
SIFPA: సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో రకాల ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో నిర్మాతలు అందరూ చిత్ర పరిశ్రమను కాపాడుకోవడం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలా చిత్ర పరిశ్రమ ఉనికిని కాపాడుకోవడం కోసం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నిర్మాతలదరూ కూడా చిత్ర పరిశ్రమ కోసం ఒకటయ్యారు. తాజాగా దక్షిణాది రాష్ట్రాలైనటువంటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన నిర్మాతలు అందరూ కూడా దక్షిణాది చలనచిత్ర నిర్మాతల సంఘం పేరిట ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తూ స్టీరింగ్ కమిటీని ప్రకటించారు.
నేడు దక్షిణాది చలనచిత్రం నిర్మాతలు అందరూ హైదరాబాద్లోని దశపల్ల హోటల్లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలను కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి అధికారక ప్రకటన వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రపదేశ్ ,తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన చిత్ర నిర్మాతలు నిర్మాతల సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా వీరంతా చిత్ర పరిశ్రమను ఏ అంశాలైతే ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయో వాటిని ఎదుర్కోవడమే లక్ష్యంగా నిర్ణయాలను తీసుకున్నారు.
ముఖ్యంగా ఈ సమావేశంలో థియేట్రికల్ నిబంధనలు అలాగే 8 వారాల ఓటీటీ విడుదల గడువు విషయంలో ఇతర విభాగాల వారు తీసుకుంటున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలను తీవ్రంగా ఖండించింది.ఇక పై ఏకపక్ష నిర్ణయాలు ఉండవని ఎలాంటి నిర్ణయమైనా నిర్మాతలది ఫైనల్ అని తెలియజేశారు. సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలే ప్రధాన రిస్క్ తీసుకునే వారు కాబట్టి వారి ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఈ స్టీరింగ్ కమిటీని నియమించారు. ప్రస్తుతానికి ఓటిటి విడుదల సమయానికి సంబంధించి ఎలాంటి హామీ పత్రాలను ఇవ్వద్దని , అందరూ ఈ విషయంపై చర్చించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని నిర్మాతలకు కీలక సూచనలు చేశారు.
ఇండస్ట్రీని కష్టాలలోకి నెట్టలేము..
సినిమా ఇండస్ట్రీ వేలాదిమంది కార్మికులకు, ఆర్టిస్టులకు జీవనోపాధిగా నిలుస్తుంది. ఇలా వేల మంది జీవనోపాధికి కారణమవుతున్న నిర్మాణ వ్యవస్థను కొన్ని నిర్ణయాల కారణంగా రాత్రికి రాత్రి కష్టాలలోకి నెట్టలేము అటువంటి ఆకస్మిక మార్పులు గందరగోల వాతావరణాన్ని కలిగిస్తాయని నిర్మాతలు తెలియజేశారు. ఈ సమావేశంలో భాగంగా ఇకపై సినిమాల విడుదలకు సంబంధించి ఏ విషయం గురించి అయినా నిర్మాతలు పూర్తి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పకనే చెప్పేశారు. ఇక ఈ సమావేశంలో భాగంగా ఓటీటీ విడుదల విండోల విషయంలో ఇలాంటి హామీ పత్రాలను అసోసియేషన్కు ఇవ్వద్దని నిర్మాతలను కోరారు. ఇలాంటి నిబంధనలను అందరితో చర్చలు చేసిన తర్వాత మాత్రమే నిర్ణయించుకోవాలని కూడా తెలిపారు.


