఇచ్చినా సరే, సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేట్లు పెంచే ప్రసక్తే లేదు” అంటూ తేల్చి చెప్పాడు. ఇపుడు ఈ మాటలే టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి. ఎందుకంటే ఇదే రూల్ అమలైతే పెద్ద సినిమాలన్నీ భారీగా నష్టపోవడం ఖాయం. ముందుగా దీని సెగ తాకేది చరణ్ పెద్దికే.

పర్సంటేజ్ సిస్టమ్ కోసం పోరాటం

మల్టీప్లెక్స్ ‘ఆవకాయ’ అయితే.. సింగిల్ స్క్రీన్ ‘బిర్యానీ’!

ఈ సమావేశంలో చదలవాడ శ్రీనివాసరావు చేసిన పోలిక సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. “సింగిల్ స్క్రీన్ అనేది బిర్యానీ లాంటిది.. మల్టీప్లెక్స్ కేవలం నంజుకునే ఆవకాయ లాంటిది మాత్రమే” అంటూ ఆయన మాస్ ఆడియన్స్‌కు సింగిల్ స్క్రీన్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. నిర్మాతకు ఎగ్జిబిటర్ బిడ్డ లాంటి వాడని, బిడ్డ కష్టాల్లో ఉన్నప్పుడు తండ్రిలాంటి నిర్మాత ఆదుకోవాలని ఆయన కోరారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్.. ఈ ముగ్గురూ కలిసికట్టుగా ఉంటేనే టాలీవుడ్ కళకళలాడుతుందని చెప్పుకొచ్చారు.

2008 నుంచి మొదలైన యుద్ధం..

ఎగ్జిబిటర్ శ్రీధర్ మాట్లాడుతూ తమ గోడును బయటపెట్టాడు. పర్సంటేజీ విధానం కోసం తాము 2008 నుంచి పోరాడుతున్నామని,ఇక మొన్నామధ్య  ‘హరిహర వీరమల్లు’ సినిమా సమయంలో ఈ ప్రస్తావన వస్తే థియేటర్లు మూసేస్తున్నారంటూ నెగిటివ్ ప్రచారం చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పటికే కొన్ని ప్రొడక్షన్ హౌస్‌లు ఈ మోడల్ కే సపోర్ట్ చేస్తున్నాయని  చూపుతున్నాయి. అందరూ సహకరిస్తేనే ఊళ్ళల్లో, చిన్న టౌన్లలో థియేటర్లు నిలుస్తాయని ఆయన హెచ్చరించారు.

సింగిల్ స్క్రీన్ల మనుగడ ప్రశ్నార్థకం

స్టార్ హీరోలకు విన్నపం.. ఓటీటీలపై యుద్ధం!

సింగిల్ స్క్రీన్ల పట్ల ‘సవతి ప్రేమ’ చూపవద్దని, పెద్ద సినిమాల రిలీజ్ టైమ్ లో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. ఓటీటీల వల్ల థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్న ఈ సమయంలో , స్టార్ హీరోలు తమ సినిమాలను థియేటర్లలోనే చూసేలా ప్రేక్షకులను ప్రోత్సహించాలని, అలాగే తమ సమస్యల పరిష్కారానికి మద్దతుగా నిలవాలని డిమాండ్ చేస్తున్నారు.

మొత్తానికి తెలంగాణ ఎగ్జిబిటర్ల ఈ ‘పర్సంటేజ్’ పంచాయితీ ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ వద్దకి చేరింది. మరి ఇండస్ట్రీ పెద్దలు ఈ బిర్యానీ లాంటి సింగిల్ స్క్రీన్లను కాపాడుకుంటారా? లేక మల్టీప్లెక్స్ మాయలో పడి వీటిని అంతరించిపోయేలా చేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.

ఎగ్జిబిటర్ల ఈ నిర్ణయం టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. పెద్ద సినిమాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి. సింగిల్ స్క్రీన్ల మనుగడకు ఇది కీలక మలుపు కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.